ఏ దేవుడూ ఏ వైరస్‌ని నిర్మూలించలేడు !

దేశంలో కేంద్రప్రభుత్వం పౌరసత్వ చట్టం తెచ్చింది. మత ప్రాతిపదికన జనాన్ని విడగొట్టడం ప్రజలకు నచ్చలేదు. కుల, మత, ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కనపెట్టి దేశమంతా ఒక్క గొంతై తన నిరసనను తీవ్రంగా వెలిబుచ్చింది. మానవత్వమే వెన్నెముకై దేశమంతటా వందల షాహీన్‌బాగ్‌లు వెలిశాయి. వెనువెంటనే దేశంలోకి కరోనా వైరస్‌ వ్యాపిస్తూ వచ్చింది. అన్ని మతాల దేవుళ్ళూ తలుపులు మూసుకున్నారు. అప్పుడు మళ్లీ కుల, మత ప్రాంతీయ బేధాలు, ఆర్థిక స్థోమతలు పక్కకు తొలగిపోయాయి. మనుషులంతా ఒక్కటిగా నిలిచారు. మానవత్వమే వెన్నెముక అయిన వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. విచారించవల్సిన విషయమేమంటే మన పాలకులు గానీ, అధికారులు గానీ, మీడియా గానీ ఎవరూ సూక్ష్మక్రిమి అన్వేషకులను గుర్తుచేసుకోలేదు. మానవాళి కోసం జీవితాలు త్యాగం చేసిన శాస్త్రజ్ఞుల కృషిని కనీసం గుర్తుచేసుకోకపోవడం దారుణం. అది కనీస కర్తవ్యం కాదా? మందుల తయారీలో, టీకా తయారీలో తలమునకలై ఉన్నవారి సమాచారం జనానికి ఇవ్వలేకపోయారు. 'గో.. కరోనా.. గో' అనే కేంద్ర మంత్రుల వీడియోలు, గో మూత్రంతో ముఖం కడుక్కుని, గోమూత్రం సేవించే వారి వీడియోలు, కరోనా నివారణకు చేసే హోమాల వీడియోలు మీడియా తెగ ప్రచారం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. అజ్ఞానాన్ని ప్రచారం చేసే పాలకులు, మత పెద్దలు, సామాన్యులు, మీడియా సంస్థల వారు అందరూ సిగ్గుపడాలి. ఏ హోమాల వల్ల ఏమీ జరగదని, ఏ వైరస్‌ని ఏ దేవుడూ నిర్మూలించలేడని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయారు? విజ్ఞాన శాస్త్ర సమాచారమంతా మనుషుల కృషే కదా? మానవీయ విలువల పరిరక్షణ కోసమే కదా వైజ్ఞానికులంతా అహరహం కృషి చేస్తున్నారు. ఆ మానవీయ విలువల పరిరక్షణ వల్లే కదా సమాజం ఇంకా సజావుగా ఉంది. అందుకే చెప్పేది రానున్నది మా'నవ'వాద ప్రపంచమే అని! మతాలు, కులాలు మరుగున పడి, 'మానవ జాతి అంతా ఒక్కటి, అదొక మిశ్రమ సంతతి' అని జన్యుశాస్త్రం తేల్చిన సత్యాన్ని స్వీకరించక తప్పదు.కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని మహోపన్యాసమిస్తారు. శానిటైజర్ల గురించి, సామాజిక దూరం గురించి చెపుతారు. కానీ, అదే సమయంలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో అవేవీ పాటించరు. ఆ ఏర్పాట్లే చేయరు. పార్లమెంటు సభ్యులు వివిధ దేశాలు పర్యటించి, వివిధ రాష్ట్రాల నుంచి పార్లమెంటుకు వస్తుంటారు కదా? అక్కడ మాత్రం భౌతిక దూరం పాటించరు. థర్మల్‌ గన్‌లు, శానిటైజర్లు