విప్లవ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు..

విప్లవ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు..

పార్టీ నిర్మాణ వ్యవహారాలు, పత్రిక కోసం రాజకీయ రచనల బాధ్యత ఉండటం వల్ల రోజూ రాత్రి 10 గంటలకు గాని ఇంటికి బయలుదేరేవారు కాదు. అప్పటి వరకూ నేనూ ఉండేవాణ్ణి. ఎన్నో విషయాలు బోధించేవారు. ఆయన జ్ఞాపకాలు చెప్పి ఉత్సాహపరిచేవారు. సమయం, సందర్భాన్ని బట్టి రచన ఉండాలనేవారు. వ్యర్థ పదాలు, పరుషమైన పదజాలం వాడకూడదనేవారు. పాఠకుడికి పరుష పదాలు చివుక్కుమనిపిస్తాయని చెప్పేవారు. ఆయా ఉద్యమ ఘట్టాలలో ఎన్నో రచనలు చేశారు. సంపాదకీయాలు రాశారు. శక్తివంతమైన విమర్శకే తప్ప పరుష పదజాలం వాడేవారు కాదు. రచనా వ్యాసంగంలో ఎంతో చేయి తిరిగిన మేటి అయితేనే అది సాధ్యమవుతుంది. యం.హెచ్‌. ఈ రెండు అక్షరాలు ఎంతో విలువైనవిగా విరాజిల్లుతున్నాయి. కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావుగారికిది పొట్టిపేరు. ఆయన విప్లవ రాజకీయాలలో అలుపెరుగని యోధుడు. ఆయన్ని గురించి రాసేంతటి గొప్పవాణ్ణేమీ కాదు గానీ ఆయన నాకు చేసిన మేలు, ఇచ్చిన ప్రోత్సాహం నేనెన్నటికీ మరువలేను. ఎక్కడో నెల్లూరు జిల్లాలో అట్టడుగు నుంచి వచ్చిన నాకు ఈ నాలుగు మాటలు రాయగలిగినంతటి శక్తినిచ్చిన మహా నాయకుడు ఎం.హెచ్‌. ఆనాటి నాయకులు, ఉద్యమ కార్యకర్తలు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు. కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఎందరో తమ ప్రాణాలు బలిదానం చేశారు. ఆ తరం వారికి త్యాగం, పట్టుదల స్ఫూర్తిదాయకంగా ఉండేవి. ఉద్యమంలో యువకార్యకర్తలకు ఆయన వెన్నుదన్నుగా ఉండేవారు. ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించి అభివృద్ధి పర్చారు. కామ్రేడ్‌ ఎం.హెచ్‌. కష్టాల్లో పుట్టారు. కష్టాల్లో పెరిగారు. నిర్బంధంలోనే ఆయన విప్లవ జీవితం ప్రారంభమయ్యింది. అజ్ఞాతవాసం, జైలు జీవితాల్లో ఆయన పండిపోయారు. ఎన్నో సామాజిక, విప్లవ అనుభవాలు గడించారు. అంతటి గొప్ప నాయకుడితో ప్రత్యక్షంగా కలిసి పనిచేసే అవకాశం నాకు లభించింది. జనశక్తి దినపత్రిక ఆవిష్కరణ 1966 సెప్టెంబరు 26న జరిగినట్లు నాకు గుర్తు. ఆ దినపత్రికలో పనిచేయడానికి పంపాలని నెల్లూరు జిల్లా నాయకత్వం కామ్రేడ్‌ వి శ్రీహరి గారిని, నన్ను నిర్ణయించింది. పది, పదిహేను రోజుల ముందుగానే కామ్రేడ్‌ శ్రీహరిగారు వచ్చారు. కామ్రేడ్‌ నండూరి ప్రసాదరావుగారు ఇచ్చిన టెలిగ్రాం అందిన వెంటనే విజయవాడకు వచ్చేశాను. విజయవాడ రాజగోపాలాచారి వీధిలో రాష్ట్ర కమిటీ కార్యాలయం, జనశక్తి సంపాదక వర్గం, ఆఫీసు, ప్రెస్‌, కంపోజింగ్‌ సెక్షన్‌ ఉండేవి. అదంతా నాకు కొత్తగా ఉంది. వార్తా పత్రిక ఎలా ముద్రితమవుతుందో కూడా నాకు అంతకు ముందు తెలీదు. ఉదయం 9 గంటలకు కామ్రేడ్‌ ఎం.