రాజరికంపై గిరిజనుల తిరుగుబాటు బావుటా కామ్రేడ్‌ దశరథ దేవ్‌

                      సిపియం కేంద్రకమిటి సభ్యులు, త్రిపుర రాష్ట్ర మాజీముఖ్యమంత్రి దశరథ్‌దేవ్‌ శతజయంతి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీ నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవతేదీన అగర్తలాలోని రవీంద్ర శతవార్షిక భవన్‌లో జరిగిన సభలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపియం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ దశరథ్‌దేవ్‌ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 'రాజా దశరథ్‌' అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్‌ దేవ్‌ ఖోవారు సబ్‌డివిజన్‌లోని సుదూర గ్రామమైన అంపురాలో 1916 ఫిబ్రవరి రెండవ తేదీన పేదగిరిజన రైతు కుటుంబంలో జన్మించాడు. ఆయన 1943లో అగర్తలాలోని ఉమాకా ంత స్కూల్‌లో మెట్రిక్యులేషన్‌లో మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోగల హబీగంజ్‌లోని బృందావన్‌ కాలేజీలో 1945లో డిగ్రీ పాసయ్యాడు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదవటానికి కోల్‌కతాలోని కాలేజిలో చేరాడు. త్రిపురలోని గిరిజనులు తరతరాలుగా విద్యకు దూరమై రాజు, ఆయన అనుచరులు, గ్రామీణ పెత్తందార్ల, భూస్వాముల దోపిడీకి గురవుతున్నారు. అమాయకులైన గిరిజనులలోని నిరక్షరా స్యతను పార ద్రోల టానికి త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో ఆయన మితృలు కొందరు గిరిజనులను విద్యావంతు లను చేసే ఉద్యమాన్ని చేపట్టారు. వారి పిలుపునందుకొని ఆయన వెంటనే త్రిపురకు తిరిగివచ్చాడు. 
1945 డిసెంబరు ఏడవ తేదీన జనశిక్షా సమితిని దశరథదేవ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. సుధన్వు దేబ్బర్మ, అఘోర్‌ దేబ్బర్మ, హేమంత్‌ దేబ్బర్మ తదితరులు ఇతర సభ్యులుగా ఉన్నారు. ఒక సంవత్సర కాలంలోనే త్రిపుర రాష్ట్రవ్యాపితంగా 488 స్కూళ్ళను ఏర్పాటు చేశారు. దీనివలన రాచరికానికి రాగల ప్రమాదాన్ని ఊహించిన రాజు అనుయాయులు ఈ ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచివేయటానికి పూనుకున్నారు. కాని దృఢనిశ్చయంతో ఉద్యమిస్తున్న జనశిక్షాసమితి నాయకులు రాజు నిరంకుశచర్యలను ఎదుర్కొంటూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. 
జనశిక్షాసమితి నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కావాలనే నినాదాన్ని క్రమంగా ముందుకు తీసుకువచ్చారు. సహజంగానే ఈ నినాదం రాజుకు ఆగ్రహం కలిగించింది. ఈ ఉద్యమాన్ని అణచివేయటానికి రాజు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించాడు. గిరిజన ప్రాంతాలలోకి వేలాదిమంది పోలీసులను, సైనికులను పంపారు. జనశిక్షాసమితి నాయకుల కొరకు వెదకుతూ గ్రామం తర్వాత గ్రామాన్ని తగులబెడుతూ వారి ఆహారధాన్యాలను కూడా తగులబెట్టారు. ఈ ఉద్యమం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చేయటానికి పోలీసులు గ్రామాలను చుట్టు ముట్టారు. పురుషు లు అడవులలోకి తప్పు కున్నారు. పోలీసులు, సైనికులు మహిళలపై అత్యాచారాలు, దాడులు చేయటం కొనసా గించారు. ఇటువంటి భయంకర పరిస్థితులలో రాజరికం గ్రామీణు లపై సాగిస్తున్న అకృత్యాలను, అణచివేతను ప్రతిఘటించటానికి 1948లో గణముక్తి పరిష త్‌ను ఏర్పాటుచేశారు. 