అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 'కరోనా వైరస్ అనేది ఒక సామాన్య ఫ్లూకి సరిసమానం' అని మొదట ప్రకటించారు. మార్చి 4న ఒక టీవీ చానల్‌లో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ అనేది ఫ్లూ అంత ప్రమాదకారి కాదు. సాధారణ ఫ్లూ కారణంగా సంవత్సరానికి 27,000 నుంచి 77,000 మంది చనిపోతుంటారు' అని కూడా సెలవిచ్చారు. ఒక వారం తరువాత 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్' డాక్టర్ ఆంటోని ఫ్లూసీ అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడుతూ 'కరోనా వైరస్ వలన మరణాలు సాధారణ ఫ్లూ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటాయని' చెప్పారు. ఫ్లూ వలన జరిగే మరణాలు 0.1 శాతం ఉంటే, కరోనా వైరస్ వల్ల 3.4 శాతం ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు కోవిడ్-19 పట్ల ట్రంప్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో అర్థం చేసుకోవడానికి. ఈ మహమ్మారి వలన అమెరికా ప్రజలకు గానీ ప్రపంచ ప్రజలకు గానీ తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నదన్న స్పృహే ఆయనకు లోపించింది.ట్రంప్ బహిరంగంగానే కరోనా వైరస్ విషయంలో మొండిగా ఉండటమే కాదు. ఆయన ప్రభుత్వం అంటువ్యాధుల నివారణకు బడ్జెట్‌లో కోతలు పెట్టింది. అందులో భాగంగానే అంటువ్యాధుల నివారణకు తక్షణ చర్యల రిజర్వు నిధికి 35 మిలియన్ డాలర్ల కోత విధించింది. వ్యాధుల నివారణ, ముందు జాగ్రత్త కేంద్రాలకు (సీడీసీ) 15 శాతం నిధుల కోత (1.2 బిలియన్ డాలర్లు) విధించింది. మరో సంస్థ ఫెడరల్ ప్రజారోగ్య అత్యవసర సంసిద్ధత కార్యక్రమం నిర్వహించేది. 2002 నుంచి 2019 వచ్చేసరికి బడ్జెట్‌లో 3వ వంతు కోల్పోయింది. ఇప్పుడు దానికి కేవలం 617 మిలియన్ డాలర్లు కేటాయించారు. దీని ఫలితంగా శిక్షణ పొంది కూడా ఈ మహమ్మారి వచ్చిన సమయంలో పని చేసే ఆరోగ్య కార్యకర్తలు లేకుండా పోయారు. వీరు బస్తీ స్థాయిలో పని చేసేవారు. పొదుపు చర్యల్లో భాగంగా జరిగిన కోతల ప్రతిఫలం ఇది. సామాజిక సేవలు, ప్రజారోగ్యశాఖలో పని చేసే ఉద్యోగులను తొలగించారు. మహమ్మారి వచ్చినప్పుడు పనిలో పూనుకునే వ్యవస్థను గోళ్లు ఊడగొట్టి పంపివేశారు.అమెరికా ఆరోగ్యశాఖ మొత్తానికి పెట్టిన కోతలలో అంతర్భాగమే ఈ మహమ్మారి నివారణ శాఖకు పెట్టిన కోతలు కూడా. 2019లో 30 పెద్ద ఆస్పత్రులు దివాళా తీసినట్టు ప్రకటించాయి. మిగతావి చావలేక బతకలేక అన్నట్టు నడుస్తున్న పరిస్థితి. దానికి ప్రధాన కారణం ప్రభుత్వపరంగా అందాల్సిన ఆర్థిక సహాయం అందకపోవడమే. రెండవది ధరలు విపరీతంగా పెరిగిపోవడం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలు అందించే ఆస్పత్రులు, ప్రజారోగ్య కేంద్రాలను మిళితం చేసి చాలా వాటిని మూసివేశారు. సేవా కార్యక్రమాలను అందించే వాటిని పెద్ద ఆస్పత్రులకు బదిలీ చేశారు. ఇవి ధనవంతులు ఉండే ఖరీదైన ప్రాంతాలలో ఉంటాయి. అక్కడికి పట్టణ, గ్రామీణ పేదలు వెళ్ళలేరు. దానితో వీరికి వైద్యం అందకుండా పోయింది. ఈ పెద్ద ఆస్పత్రులలో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకే వైద్యం చేస్తారు. అవి కూడా భారీ మొత్తాల్లో ఉంటాయి. కాబట్టి పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడి అయింది. డబ్బున్న వారు ప్రభుత్వం అందించే వైద్య సేవలు స్వీకరించడానికి సుముఖంగా కూడా లేరు.దవాఖానాలు ఏకీకరణ చేయడంతో, పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి ఆరోగ్య రంగం వెళ్ళిపోయింది. బైన్ క్యాపిటల్, కెకెఆర్, జోయిల్ ఫీడ్‌మెట్ లాంటి సంస్థలు హస్తగతం చేసుకున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యం తప్ప ప్రజల ఆరోగ్య సేవ కాదు. ఈ మార్పుల పర్యవసానంగా ఏదైనా మహమ్మారి వచ్చి వరదలా రోగులు వస్తే ఆస్పత్రులు వాటిని తట్టుకునే స్థితిలో లేవు. ఇప్పుడు మొత్తం పడకలను, పరికరాలను గరిష్ట స్థాయిలో వాడుకుని లాభాలు సంపాదించాలనేదే లక్ష్యం. మిగతా విషయాలేవీ వాటికి పట్టదు.ట్రంప్ ఆధ్వర్యం లోని ఆరోగ్య వ్యవస్థలో ఒక ప్రమాదకర ధోరణి కనబడుతోంది. ఏదైనా మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోగల మౌలిక సౌకర్యాలున్న ఆరోగ్య వ్యవస్థ లేకుండా పోయింది.
