రాజధాని ప్రాంతంలో రైతులను తప్ప పేదలను, దళితులను, వ్యవసాయ కార్మికులను, మైనార్టీలను, మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా తీరుమార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజధానిలోనే ప్రజలు ప్రభుత్వాన్ని పాతిపెడతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాజధానిలో పేదల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రూ. 9 వేలు పరిహారమివ్వాలని, అసైన్డ్, సీలింగ్, చెరువుపోరంబోకు భూముల లబ్ధిదారులకు పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం, డ్వాక్రా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు బైఠాయించారు. ఆందోళనకు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, రాజధానిలో ఇళ్లులేనివారికి, భూమిలేనివారికి, వృత్తిదారులకు, వ్యవసాయ కార్మికులకు పరిహారం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇంతవరకూ చెల్లించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చిమోసకారితనం రాజధాని వ్యవహారంలో తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకూ, చేసే పనులకూ ఏ మాత్రమూ పొంతన లేకుండా ఉందన్నారు. మూడు నెలలుగా ఈ ప్రాంతంలో పనుల్లేక పేదలు అవస్థలు ఎదుర్కొంటుంటే మంత్రులెవరూ దీని గురించి మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారని, రుణమాఫీ చేస్తామని చేయలేదని, పైగా బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేసి, వారికి ఉపాధి చూపించి అనంతరమే రాజధాని నిర్మించుకోవచ్చని తెలిపారు. రెండు నెలలుగా పేదలు ఉపాధి లేక అల్లాడుతుంటే అవేమీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. అడిగితే పోలీసులను అడ్డంపెట్టుకుని అణచివేద్దామనుకునే నిరంకుశ విధానాలకు రోజులు చెల్లిపోయాయని హెచ్చరించారు. రైతులు ఆందోళనకు దిగుతున్నారని తెలుసుకున్న మంత్రులు హడావుడిగా గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తున్నామని ప్రచారం చేస్తూ పేదలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉపాధి కోల్పోయే పేదల విషయాన్ని మరిచి భూములు ఎలా కొల్లగొట్టాలా అనే అంశంపైనే మంత్రుల దృష్టి ఉందని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు లక్షలాది రూపాయలు నెలవారీ భత్యాలిస్తున్న ప్రభుత్వం పనిలేని పేద కుటుంబానికి రూ. 2,500 ఇవ్వడానికి ఆలోచించడం దారుణమన్నారు. సిపిఎం క్రిడా ప్రాంతం సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ, పనిలేక పేదలు వలసలు పోవాల్సిన దుస్థితిని పాలకులు కల్పించారన్నారు. రాజధాని వస్తే జీవితాలు బాగుపడతాయని ఎదురుచూసిన పేదలను రాజధాని నుండి దూరంగా తరిమేసే చర్యలకు దిగుతున్నారని చెప్పారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పి.రామారావు మాట్లాడుతూ, ఒక కుటుంబానికి రూ. 2,500 ఇస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. ఒక్కో ఇంట్లో రెండు నుండి మూడు కుటుంబాలు నివాసముంటున్నాయని, వారిని కూడా ఒకే కుటుంబం కింద లెక్కగట్టి పరిహారం ఎగ్గొట్టే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. అనంతరం క్రిడా అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్లు రమేష్‌బాబు, రహంతుల్లాకు వినతిపత్రం సమర్పించారు