1950లో చట్టపరంగా త్రిపురను భారతదేశంలో భాగంగా చేసి, త్రిపుర ప్రాంతీయకౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో కాంగ్రెస్‌ మెజారిటి సాధించింది. ఆ విధంగా రాజు స్థానంలో కాంగ్రెస్‌ పాలన ఏర్పడింది. కాని అది గణముక్తి పరిషత్‌ పట్ల రాజు పాలనలో అనుసరించిన విధానానికి భిన్నంగా వ్యవహరించలేదు. గిరిజన గ్రామాల లోని ప్రజలకు రాజు పాలనలో కొనసాగిన హింసాకాండ నుండి కాంగ్రెస్‌ పాలనలో కూడా ఏమాత్రం విరామం లభించలేదు. అంతే కాకుండా గ్రామీణ ప్రజలపై మరింత తీవ్రంగా ఆటవికదాడులను కొనసాగించారు. దశరథ్‌ దేవ్‌తో పాటు గణముక్తి పరిషత్‌ నాయకుల ఆచూకి తెలిపిన వారికి 10,000 రూపాయల పారితోషికం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 
రహస్య జీవితం గడుపుతూనే 1952 జనరల్‌ ఎన్నికలలో దశరథ్‌దేవ్‌ తూర్పు త్రిపుర నియోజకవర్గం నుండి పార్లమెంటుకు పోటీచేశాడు. పెద్ద మెజారిటీతో పార్లమెంటుకు ఎన్నికైన తర్వాత రహస్యంగా ఢిల్లీవెళ్ళి, పార్లమెంటులో ప్రత్యక్షమై, స్వతంత్ర భారతదేశంలో తాను స్వేచ్ఛగా సంచరించ టానికి ఎందుకు అవకాశంలేదని కేంద్ర ప్రభు త్వాన్ని ప్రశ్నించాడు. అపుడు ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ కలగజేసుకొని దశరథ్‌దేవ్‌తో పాటు గణముక్తి పరిషత్‌ నాయకు లందరిపైనా ఉన్న అరెస్ట్‌ వారెంట్‌లను రద్దు చేయమని ఆదేశించాడు. అపుడుమాత్రమే దశరథ్‌దేవ్‌, గణముక్తి పరిషత్‌ నాయకులపై ఉన్న అరెస్ట్‌ వారెంట్లను రద్దుచేశారు. పోలీసులను, సైన్యాన్ని త్రిపురలోని గిరిజన ప్రాంతాల నుండి ఉపసంహరించారు. గణముక్తి పరిషత్‌ నాయకులు స్వేచ్ఛగా సంచరించ గలిగారు.
ఆయన 1952, 1957, 1962, 1967లలో తూర్పు త్రిపుర లోక్‌సభ నియోజక వర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికైనాడు. 1978లో రామచంద్రఘాట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయాడు.
దశరథదేవ్‌ 1950లో భారత కమ్యూనిస్టుపార్టిలో చేరాడు. 1951లో జరిగిన మొదటి రాష్ట్ర మహాసభలో రాష్ట్రకార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1952లో పార్టి కేంద్రకమిటి సభ్యునిగా ఎన్నికయాడు. 1964లో పార్టిలోని రివిజనిజానికి వ్యతిరేకం గా భారత కమ్యూనిస్టుపార్టిలోని ఒక భాగం భారత కమ్యూనిస్టుపార్టి (మార్క్సిస్టు) ను ఏర్పాటు చేసినపుడు ఆయన సిపిఐ(యం)లో చేరి, కేంద్రకమిటికి ఎన్నికైనాడు. అనారోగ్య కారణాల వలన 1998లో రిలీవ్‌ అయ్యేవరకు ఆ బాధ్యతల్లో కొనసాగారు. 
పస్తులుంటున్న ప్రజలకు ఆహారాన్ని అందించాలని, గత పాకిస్థాన్‌, (ప్రస్తుత బంగ్లాదేశ్‌) నుండి వలస వస్తున్న లక్షలాది మందికి తగిన పునరావాసం కల్పించాలని పోరాడారు. దశరథ్‌దేవ్‌, నృపేన్‌ చక్రవర్తి, బిరేన్‌దత్తాల నాయకత్వాన గిరిజనుల నాలుగు ముఖ్యమైన డిమాండ్లపై జరిగిన పోరాటం ఫలితంగా 1978లో విస్తృత ప్రజామద్దత్తుతో వామపక్ష సంఘటన ప్రభుత్వం ఏర్పడింది.