వరల్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్' కరోనా వైరస్ ప్రమాదం మీద అధ్యయనం చేసి కొన్ని గణాంకాలను వెలువరించింది. వాటిని ఇటలీలో జరుగుతున్న పరిణామాలతో పోల్చి చూస్తే... అమెరికాలో ఒక కోటి నుంచి 3.5 కోట్ల మంది ఆస్పత్రులకు రావచ్చు. కనీసం 2 లక్షల మందికి ఐసీయూలు అవసరం కావచ్చు. అయితే 45,000 ఐసీయూ పడకలు మాత్రమే ఉన్నాయి. అవి ఏ మూలకూ సరిపోవు. అమెరికాలో ప్రతి వెయ్యి మందికి 2.8 ఆస్పత్రి పడకలు మాత్రమే ఉన్నాయి. అదే చైనాలో 4.3, దక్షిణకొరియాలో 12.3 ఉన్నాయి. వుహాన్‌లో 10 రోజులలో రెండు పెద్ద ఆస్పత్రులను నిర్మించారు. అమెరికాలో ఇప్పటికీ ఆ ఊసే లేదు. చివరికి అమెరికాలో సైన్యమే దిక్కు అవుతుందేమో.ట్రంప్ ఈ సమస్య పరిష్కారం కోసం డబ్బులు వెదజల్లడం ప్రారంభించారు. మొదట 8.3 బిలియన్ డాలర్లు, రెండవ విడత 50 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఇంత మొత్తం ఇవ్వడం కీలకమే అయినప్పటికీ అమెరికాలో ఆస్పత్రులు మెరుపు వేగంలో నిర్మించలేరు. తక్కువ సమయంలో నర్సులకు శిక్షణ ఇవ్వలేరు. పొదుపు చర్యల వలన ప్రయివేటు ఆస్పత్రులు డబ్బు దండుకున్నాయి. కానీ శిక్షణ పొందిన సిబ్బందిని అట్టిపెట్టుకోలేదు. వాళ్ళే ఇప్పుడు అత్యవసర స్థితిలో పనికివచ్చేది. ట్రంప్ ఇచ్చిన డబ్బులతో పరికరాలు కొనుగోలు చేయాలన్నా అవి మూతపడి ఉన్నందున పరికరాలు అందుబాటులో ఉండవు. అవి ఇప్పుడే ప్రారంభం కూడా కావు.
