లాక్‌డౌన్ కారణంగా కేరళ రాష్ట్రానికి ఏమేరకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని మీ అంచనా!
మాకు సాధారణ పరిస్థితులలో ఉండే ఆదాయాలలో కన్నా 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నాం. లాక్‌డౌన్ కారణంగా జిఎస్‌టి వలన వచ్చే ఆదాయం సహజం గానే రాదు. మేం లాటరీలు నిలిపివేశాం. కేరళలో మందు దుకాణాలు మూసివేశాం. మోటార్ వాహనాల అమ్మకాలు లేవు. భూ లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా రాబోయే మూడు నెలలలో ఇదివరకటి ఆదాయంలో సగానికి సగం తగ్గుదల ఉంటుంది. మొదటిగా లాక్‌డౌన్ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రెండు, లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే యథాస్థితి రాదు. మూసివేసిన చిన్న పరిశ్రమల పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. పర్యాటకం లాంటివి ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు.రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు ఆపలేవు, చేసే తీరాలి. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేసి ఆరోగ్యం పైన కేంద్రీకరించాలి. నా బడ్జెట్‌లో వైద్యానికి కేటాయించేది రూ.400 కోట్లు. సాధారణ పరిస్థితులలో మహా అయితే మరో వంద కోట్లు పెంచేవాడిని. కానీ ఇప్పటికే రూ.600 కోట్ల విలువ చేసే యంత్రాలు, మందుల ఖర్చులకు అనుమతులిచ్చాను. నా మొత్తం బడ్జెట్‌లో సగానికి పైగా మొదటి నెలలోనే ఖర్చయిపోయింది. ప్రభుత్వం కోవిడ్ రోగులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నది. వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్క రోగికి అందించ వలసిన వెంటిలేటరుకు రూ.25,000 ఖర్చవుతుంది. ఆరోగ్య సేవలు అందించే వారికి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వారు మార్చుకోవాల్సిన వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లు సమకూర్చవలసి ఉంటుంది. ఈ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అసాధారణ పరిస్థితులను తట్టుకోవడానికి సాధారణ ఆరోగ్య బడ్జెట్ ఏమాత్రం సరిపోదు.
ఇప్పటి వరకు కేంద్రం అందించిన సహాయం ఎంత?
కోవిడ్-19ని ఎదుర్కోవడానికి ఇప్పటివరకు కేంద్రం అందించిన సహాయం ఏమీ లేదనే చెప్పుకోవాలి. శూన్యం అనడం న్యాయంగా వుంటుంది. ఇప్పటివరకు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ద్వారా, జిఎస్‌టి ద్వారా రావలసిన బకాయిలు మాత్రమే చెల్లించింది. అవి మార్చి నెలాఖరుకు చెల్లించారు. ఇప్పుడు రాష్ట్ర విపత్తు నివారణ నిధిని పంచి పెట్టారు. దానిని కోవిడ్‌కి కూడా ఖర్చు చేయవచ్చన్నారు. ఇదికాక ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏవిధమైన ఇతర నిధుల కేటాయింపులు జరగలేదు. ఎవరైనా ఇంత అమానుషంగా ఎలా ఉండగలుగుతారో అంతుపట్టడం లేదు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వున్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటి?
ఇతర ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మరే మార్గం లేదు. ధనిక రాష్ట్రాలు చేస్తున్నదదే. కానీ ఇది దౌర్భాగ్యం. ఇప్పుడున్న పరిస్థితులలో ఖర్చులు తగ్గించకూడదు. పెంచాలి. మాంద్యం నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఖర్చులు తగ్గించుకోవడం వెర్రితనం. నిజానికి కేంద్రం కోవిడ్‌ని ఎదుర్కోవడానికి ప్రకటించిన రూ.లక్షా డెబ్భై వేల కోట్లలో సగం మాత్రమే ప్రత్యేక నిధి. మిగిలినదంతా బడ్జెట్ కేటాయింపులే. అంటే రూ.70,000 నుండి రూ.75,000 కోట్లు మాత్రమే కేటాయించినట్టు. ఇది అవసరానికి ఎంత మాత్రం సరిపోదు.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలు చేయగల్గినదల్లా అప్పులు తెచ్చుకుని ఖర్చులు చేసుకోవడమే. ఇప్పుడు మొదటి రెండు నుండి మూడు త్రైమాసికాలకు తెచ్చుకోగలిగిన అప్పుల పరిమితులలో కూడా సగానికి సగం అయిపోయాయి. మిగిలిన కాలంలో జీతాలెలా ఇవ్వాలి? ఇతర ఖర్చులు ఎలా భరించాలి? కేంద్రం భాగస్వామ్యం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేనేలేదు. అదే అత్యంత కీలకం.కేంద్రం జిఎస్‌టి నష్టపరిహారం, సెస్ విడుదల చేయాలి. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జిఎస్‌టి నష్టపరిహారం, సెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్రం దానిని వెనక్కు నెడుతూనే ఉంది. రాష్ట్రాలకు నిధులు అవసరమైన ఈ క్లిష్ట పరిస్థితులలో...ఎటువంటి తచ్చాటలు లేకుండా రాష్ట్రాలకు అప్పులు తెచ్చుకునే పరిమితులన్నా పెంచాలి. లేదా కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జిఎస్‌టి సెస్ నిధికి వనరులను సమకూర్చాలి. పూర్వ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వాగ్ధానమిదే. డబ్బు ఇప్పుడు అత్యంత అవసరం. నేను కేంద్ర ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకోలేకపోతున్నాను. కేంద్రం రాష్ట్రాలను దూరంగా పెడుతోంది.