హెచ్‌. గారు వచ్చారు. ఆయన్ని కలవమని ప్రెస్‌ మేనేజర్‌ చెప్పారు. పై అంతస్తులో ఆయన కార్యాలయం, ఆ పక్కనే సంపాదక వర్గం ఉండేవి. వెళ్లి నమస్తే కామ్రేడ్‌ అని అన్నాను. నెల్లూరు నుంచి వచ్చాను. ఓ, కామ్రేడ్‌ రామయ్యగారా! కూర్చోండి అని కుర్చీ చూపించారు. నాలాంటి సామాన్య కార్యకర్తలకు ఇంతటి మర్యాద, గౌరవం ఇచ్చారేమిటని ఆశ్చర్యపోయాను. అప్పుడు నా ఒంటి మీద మాసిపోయిన చొక్కా, లుంగీ మాత్రమే ఉన్నాయి. ఆయన చూశారు. ఏమనుకున్నారో ఏమో తెలియదు. రామయ్యగారూ, మీరు సంపాదక వర్గంలో పనిచేయండి అని అన్నారు. నిజంగా అది అపాయింటుమెంటే. నేను కాసేపు గమ్ముగా ఉండిపోయాను. ఇక్కడ విషయాలన్నీ కొత్తగా ఉన్నాయి. ఉపసంపాదకత్వానికి ముందు చేయగలిగిన పని ఏదైనా ఉంటే అది చెప్పండి చేస్తాను అని అన్నాను. ఆల్‌రైట్‌ అని లేచారు. నా భుజం మీద చేయి వేసి కిందికి తీసుకెళ్లారు. రామయ్యగారు మీతో పాటు ప్రూఫ్‌రీడింగ్‌ చేస్తారు అని చెప్పి వెళ్లారు. అది పత్రికా రంగంలో నా పనికి నాంది. స్వల్పకాలంలోనే మెలకువలన్నీ అలవర్చుకున్నాను. అనువాదం చెయ్యాలనే కుతూహలం ఏర్పడింది. అభ్యాసానికి ఉపక్రమించాను. దక్షిణ వియత్నాంపై అమెరికా దురాక్రమణ యుద్ధం సాగుతున్న రోజులవి. ఆ యుద్ధ వార్తల పట్ల యువకులు ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తుండే వాళ్లు. 'వియత్నాం' అనే జర్నల్‌ హనోరు నుంచి వస్తూండేది. అందులో ఉత్తేజకరమైన సంఘటనలు వస్తుండేవి. అందులోంచి వ్యాసాలు అప్పుడప్పుడు తర్జుమా చేసి సంపాదక వర్గానికి పంపేవాణ్ణి. అవి అచ్చయి వచ్చినప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉండేది. కామ్రేడ్‌ దొప్పలపూడి వెంకటేశ్వరావుగారు ఉపసంపాదకులుగా ఉండేవాడు. యుద్ధవార్తలు ఆయన రాస్తుండేవారు. ఒక రోజు సాయంత్రం ఆయన నన్ను రాఘవయ్య పార్కుకు తీసుకెళ్లారు. కూర్చున్నాం. దక్షిణ వియత్నాంలో ఒక యువనాయకుడు ఎన్‌ గుయెన్‌వాన్‌ ట్రారుని అమెరికా ముష్కరులు ఉరి తీశారు. అతనికి 'హీరో ఆఫ్‌ సౌత్‌ వియత్నాం' అని హోచిమిన్‌ బిరుదిచ్చారు. ఎంతో ఉత్తేజకరమైనది ఆయన కథ. దానిని మీరు తర్జుమా చేయాలని అన్నారు. నేను భయపడ్డాను. ఆయన ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. అప్పుడు ఓ సంగతి చెప్పారు. కామ్రేడ్‌ ఎం.హెచ్‌.గారు జైల్లో ఉన్నప్పుడు తానే ఒక వియత్నాం నవలను పంపించారట. దానిని ఎం.హెచ్‌.గారు అనువదించి పంపారట. అది అచ్చయింది. అదే 'రాబందుల రాజ్యం'. ఆ నవల మంచి సంచలనం సృష్టించింది. ఇవన్నీ చెప్పి ట్రారు నవల అనువాదానికి నన్ను ఉపక్రమింపజేశారు. అనువాదం పూర్తయిన తర్వాత కామ్రేడ్‌ బొమ్మారెడ్డిగారికి ఇచ్చాను. జనశక్తి ఆదివారం సంచికలో సీరియల్‌గా ప్రచురించారు. మంచి ప్రశంసలు అందాయి. ఒకరోజు ఎం.