ఫెడరల్ రిజర్వ్ సంస్థ గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వేలో అమెరికా లోని 40 శాతం మంది బ్యాంకు ఖాతాల్లో 400 డాలర్లకు మించి బ్యాలెన్స్ లేదని వెల్లడైంది. అంటే ఇప్పటి పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించే కాలంలో అవి ఖర్చయిపోయి చిల్లిగవ్వ లేకుండా పోతుంది. వారికి పని లేనందున డబ్బులు ఉండవు. ఏ బిల్లులూ కట్టలేరు. ప్రతి ఒక్కరి ఖాతా లోకి 1000 డాలర్లు పంపమని సెనేటర్ మిట్ట్ రోమనీ 'ట్రంప్ ప్రభుత్వాన్ని' కోరారు. దాంతో కొంతమంది అయినా ఆకలితో మాడకుండా ఉంటారని సలహా ఇచ్చారు. ఈ సలహాను స్వీకరించి ట్రంప్ ప్రభుత్వం ప్రతి పౌరుడికి 1000 డాలర్లు ఇస్తామనే ప్రతిపాదన పెడితే దానికి ఆమోదం లభించలేదు. రాబోయే రోజులలో మహమ్మారి తీవ్రమై నిరుద్యోగం పెరిగితే అప్పుడు ఏర్పడే సామాజిక నిరసనకు తలొగ్గి అత్యవసరంగా చెల్లిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.స్కూళ్లు మూతబడ్డాయి. దాంతో పెద్ద సామాజిక ఇబ్బంది ఏర్పడింది. ఒక్క న్యూయార్క్ సిటీ లోనే 70 శాతం మంది పబ్లిక్ స్కూలు పిల్లలు బడిలో పెట్టే భోజనంపై ఆధారపడి ఉంటారు. ఇప్పుడు వారికి మూడు పూటలా భోజనం దొరకదు. దుకాణాలు మూతపడ్డాయి. అందులో పని చేసే కార్మికులకు జీతంతో కూడిన 'సిక్ అలవెన్స్' ఉండదు. ఇది కూడా భారంగా మారనుంది. స్పెయిన్ చేసినట్టు అమెరికా ప్రభుత్వం ప్రయివేటు ఆస్పత్రులను తాత్కాలికంగా ప్రభుత్వ స్వాధీనం లోకి తీసుకోలేదు. ఫ్రాన్స్, ఇటలీ లాగా అద్దెలు, కిస్తీలు కట్టడానికి వాయిదా ఇవ్వలేదు. అన్నీ కలసి అమెరికా కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతున్నది.
ట్రంప్ నిత్యం ప్రజల దగ్గరకి వెళుతున్నారు. కరోనా ఉన్నవాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వాగ్ధానాలు చేస్తున్నారు. కాని అవి ఏవీ అమలు కావడం లేదు. కరోనా పరీక్షలు కావాలంటే చేస్తారు అన్నారు. అవి జరగడం లేదు. వైద్య పరీక్షలు ఉచితం అన్నారు. అవీ జరగడం లేదు. మాటలు మాత్రం మానవీయంగా ఉన్నా ఒకటీ నిజం కాకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. భయం వ్యాపిస్తున్నది. ప్రభుత్వం పాత్ర తక్కువ ఉండాలనే సిద్ధాంతం వలన మహమ్మారి వచ్చినప్పుడు దానిని ధీటుగా ఎదుర్కొనే వ్యవస్థలు సరిపడా లేకుండా పోయాయి. అదే సమయంలో చైనా, దక్షిణ కొరియా దీనికి భిన్నంగా విజయం సాధించాయి. దాన్ని అంగీకరించలేనివారు అక్కడ నియంతృత్వ ధోరణి వలన సాధ్యం అయిందని తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కడ సమాజం, ప్రభుత్వం విపత్తు పరిస్థితుల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించే శక్తిని కలిగి ఉన్నాయి. రెండో వైపున అమెరికాలో ట్రంప్ తింగరి వేషాలకు ఆయన వ్యక్తిగత వైఫల్యమే కారణం కాదు. అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ దిగజారిపోయి...సంక్షోభ సమయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని పరిస్థితికి ఇది ప్రతిబింబంగా భావించాలి.విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ప్రజలు దుకాణాలకు పరుగుపెట్టి ఏది దొరికితే దాన్ని కొనుగోలు చేశారు. తుపాకులు, మందుగుండు సామగ్రి కూడా కొన్నారు. ఒక వేలంవెర్రి నెలకొన్నది. ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ...ఏం చేయాలో, ప్రభుత్వం ఏం చేస్తోందో ...ప్రజలకు అవగాహన కల్పించలేదు. ప్రజలను భౌతిక దూరం పాటించండని, చేతులు శుభ్రంగా కడుక్కోమని, ఇళ్లలో ఉండమని మాత్రమే చెప్పారు. ఒక అధికారిక ప్రకటన గాని, అధికారిక ఏర్పాట్లు కానీ ఏమీ లేవు. ఇప్పటికే ప్రజలు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఇది మరో రెండు వారాలు కొనసాగవచ్చు. పిల్లలకు ఆన్‌లైన్‌లో చదువు నేర్పుతున్నారు. కార్మికులు పనులు లేక ఖాళీగా వున్నారు. వృద్ధ్దులు మృత్యు భయంతో వున్నారు.
<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">( వ్యాసకర్త 'లెఫ్ట్ వర్డ్ బుక్స్' చీఫ్ ఎడిటర్ )