సమ్మె హెచ్చరిక

రెండు రోజుల దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వంటింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు ఈ సమ్మెలో రోడ్డెక్కారు. ఇంత పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనడం, వివిధ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వారు భాగస్వాములు కావడం, అనేక రాష్ట్రాల్లో బంద్‌ వాతావరణం నెలకొనడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగడం వంటి అంశాలు విదేశీ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి. కార్మికవర్గ ప్రతిఘటన కారణంగా సంస్కరణల అమలు విషయంలో భారత్‌లో అయోమయ వాతావరణం నెలకొందన్న అర్ధం వచ్చే శీర్షికతో 'న్యూయార్క్‌ టైమ్స్‌' కథనం ప్రచురించింది. సంస్కరణల గురించి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదానికి భిన్నంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్న తీరును ఈ కథనంలో వివరించారు. కార్మికుల కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమించడం ఇదే మొదటిసారి కాదు. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైనప్పటి నుండి కార్మికలోకం ఏదో ఒక రూపంలో గళం విప్పుతూనే ఉంది. దేశ సంపదను, ప్రజల కష్టార్జితాన్ని కొద్ది మందికి దోచి పెట్టే విధానాలను మానుకోవాలని నినదిస్తూనే ఉంది. హర్తాళ్లు, ధర్నాలు, నిరాహార దీక్షల వంటి నిరసనలు అటుంచితే, తాజాగా విజయవంతమైంది 21వ సార్వత్రిక సమ్మె! అంటే, దీనికి ముందు 20 సమ్మెలను దేశ కార్మిక వర్గం చేసింది. ఒక్క నరేంద్రమోడీ హయంలోనే నాలుగు సమ్మెలు జరిగాయి. ప్రతిసారీ సమ్మెను నీరుగార్చడానికి, కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి పాలక వర్గాలు ఎన్నో ప్రయత్నాలు చేయడం, కార్మికులు సంఘటితంగా వాటిని తిప్పికొట్టడం పరిపాటిగా మారింది. అయితే, ఈ సారి జరిగిన సమ్మె వాటికన్నా ప్రత్యేకమైనది.

తిమ్మిని బమ్మి చేసే కార్పొరేట్‌ మీడియా టక్కుటమార ప్రచారానికి, క్షేత్రస్థాయి లోని వాస్తవ పరిస్థితులకు పొంతనలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కాటుకు తోడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్యుల బతుకులు చితికిపోయాయి. ఉన్న ఉద్యోగాలు ఊడుతుండగా, కొత్త ఉద్యోగాలు రావడం లేదు. ఉపాధి అవకాశాలూ మృగ్యమౌతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పెట్రోలు, డీజల్‌తో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను దాటాయి. విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు సామాన్యులకు ఎండమావులుగా మారాయి. రెక్కలు ముక్కలు చేసుకున్నా బతుకులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కష్టకాలంలోనూ కార్పొరేట్లు మరింతగా సంపదను పొగేసుకున్న తీరును కార్మికలోకం అర్ధం చేసుకుంది. ఇంతకాలం దేశాభివృద్ధికి దోహదం చేసిన ఎల్‌ఐసి, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పడానికి మోడీ ప్రభుత్వం పడుతున్న తపనను అర్ధం చేసుకుంది. ఏడాది పాటు అప్రతిహతంగా సాగిన రైతాంగ సమ్మెకు బూటకపు వాగ్దానాలతో మోడీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన తీరు పట్ల ఆగ్రహించింది. అందుకే, కార్పొరేట్‌ మీడియా సృష్టించిన మీడియా మానియాను బేఖాతరు చేసి మరీ కార్మికులు, ఉద్యోగులు సమ్మెను జయప్రదం చేశారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతాంగం కార్మికులతో కలిసి కదం తొక్కింది. కుట్రలను, కుతంత్రాలను, ఆంక్షలను, నిర్బంధాలను అధిగమించి సమ్మె పతాకాన్ని దిగ్విజయంగా ఎగురవేసి కొత్త చరిత్రను సృష్టించింది. కార్మికలోకం సృష్టించిన ఈ విజయం అపురూపం! భవిష్యత్‌ పోరాటాలకు ప్రేరణ! ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం సమ్మె డిమాండ్ల పరిష్కారం పై దృష్టి సారించాలి. అన్ని రకాల ప్రెవేటీకరణ, కార్మిక వ్యతిరేక చర్యలను మానుకోవాలి. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అధిక ధరలను తగ్గించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. దీనికి భిన్నంగా ప్రచార మాయాజాలాన్నే పరమార్ధంగా భావించి కార్పొరేట్ల సేవలో మునిగి తేలితే ప్రజానీకం కూడా అంతే కఠినంగా గుణపాఠం నేర్పితీరుతారు.