రెండో విషయం, కేంద్రం ఆదాయాలు కూడా తగ్గుతున్నాయి. అందువలనయినా వారు రాష్ట్రాలు అదనంగా అప్పులు సమకూర్చుకునే అవకాశాలు కల్పించాలి. ఇప్పడున్న స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో మూడు శాతం బదులుగా మరొక్క శాతం అదనంగా అప్పు చేసే వీలు కల్పించాలి. ప్రపంచమంతటా ఇలాగే జరుగుతున్నది. అమెరికన్ ప్రభుత్వం తమ స్థూల జాతీయోత్పత్తిలో 10 శాతం ఉద్దీపనను ప్రకటించింది. అందువలన వారి ఆర్థిక లోటు ఆమేరకు పెరగనుంది. ఈ ఏడాది ఇందుకు అనుమతిస్తే వచ్చే మూడేళ్ళలో క్రమంగా దానిని తగ్గించుకోవచ్చు. ప్రజలు అర్థం చేసుకుంటారు.
ఈ అంశాలను మీరు ఇతర రాష్ట్రాలతో చర్చించారా? తమిళనాడు కూడా ఇటువంటి మినహాయింపునే కోరింది.
ఇతర రాష్ట్ర ఆర్థిక మంత్రులను కూడా ఏప్రిల్ మూడో వారంలో మేం నిర్వహించే 'వెబినార్' (ఈ విషయమై)లో చేరమని ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, అధికారులు, జర్నలిస్టులను కూడా రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఆ తరువాత ఓ డజను మంది ప్రశ్నలు అడిగి జవాబులు పొందవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల దృష్టిని ఆకర్షించడం, జాతీయ మాధ్యమాలలో ఒక చర్చను లేవనెత్తడం. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం అవివేకమని తెలియచేయడం.
మీరు ఈ విషయాన్ని జిఎస్‌టి సదస్సు లోనూ ప్రస్తావిస్తారా?
పార్లమెంటు సమావేశాలు అయిన వెంటనే (మార్చ్ 23న ముగిశాయి) రాష్ట్రాలకు అందించవలసిన పరిహారం గురించి చర్చించడానికి జిఎస్‌టి సదస్సు జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు భౌతికంగా ఒక చోటకు చేరుకుని సమావేశాలు జరుపుకునే పరిస్థితి లేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ జరపవచ్చు. కానీ ఇప్పటివరకు ఆ విషయమై ఎటువంటి సమాచారం లేదు.రాబోయేది అతి పెద్ద మాంద్యం. మాకు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. ఇతర రాష్టాల ఆర్థిక మంత్రులను కూడా ఒక చోటికి చేర్చడమే 'వెబినార్' ఉద్దేశం.
అత్యంత ఎక్కువగా ఆర్థిక ఆదాయాలను కోల్పోతున్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. మీరు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు?
ప్రస్తుతం కేరళలో మేం సాధ్యమైనంత మేరకు అప్పులు తీసుకొచ్చాం. ఇప్పటికే మొదటి విడత రూ.6,000 కోట్లు తెచ్చుకున్నాం. రెండో విడత రూ.6,000 కోట్లను పండగ (విషు) తర్వాత వెంటనే తెచ్చుకుంటాం. వీటిని ఎస్‌ఎల్‌ఆర్ బాండ్ల ద్వారా రిజర్వు బ్యాంకు నుండి తెచ్చుకున్నాం (రాష్ట్ర ద్రవ్య, ద్రవ్యేతర నిధుల మధ్య నిష్పత్తికి అనుగుణంగా పొందగలిగే నిధులు). కేరళ రాష్ట్రం ఎస్‌ఎల్‌ఆర్ బాండ్ల ద్వారా రూ.25,000 కోట్లు పొందే అవకాశం ఉంది. రెండు సార్లు రూ.ఆరేసి వేల కోట్లు తెచ్చుకోవడం ద్వారా అందులో దాదాపు సగం నిధులను పొందినట్లు భావించాలి.