వాడరు. మన పాలకుల ద్వంద్వ వైఖరి ఇలా ఉంటుంది. సినిమా హాళ్లు, మాల్స్‌, స్కూళ్ళు, కాలేజీలు అన్నీ మూయిస్తారు. శుభకార్యాలు, ప్రయాణాలు అన్నీ రద్దు చేసుకోవాలని చెపుతారు. కరోనా వైరస్‌ పేరు చెప్పి ఒక రాష్ట్రంలో ఎలక్షన్లు వాయిదా వేశారు. మరో రాష్ట్రంలో తక్షణం అసెంబ్లీలో బలపరీక్ష జరపాలంటారు. అంటే రాజకీయాలకు కరోనాను ఉపయోగించుకున్నట్టే కదా? ఇది సరే.. మరి గుంపులు గుంపులుగా ఒక చోట చేరి హోమాలు చేస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి ఐసొలేషన్‌లో ఎందుకు వేయరూ? కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని, శుభ్రత పాటించాలని ఇప్పుడు చెప్పడం కాదు, అది ఎల్లప్పుడూ పాటించాల్సిందేనని చెప్పాలి. అన్ని మతాలకు సంబంధించిన ఇన్ని వేల వేల ప్రార్థనా స్థలాల్లో సబ్బులు, శానిటైజర్లు ఎప్పుడైనా ఉపయోగిస్తున్నారా? అక్కడి గాలి, నీరు అంతా పవిత్రమైందన్నట్టు.. అక్కడికి వెళితే చాలు అన్నీ బాగుపడతాయని మోసపూరితమైన ప్రకటనలు ఎందుకు చేస్తారు? వారి చాదస్తాలు, మూఢ నమ్మకాల వల్ల కోట్ల మంది మునకలు వేసే నదుల్లో, కొలనుల్లో, గుండాల్లో ఏ పరిశుభ్రత పాటిస్తున్నారు? అడ్డూ అదుపూ లేని జాతరల్లో, మేళాల్లో ఎవరు ఎవరి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు?

బాలాజీ దయ వల్లనే భారతదేశానికి కరోనా రాలేదు.. రాదు. అని పూజలు చేసి, తీర్థప్రసాదాలు పంచుతూ టీవీల్లో లైవ్‌షో ఇచ్చుకున్న అయ్యవారు పది రోజుల తర్వాత గుడి మూయించేశారెందుకూ? మా గుడికి ఎవరూ రావొద్దు.. అని ఎందుకు ప్రకటించుకున్నారు? కరోనా పేరుతో ఇంత ఓవర్‌యాక్షన్‌ అవసరమా? 'పూజారులైన మాకుగానీ, మేం పూజించే ఆ దేవ దేవుడికి గానీ ఏ మహిమలూ లేవు' అని నిజాయితీగా ప్రకటించుకుంటే జనం హర్షించేవారు. వీళ్లే కాదు, ఇమామ్‌లు, ముల్లాలు, చిటుక్కున రోగాలు నయం చేసే స్వస్థత కేంద్రాల ఫాదర్లూ అందరికందరూ గప్‌చుప్‌గా ఎక్కడ దాక్కున్నారు? కరోనాను పక్కన పెడదాం. కలరా, ప్లేగు, టి.బి, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వంటి ఎన్నెన్నో జబ్బులతో జనం చనిపోతున్నారు. రోజూ రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది చనిపోతున్నారు. కిడ్నీ, కేన్సర్‌, గుండె జబ్బులతో ఇంకెంతో మంది చనిపోతున్నారు. గిట్టుబాటు ధరలేక రైతులు, అప్పుల పాలై జీతాల్లేని ఉద్యోగులు, అత్యాచారాలకు గురై మహిళలు... రోజూ ఎంతమంది ప్రాణాలు వదిలేస్తున్నారో ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా? అసలు ప్రభుత్వాలు పెట్టే బాధలు తట్టుకోలేక చనిపోతున్న వారెంత మంది? ఆ లెక్కలు తీయండి.

