కరోనా వైరస్ నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు రాష్ట్రంలో బుధవారం నుండి అందుబాటు లోకి రావడం స్వాగతించదగింది. అవి కూడా విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో తయారుకావడం ముదావహం. రక్త నమూనాకు కరోనా వైరస్ ఫలితం రావడానికి ప్రస్తుతం దాదాపు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఈ కిట్ల ద్వారా కేవలం 55 నిమిషాల్లోనే తెలియనుండడం గమనార్హం. అక్కడే వెంటిలేటర్ల తయారీ కూడా ప్రారంభమైంది. వ్యక్తిగత భద్రత పరికరాలు (పిపిఇలు) కూడా రాష్ట్రం లోనే తయారవుతున్నాయి. కరోనా నివారణా చర్యల్లో స్వయంపోషక దిశగా రాష్ట్రం ముందడుగు వేయడం శుభ పరిణామం. ప్రైవేటు రంగంలో పని చేస్తున్న అనేక మంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టుల సేవలను వినియోగిస్తున్న ప్రభుత్వం 58 ప్రైవేటు ఆసుపత్రులలో కూడా కరోనా వైద్య సేవలందించడానికి నిర్ణయించడం సరైన చర్య. అయితే రానున్న రోజుల్లో వైరస్ ఇంకా ప్రబలితే ఇంకా ఎక్కువ మంది వైద్యులను, మరిన్నో ఆసుపత్రులను కూడా వినియోగించుకోవాల్సి వుంటుంది. వైరస్ నివారణకు వ్యాక్సిన్ లేదా మందు ఇంకా కనిపెట్టకపోవడం, దాని విస్తృతిని ఇతమిత్థంగా చెప్పలేని నేపథ్యంలో అలాంటి పరిస్థితికి మనం సిద్ధం కావాలి.విదేశీయానం, అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేసిన వారిని, ఇతర కరోనా అనుమానితులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తొలుత కొంత వెనుకబడినా ఆ తరువాత అంతా అప్రమత్తమయ్యారు. ఇంటింటా సర్వే నిర్వహించడంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ బాగా తోడ్పడింది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన 1,167 మందినీ గుర్తించడం, వారిలో ఢిల్లీ, ఇంకొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల పర్యవేక్షణలో వున్న 132 మంది తప్ప మిగతా వారికి క్వారంటైన్ లేదా ఐసొలేషన్‌కు పంపడంలో విజయవంతం అయ్యారు. వైరస్ పాజిటివ్ వచ్చిన 146 ప్రాంతాలను ఇప్పటికే రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పరిస్థితిని బట్టి ఈ సంఖ్య మారవచ్చు కూడా. ప్రభుత్వం ప్రకటనకే పరిమితం కాకుండా జన సంచారాన్ని కట్టుదిట్టం చేయడంతోపాటు వైరస్ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలి. అందుకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఇది కేవలం పోలీసు యంత్రాంగం లేదా వైద్య వ్యవస్థల బాధ్యత మాత్రమే కాదు. ప్రజల తోడ్పాటు... కాదు భాగస్వామ్యం ఎంతో అవసరం. అత్యవసరం కాని కదలికలను నివారించుకోవడం మొదలు వైరస్ సోకిందేమోనన్న సందేహం కలిగితే ఆ సమాచారాన్ని సైతం జనమే స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఎవరైనా అనుమానితులకు సంబంధించిన భోగట్టాను అధికార యంత్రాంగానికి తెలియజేయడం ప్రజల బాధ్యతే కదా!
చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు మీడియాలో ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఆ కేంద్రాలు కానరావడం లేదు. పండించిన కూరగాయలు, పండ్లు మార్కెట్‌కు తీసుకెళ్లడానికీ లాక్‌డౌన్ ఇక్కట్లు ఎన్నెన్నో! ఉపాధి హామీ పనులు కూడా లేకపోవడంతో గ్రామీణ పేదల బాధలు రెట్టింపు అవుతున్నాయి. రేషన్ కార్డు వున్న వారిలో ఎక్కువ మందికి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్, ఆర్థిక సహాయం అందివుండవచ్చు. కాని రేషన్ కార్డుల్లేని కుటుంబాలు లక్షల సంఖ్యలోనే వున్నాయి. వారిని ఆదుకొనేందుకు సర్కారు ఇంతవరకూ తగిన చర్యలు చేపట్టకపోవడం ధర్మం కాదు. అలాగే వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా వుంది. అన్య రాష్ట్రాల వారేగాక ఇతర జిల్లాల నుండి వచ్చిన వారు సైతం ఎక్కడి వారక్కడే నిలిచిపోయారు. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం కన్నా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల పాత్రే ఎక్కువగా వుంది. కాని వాటి శక్తి పరిమితమే! ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని 'అతిథి కార్మికులు'గా పిలవడంతో పాటు వారి సంక్షేమానికి కేరళ లోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం సమర్ధ చర్యలు చేపట్టడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి చర్యలు తీసుకోవడం తక్షణావసరం.విభజన మూలంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదుకోలేదు సరికదా గత రెండేళ్లుగా మరిన్ని కోతలు పెడుతోంది. ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఇటీవల రద్దు చేసింది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకిచ్చే వాటాకు కోత పెట్టింది. ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు రాష్ట్ర ఖజానా విలవిలలాడుతున్న నేపథ్యంలో కేంద్రం నుండి న్యాయంగా మన రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రజలందరి మద్దతును, అన్ని రాజకీయ పార్టీల తోడ్పాటునూ కూడగట్టాలి. రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో ముందు పీఠిన నిలిచి పోరాడుతున్న కేరళ ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు నిలవడం అవసరం.