హెచ్‌గారు నా భుజం తడుతూ సంపాదక వర్గం ఆఫీసుకు తీసుకువెళ్లి రామయ్యగారు మీ దగ్గరే పనిచేస్తారు అని బొమ్మారెడ్డిగారికి అప్పగించారు. కొద్దివారాల్లోనే పనికి అలవాడు పడ్డాను. నా స్వయం కృషిని గానీ, అభ్యాసాన్ని గానీ ఆపలేదు. కొనసాగిస్తూనే ఉన్నాను. ఒకసారి జ్వరంతో వారం రోజులపాటు మంచం పట్టాను. యం.హెచ్‌. గారు స్వయంగా మా ఇంటికొచ్చారు. ఒక డజను బత్తాయిలు కూడా తీసుకొచ్చారు. కాస్త బత్తాయి రసం తీసుకో కొంచెం శక్తినిస్తుంది అని పరామర్శించి వెళ్లారు. నాకెంతో సంతోషం కలిగింది. నేను కాదు యువ కార్యకర్తలెవరైనా సరే సుస్తీ చేస్తే ఆయన తల్లడిల్లేవారు. వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పేవారు. కార్యకర్తల పట్ల అలాంటి శ్రద్ధ తీసుకునేవారు. పత్రికా రచనా వ్యాసంగంలో ఆయన నాకిచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. పార్టీ నిర్మాణ వ్యవహారాలు, పత్రిక కోసం రాజకీయ రచనల బాధ్యత ఉండటం వల్ల రోజూ రాత్రి 10 గంటలకు గాని ఇంటికి బయలుదేరేవారు కాదు. అప్పటి వరకూ నేనూ ఉండేవాణ్ణి. ఎన్నో విషయాలు బోధించేవారు. ఆయన జ్ఞాపకాలు చెప్పి ఉత్సాహపరిచేవారు. సమయం, సందర్భాన్ని బట్టి రచన ఉండాలనేవారు. వ్యర్థ పదాలు, పరుషమైన పదజాలం వాడకూడదనేవారు. పాఠకుడికి పరుష పదాలు చివుక్కుమనిపిస్తాయని చెప్పేవారు. ఆయా ఉద్యమ ఘట్టాలలో ఎన్నో రచనలు చేశారు. సంపాదకీయాలు రాశారు. శక్తివంతమైన విమర్శకే తప్ప పరుష పదజాలం వాడేవారు కాదు. రచనా వ్యాసంగంలో ఎంతో చేయి తిరిగిన మేటి అయితేనే అది సాధ్యమవుతుంది. పార్టీలో మితవాద, అతివాద పెడ ధోరణులు ఏర్పడి పార్టీని విచ్ఛిన్నం చేశాయి. మితవాద పెడధోరణి గురించి సులభంగా అర్థమయ్యేట్లు ఎలా చెప్పారో చూడండి : ''నెహ్రూ ప్రభుత్వంతో ఐక్య సంఘటన కట్టాలన్నది మితవాద ధోరణి, వర్గ విప్లవం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అన్నది మార్క్సిస్టు అవగాహన. బడా బూర్జువా వర్గ నాయకత్వాన ఉన్న బూర్జువా భూస్వామ్య పాలనలో వర్గ సామరస్యంగా సోషలిజానికి పోవడం బొందితో కైలాసానికి పోవడం వంటిదే. అది భ్రమ. ఇది మార్క్సిస్టు పార్టీ తీసుకున్న అవగాహన. ఈ రెండు వైఖరుల మధ్య చెలరేగిన తీవ్ర సైద్ధాంతిక ఘర్షణల ఫలితంగా మార్క్సిస్టు పార్టీ పునర్నిర్మాణం కాక తప్పదు'' అని విశదీకరించాడు. అతివాద పెడధోరణి గురించి ఎలా స్పష్టీకరించారో చూడండి! పార్టీలో కార్మిక వర్గ బలం కొరవగా ఉన్నందున పెటీ బూర్జువా మితవాద, అతివాద పెడధోరణులు కవల పిల్లల వలే పార్టీ విచ్ఛిన్నానికి దారితీశాయి. 