చేతులు కలపడం కాదు, దూరం నుంచే నమస్కారం చేయడం మంచిది అని డాక్టర్లు చెపితే, దాన్ని వెంటనే భారతీయ సంస్కృతిలోకి లాగి దుష్ప్రచారం చేయడం బాగుందా? ప్రపంచ దేశాలన్నీ భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాయని గొప్పలు పోవడం ఎందుకు? తప్పుడు కారణం చూపి, తప్పుడు ప్రచారాలు చేసుకోవడం అవసరమా? వారంతా భారతీయ సంస్కృతిని అర్థం చేసుకుని పాటించడం లేదు. అక్కడ బయటి దేశాల్లో ఉన్న రోడ్లు ట్రాఫిక్‌, వాతావరణం, క్రమశిక్షణతో ఉండే నాగరికులైన ప్రజలు, ప్రతి చిన్న విషయానికి స్పందించగలిగే నిజాయితీ గల ప్రభుత్వాలు ఇక్కడ మన దేశంలో ఉన్నాయా? అని బేరీజు వేసుకోవాల్సి ఉంది. సెలవులు దొరికాయన్న సంతోషంలో కొందరు విద్యార్థులు 'కరోనా జిందాబాద్‌' అని నినాదాలిస్తూ రోడ్లెక్కారు. ఇదే అదనుగా కొందరు నకిలీ శానిటైజర్లు అమ్ముతూ పోలీసులకి చిక్కారు. ఇలాంటి వాటికి ఏమంటారు?శ్రమ చేయలేని బద్దకస్థులు, ఉత్పత్తిలో భాగస్వామ్యం లేనివారు మాటల గారడీతో బతక నేర్చిన వారంతా మత బోధకులవుతున్నారన్నది గ్రహించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మత బోధకులకు ఏదైనా కావాల్సి వస్తే వారి వారి దేవుళ్ళే వారికి సాయపడాలికదా? మరి వారెందుకు ప్రభుత్వాల చుట్టు తిరుగుతారూ? పాస్టర్లు, మౌత్వీలు, అర్చకులు తమ కోర్కెల చిట్టా పుచ్చుకుని ప్రభుత్వాధినేతల దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నదే. ఈ చిన్ని కరోనా వైరస్‌ మానవజాతికి ఒక గొప్ప సందేశం ఇచ్చింది. దీన్ని స్వీకరించలేని వారిని ఎవరూ ఏమీ చేయరు. కానీ, ఏ అతీంద్రియ శక్తీ లేదు. ఉన్నదంతా మానవ శ్రమ-మానవ మేథస్సు మాత్రమే అనే నిజం గ్రహించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చేతులు ఎలా కడుక్కోవాలో, సినీ టీవీ నటులు కడుక్కుని చూపనక్కరలేదు. వారు ముందు కొంచెం వైజ్ఞానిక స్పృహ పెంచుకుని, దాన్ని ప్రజలకు వివరిస్తూ ఉంటే ఫలితాలు బావుండే అవకాశం ఉంది.కంటికి కనబడని సూక్ష్మ క్రిముల్ని కనుగొన్న మహానుభావులకు ప్రపంచ మానవాళి రుణపడి ఉంది. సూక్ష్మ దర్శినిని తయారు చేసిన ల్యూవెన్‌హర్‌ను, ఒట్టో ముల్లర్‌, స్పలాంజని, ఫకస్టరో, రాబర్ట్‌ కోష్‌, లూయీపాశ్చర్‌, మెట్నికాఫ్‌, పాల్‌ ఎర్లిష్‌, డి క్రూఫ్‌ వంటి శాస్త్రవేత్తల్ని యువతరం అధ్యయనం చేయాలి. ఈ రోజు మనం గాలి, నీరు, ఆహారాన్ని సూక్ష్మక్రిముల బారి నుంచి రక్షించుకుంటూ హాయిగా జీవిస్తున్నామంటే.. ఇలాంటి శాస్త్రవేత్తల కృషి ఫలితమే!! ఇంతెందుకు కరోనా వైరస్‌ గాలి ద్వారా, నీటి ద్వారా వ్యాపించదని, అది సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే నోటి తుంపరల వల్ల వ్యాపిస్తుందని చెప్పింది శాస్త్రవేత్తలే! కరోనా