అధికారంలో కొచ్చిన తర్వాత వామపక్షసంఘటన ప్రభుత్వం కొన్ని చరిత్ర సృష్టించే ప్రజానుకూల విధానాలను అమలుపరిచింది. వాటిలో గిరిజనుల భాష అయిన కోక్‌బోరక్‌ను రాష్ట్రంలో రెండవభాషగా గుర్తించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా గిరిజనులకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసింది. గ్రామీణపేదలకు పనికి ఆహారం పథకాన్ని అమలుచేసింది. మూడెకరాల లోపు భూమివున్న రైతులకు భూమిశిస్తును రద్దుచేసింది.అమలులో ఉన్న చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు బదిలీచేసిన గిరిజనుల భూములను తిరిగి వారికి అప్పగిం చింది. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతా లలో గిరిజన స్వయంప్రతిపత్తి మండలిని ఏర్పాటుచేస్తూ చట్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.ఈ విధానాలను అమలుచేస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్రంలో అస్థిరపరిస్థితులను సృష్టించటానికి, హింసా కాండను రెచ్చగొట్టటానికి స్వార్థపరశక్తులు ప్రయత్నం చేశాయి. 1980 జూన్‌లో గిరిజను లు, గిరిజనేతరుల మధ్య హింసాకాండను రెచ్చగొట్టారు. అప్పటినుండి గిరిజన వేర్పాటువాదులకు, బెంగాలీ దురహంకా రులకు ఆయన లక్ష్యంగా మారాడు. ఆయనపై జరిగిన అనేక హత్యాప్రయత్నాల నుండి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు.1978 నుండి 1988 వరకు రాష్ట్రాన్ని పాలించిన నృపేన్‌ చక్రవర్తి నాయకత్వంలోని వామపక్షసంఘటన ప్రభుత్వంలో విద్యా, గిరిజన సంక్షేమశాఖల మంత్రిగా పనిచేశాడు. 1983 నుండి 1988 వరకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1988 నుండి 1993 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టియుజెయస్‌ల సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో అర్థఫాసిస్టు నిర్బంధాన్ని కొనసాగించిన కాలంలో ప్రతిపక్ష నాయకునిగా ఆయన కీలకపాత్ర పోషించాడు. 
1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆనాడు త్రిపురలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, టియుజెయస్‌లు హింసాకాండను రెచ్చగొట్టి, రిగ్గింగ్‌ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నించాయి. కాని సిపిఐ(యం) నాయకత్వంలో జరిగిన ప్రజాపోరాటాల వలన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌కు వాయిదా వేయాల్సివచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, త్రిపురలో కేంద్రపాలన విధించారు. ఆ ఎన్నికల పోరాటంలో సిపిఐ(యం) ఘన విజయం సాధించింది. 60 స్థానాలకుగానూ 44 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది.1993 ఏప్రిల్‌ 10న దశరథ్‌దేవ్‌ రాష్ట్రముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 1998 మార్చి11 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగాడు. అధికారానికి వచ్చిన వెంటనే త్రిపురలోని వివిధ తిరుగుబాటు గౄపుల సభ్యులకు ప్రభుత్వం క్షమాభిక్షను ప్రకటిం చింది. త్రిపుర రాష్ట్రానికి మొదటి గిరిజన ముఖ్య మంత్రిగా ఆయన గిరిజనుల, పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. అనారోగ్యకారణాల వలన 1998 ఎన్నికల్లో ఆయన పోటి చేయలేదు. 
ఈ విధమైన కార్యకలాపాలను కొనసాగిస్తూ రాష్ట్రంలో గిరిజన, గిరిజనేతరుల మధ్య స్నేహ, సామరస్యాల్ని నెలకొల్పటంలో దశరథ్‌దేవ్‌ ముఖ్యపాత్ర పోషించాడు. 1964లో ఉపజాతి గణముక్తి పరిషత్‌ పేరుతో ఏర్పడిన గిరిజనుల హక్కుల పరిరక్షణా సంస్థకు చనిపోయేవరకు అధ్యక్షునిగా కొనసాగాడు. ఆయన మంచి ఉపన్యాసకుడేకాక గొప్పపార్లమెంటేరియన్‌గానూ పేరుతెచ్చు కున్నాడు. పరిపాలనాదక్షునిగా, ప్రముఖ రచయితగా, భాషాధ్యయనంలో నిపుణునిగా ఖ్యాతి గడించారు. ఆయనకు అనేక భారతీయ భాషలతో పరిచయం ఉంది. సంస్కృతం, బెంగాలీ, హింది తదితర భాషలలో పాండి త్యం ఉంది. కోక్‌బోరక్‌ భాషపై ఆధిపత్యం సాధించాడు. ఆయన ప్రత్యేకంగా చేసినకృషి ఫలితంగానే కోక్‌బోరక్‌ భాష ఉచ్ఛారణ కనుగుణంగా లిపిని రూపొందించారు. 
ఆయన రచించిన ''నాస్మృతిపథంలో ప్రజా వుద్యమాల చరిత్ర, జ్ఞాపకాలు'', ''గణముక్తి పరిషత్‌ చరిత్ర'' పుస్తకాలు రాష్ట్ర ప్రజావుద్యమాల చరిత్రకు సంబంధించి వెలకట్టలేని సంపదగా ఉన్నాయి. ఆయన రష్యా, చైనా, బ్రిటన్‌ తదితర దేశాలలో పర్యటించారు. 82 సంవత్సరాల వయసులో 1998 అక్టోబరు 14వ తేదీన మరణించారు. 
హరిపదదాస్‌