1964లో మితవాద కమ్యూనిస్టులతో తెగతెంపులు చేసుకున్న మార్క్సిస్టు పార్టీ సంఘటిత పడకముందే నక్సలైట్‌ అతివాద ధోరణి తలెత్తింది. దాన్ని త్రోసిపుచ్చి పార్టీ నిలదొక్కుకుంటూ వచ్చింది. 1964లోనే కాక 1968లోనూ నాయకత్వం అన్ని స్థాయిల్లో ఎక్కువ భాగం పెడ మార్గమే పట్టింది. ఈ సందర్భంలోనే ఆయన ''శత్రువుల కులుకుకూ, మిత్రుల ఆవేదనకు కారణమైన నక్సలిజం'' అనే పుస్తకం రాశారు. వాటితో పాటు వేర్పాటువాద విచ్ఛిన్నాలు పార్టీకి ఎంతో నష్టం చేశాయి. 1969 నుంచి జై తెలంగాణ, 1972 నుంచి జై ఆంధ్ర ఉద్యమాలు చిచ్చురేపాయి. వీటికి వ్యతిరేకంగా పార్టీ ధీరోదాత్తంగా సమైక్యాంధ్ర కోసం నిలబడింది. వీర తెలంగాణ కోరింది వేరు తెలంగాణ కాదు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని రాశారు. పార్టీ ఎదుర్కొన్న ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఆయన ఎంతో ఆవేదన చెందేవారు. మొక్కవోని ధైర్యం ప్రదర్శించేవారు. ఆయన కలం కరవాలంలా పనిచేసేది. ప్రపంచీకరణ దుష్ఫలితాలు, పశ్చిమబెంగాల్‌, కేరళలో ఎదురుదెబ్బలు తిన్న ప్రస్తుత సమయంలో ఆయన రాసిన ఈ క్రింది విషయాలు ఎంతో ధైర్యాన్నిస్తాయి. చూడండి. ''కామ్రేడ్‌ సుందరయ్య గారు అస్తమించిన తరువాత జలగం వెంగళరావు మాట్లాడుతూ సుందరయ్య లేరు గనుక మార్క్సిస్టు పార్టీ పని అయిపోయింది'' అని అల్ప సంతోషం పొందారు. అందుకు కామ్రేడ్‌ యం.హెచ్‌ గారు ఎలా ఘాటైన సమాధానం చెప్పారో చూడండి! ''ఏకో నారాయణ అంటూ పదవుల కోసం కుక్షింభరులవలే ఏ ఇందిరాగాంధీనో, రాజీవ్‌ గాంధీనో పట్టుకుని వేలాడడం కంటే పరమార్థం లేని వెంగళరావుకు, ఆయన పార్టీకి అంతకు మించి బుర్ర పని చెయ్యదు. కనుచూపు ఆనదు. కామ్రేడ్‌ సుందరయ్యగారు లాంటి మహా పురుషులు ఆశించిందీ, నిర్మించిందీ తన చుట్టూ తిరిగే పార్టీని కాదు. మార్క్సిజం, లెనినిజం అన్న మానవాళి విముక్తి సిద్ధాంతాన్ని, విశ్వసత్యాన్ని, అంతర్జాతీయతను ఆయన శిరోధార్యంగా భావించి ఈ పార్టీని నిర్మించడానికి దోహదం చేశారు. ఆయన ఆశయం పోయేది కాదు. ఆయన పార్టీ పోయేది కాదు. ఆయన ఒక వ్యక్తికాదు, ఉద్యమం. నాటికీ, నేటికీ, భవిష్యత్తుకు అదే అనుసరణీయం. అచంచల విశ్వాసంతోనే యువలోకం ముందుకు పోతుంది.'' ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమయాల్లో, సన్నివేశాల్లో ఆయనతో నాకు ఎంతో స్వానుభవం ఉంది. స్వగతం అని ఎవరైనా అంటారేమోననే భయం కొద్దీ ఆయన చెప్పిన పాఠాలను, నేర్పిన జర్నలిజం విద్యను గురించి పరిమితం చేశాను. అంతటి పార్టీ నాయకుడికి కాంస్య విగ్రహాన్ని తన జన్మ స్థలంలో ఆవిష్కరించడం సంతోషదాయకం. అది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆయన విప్లవ మార్గంలో నడవడం కంటే ఆయనకు మనం ఇచ్చే నివాళి ఏముంటుంది! - - -పాటూరు రామయ్య