కొత్త వైరస్‌. దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు. ఇది కొత్తది కాబట్టి, ఒక విషయం అర్థమౌతోంది. జీవపరిణామం ఆగిపోలేదని, అదింకా కొనసాగుతోందని! అయితే ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు విరివిగా సాగుతున్నాయి. ఏ దేశం వారికి వచ్చిన ఫలితాలు వారు ప్రకటిస్తున్నారు. ఈ పరిశోధనల గూర్చి ఎవరికి ఏ సమాచారం కావాలన్నా తెలుసుకోవడానికి 'కొలంబియా యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ కూకీ నోటీస్‌'ను అందుబాటులోకి తెచ్చింది. కొందరు యాంటీ మలేరియల్‌ డ్రగ్‌ అయిన క్లోరోక్విన్‌ను, హెచ్‌ఐవీకి వాడే కలేట్రాను, యాంటీ ఫ్లూ కు వాడే ఫావిపిరవిర్‌ను, ఎబోలాకు వాడే రెమ్‌డెసివిర్‌ను ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. ఇదీ సరైన మందు అని కచ్చితంగా నిర్ధారణ కాలేదు. అయితే సీటెల్‌, వాషింగ్టన్‌ లోని నేచురల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్సియస్‌ డీసీజెస్‌ సంస్థ వారు ఒక వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. తొలిసారి ఒక మహిళ మీద ప్రయోగించారు. అయితే ఆ తర్వాత ఇంకా 45 మందికి ఆ వ్యాక్సిన్‌ ఇచ్చి ఎలా పనిచేస్తుందో పరిశీలించాల్సి ఉంది. క్షుణ్ణంగా పరిశోధనలు జరిపిన తర్వాతనే, అది అందరికీ అందుబాటులోకి వస్తుంది. వేల సంఖ్యలో మత ప్రచారకులు ఇండోనేషియా నుంచి మన దేశానికి రావడం వల్ల ఇక్కడ కరోనా కేసులు పెరిగాయి. మత ప్రచారకుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. ఎవడి నమ్మకం వాడు ఉంచుకోగలిగే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇంక ప్రచారాలు దేనికి? మత మార్పిళ్లుదేనికీ? 'పండగలు వస్తున్నాయి, దేవాలయాలేమో మూసేసి ఉన్నాయి ఎలా?' అని అడిగిన ప్రశ్నకి ప్రముఖ అర్చకుడు ఇలా అన్నారు.. 'ఆ దైవాన్ని మీ హృదయాల్లో ఉంచుకుని కొలుచుకోండి సరిపోతుంది!' అని. ఇప్పుడు కదా సరైన మాట చెప్పారు? హేతువాదులు, సైన్సు కార్యకర్తలు ఎప్పటి నుంచో చెపుతున్న మాట అదే! ఈ కరోనా సమస్య నుంచి గట్టెక్కిన తర్వాత కూడా అదే సూత్రం పాటించడం మంచిది. ఒక సూక్ష్మజీవి దైవ భావనను దెబ్బతీసిందని ప్రగతిశీలవాదులు సంతోషించారు. విపత్కర పరిస్థితులలో సైతం ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్య-శాస్త్రవేత్తల బృందాలకు జేజేలు పలికారు. ఏ మతమూ, ఏ దేవుడూ మనిషిని రక్షించలేడన్న విషయం స్పష్టమైంది. అందువల్ల సైన్సే మన జీవన సూత్రం కావాలి! మనిషైనవాడు తనని తాను, తన సంతతిని తాను కాపాడుకోవాల్సిందే! మా'నవ'వాదం - అంటే అదే!!

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">డా|| దేవరాజు మహారాజు

( వ్యాసకర్త సాహితీవేత్త )