కార్పొరేట్ల నుంచి దేశ రక్షణే లక్ష్యం

   దేశాన్ని స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల నుంచి రక్షించి ప్రభుత్వరంగాన్ని కాపా డటమే సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్‌యూనియన్లు తలపెట్టిన సమ్మె లక్ష్యమని సిఐటియు ఆలిండియా ప్రధానకార్యదర్శి తపన్‌సేన్‌ ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖపట్నంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తపన్‌సేన్‌ మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ 'మేకిన్‌ ఇండియా' పేర దేశ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ వినాశనమే మోడీ, బిజెపి ధ్యేయమన్నారు. విమానయాన రంగం, గనులు, బ్యాంకులు, ఇన్సూరెన్సులు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేం దుకు వ్యూహం రచించారని విమర్శించారు. పైపెచ్చు సెప్టెంబర్‌ 2 దేశవ్యాప్త కార్మిక సమ్మెపై గందరగోళం సృష్టించడానికి మోడీ జులై 21, 22 తేదీల్లో లేబర్‌ కాన్ఫరెన్సు నిర్వహించి కార్మిక డిమాండ్లను పక్కదోవ పట్టించే కుట్రకు పూనుకున్నాడని విమర్శించారు. 15వ జాతీయ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, ప్రభుత్వం చేస్తానని ఒప్పుకున్నవాటిని అమలు చేసేస్తే సెప్టెంబర్‌ 2 సమ్మె జరిగి వుండేది కాదని తెలిపారు. 12 రకాల డిమాండ్లతో దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న సమ్మెకు దేశంలోని కార్మికవర్గం సిద్ధమైందని, కాంట్రాక్టు వర్కర్ల రెగ్యులరైజేషన్‌, కనీస వేతనం నెలకు రూ.15వేలు వంటి అంశాలు పరిష్కారమైతే ఈ స్థితి వచ్చేది కాదన్నారు. వీటన్నిటినీ మరుగున పరిచి ఒకపక్క కార్మివకర్గాన్ని గందరగోళంలో పడేసి మరోపక్క ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సిద్ధంగా ఉన్నాడని తపన్‌సేన్‌ వివరించారు.
అభివృద్ధి కోసం మోడీ చెప్పే గొప్పలు చూస్తే.. గత ఏడాది కాలంగా 100 ముఖ్యమైన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడంబట్టి అర్థమవుతుందన్నారు. దేశంలో 2.68 లక్షల మిలియన్‌ టన్నుల విద్యుత్‌ అవసరం కాగా కేవలం 35వేల మిలియన్‌ టన్నులే ఉత్పత్తి జరుగుతోందని, ఇంతకంటే దరిద్య్రమైన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. 2014 ఎలక్ట్రిసిటీ బిల్లు చట్టం చేసి మార్కెట్‌ శక్తులకు పాలకులు వదిలేయడమే దీనికి కారణమన్నారు. ఇప్పటికే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే విదేశాలకు 20 సార్లు పర్యటించిన మోడీ ఏం సాధించాడో చూస్తే విదేశీ కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చే పనిలో నిమగమయ్యాడని తేలిందన్నారు. ప్రపంచంలో కొరియా, చైనా స్టీల్‌ మార్కెట్‌లో అగ్రభాగాన ఉన్నాయని, భారతదేశం స్థితి దీనంగా ఉందని, స్టీల్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేయాలన్న మాట బూటకమని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు పరిశ్రమల్లో నానాటికీ పర్మినెంట్‌ కార్మికుల సంఖ్య దిగువకు పడిపోతుండగా, కాంట్రాక్టు వర్కర్లు పెరిగిపోయారన్నారు. పర్మినెంట్‌ కార్మికులు చేయాల్సిన అన్ని పనులనూ కాంట్రాక్టు కార్మికులతోనే చేయిస్తూ కనీసవేతనం రూ.15వేలు ఇవ్వాల్సిన నిబంధనను ఉల్లంఘిస్తున్నాడని మోడీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థల ఉత్పత్తిని పెంచడానికి కాంట్రాక్టు కార్మికులు చేసే కృషిని ప్రజలంతా గుర్తించాలని, ప్రభుత్వరంగాన్ని కాపాడుకోడానికి అన్ని తరగతుల ప్రజలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిఐటియు నేతృత్వంలో వీరందరినీ ఏకం చేసి ప్రభుత్వ దుష్టవిధానాలపై పోరాటానికి సిద్ధమైందని, స్టీల్‌ప్లాంట్‌లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ మహాసభలు స్టీల్‌ వర్కర్ల సమస్యలేగాకుండా ప్రభుత్వరంగానికి పొంచివున్న ముప్పుపై కార్మికులంతా చర్చించారని తెలిపారు.