ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థ వైఖరి పాటించడం సరైంది కాదంటూ ఇన్నాళ్లూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు నేరుగా బెదిరింపులకు దిగుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తే 'తీవ్ర పర్యవసానాలు' ఎదుర్కోవాల్సి వుంటుందంటూ అమెరికా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల జాతీయ డిప్యూటీ సలహాదారు హుకుం జారీ చేయడం గర్హనీయం. భారత్‌లో పర్యటనకు వచ్చి ప్రభుత్వానికి ఈ విధంగా బెదిరించడం ఎంతమాత్రం అనుమతించరానిది. అదే సమయంలో భారత్ సందర్శనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ ఏం కోరితే అది ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తాన్ని అందించారు. భారత్‌తో సంబంధాల విషయంలో అగ్ర రాజ్యం ఎంత దురహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదీ, చిరకాల మిత్ర దేశమైన రష్యా ఎలా తోడ్పాటునందిస్తున్నదీ తెలుసుకునేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. అమెరికా తన ప్రయోజనాల కోసం భారత్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్నదే తప్ప, భారత్ కూడా ఒక సార్వభౌమత్వ దేశమని దానికీ ఒక స్వతంత్ర విధానం ఉంటుందన్న స్పృహ లేకుండా పెత్తందారీ పోకడలు పోతున్నది. ఉక్రెయిన్ సంక్షోభానికి అసలు కారణం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలే. ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చి రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లోని నియో నాజీ మూకలను ఎగదోస్తున్నది, రష్యన్లకు వ్యతిరేకంగా జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నది అమెరికానే. 1991లోనే రద్దు కావాల్సిన నాటో కూటమిని కొనసాగించడమేగాక, ఆనాడు ఇచ్చిన హామీకి భిన్నంగా ఆ కూటమిని తూర్పు వైపు విస్తరించడంలోనే దాని దుష్ట పన్నాగం దాగి ఉంది. ప్రపంచంపై తన అధిపత్యానికి అడ్డు చెబుతున్నందుకే రష్యా, చైనాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీస్తున్నది.
అమెరికా ఇటీవలకాలంలో చేపట్టిన అన్ని యుద్ధాల్లోను పరాజయం పాలైంది. ఆఫ్గనిస్థాన్‌లో ఎదురైన పరాభవాన్ని మర్చిపోయేలోపే.. ఉక్రెయిన్ సంక్షోభం అమెరికా ఆధిపత్యానికి పరీక్షగా పరిణమించింది. ఆర్థిక సంక్షోభం, కోవిడ్ విపత్తుల నుంచి బయటపడలేక సతమతమవుతున్న అమెరికా ప్రాభవంతో పాటు, డాలరు కూడా నీరుగారుతోంది. దీంతోబాటే బైడెన్ ప్రభుత్వ పాపులారిటీ బాగా పడిపోయింది. త్వరలో సెనేట్ ద్వైవార్షిక ఎన్నికలు రానున్నాయి. వీటన్నిటి నుంచి అమెరికన్ల దృష్టిని మళ్లించేందుకు ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతున్నట్లు బైడెన్ పోజు పెడుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య పోరుగా చిత్రీకరించడం, రష్యాపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడం ఇవన్నీ దీనిలో భాగమే. అమెరికా ఆంక్షలను రష్యా లెక్క చేయకుండా, చైనాతోను ఇతర దేశాలతోను సొంత కరెన్సీలో వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తుండడంతో అమెరికా పప్పులు ఉడకడం లేదు. అందుకే రష్యా నుంచి చమురు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటిలానే దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ఒంటి కాలితో లేస్తున్నది. అమెరికాతో భారత్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం, క్వాడ్ కూటమి వంటివి కుదుర్చుకోవడం ఎంత అనర్థమో ఈ పరిణామాలు మరోసారి తేటతెల్లం చేస్తున్నాయి. అమెరికాతో ఆ బంధాలే ఇప్పుడు భారత్‌కు గుదిబండలుగా మారాయి. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కళ్లు తెరవాలి. అది ఇప్పటివరకు అనుసరిస్తున్న అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని విడనాడి స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించాలి. దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇదే సరైన మార్గం. అమెరికా బెదిరింపులకు దిగుతుంటే మోడీ ప్రభుత్వం మౌనం వహించడం దేశ ప్రతిష్టకు, ప్రయోజనాలకు హానికరం. అమెరికా బెదిరింపులకు భయపడుతున్నంతకాలం అది బెదిరిస్తూనే ఉంటుంది. చైనాను రష్యా నుంచి దూరం చేయాలని అమెరికా ఇదే విధంగా బెదిరింపులకు దిగితే, ఆ దేశం దానిని దీటుగా తిప్పికొట్టింది. అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పింది. 56 అంగుళాల ఛాతి కలిగిన ప్రధాని మోడీ ఎందుకు ఆ తెగువ ప్రదర్శించలేకపోతున్నారు? దేశ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇప్పటికైనా అమెరికా బెదిరింపులను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించాలి.