వికేంద్రీకరణ

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణలో సరికొత్త ముందడుగు. స్థూలంగా సర్కారు చర్య స్వాగతించదగింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ కాస్తా 26 జిల్లాలుగా సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపంతో సోమవారం నుండి ఉనికిలోకొచ్చింది. కొత్తగా 13 జిల్లాలు రాగా, రెవెన్యూ డివిజన్లు 51 నుండి 72కు పెరిగాయి. జిల్లాల విభజనపై జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేయగా ప్రజల నుండి 16 వేలకు పైన సూచనలు, అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి. వాటిలో సహేతుకమైనవాటిని ఆమోదించామంటున్నారు. పాడేరు కేంద్రంగా నెలకొల్పిన అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దుల నిర్ణయంలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. పోలవరం జలాశయం కోసం ఖమ్మం జిల్లా నుండి ఎ.పి లో కలిపిన ఏజెన్సీ మండలాలు, రంపచోడవరం ప్రాంతాలు జిల్లా కేంద్రం పాడేరుకు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న స్థానిక ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. గిరిజనులకు జిల్లా కేంద్రాన్ని సుదూరం పెట్టడం పాలనా వికేంద్రీకరణ లక్ష్యానికి విరుద్ధం. రంపచోడవరంలో వారానికి రెండ్రోజులు కలెక్టర్‌ మకాం చేస్తారన్న వాదన సమస్యకు పరిష్కారం కాబోదు. ఇప్పటికైనా ప్రభుత్వం రంపచోడవరం జిల్లాపై పునరాలోచించడం అవసరం. వెనకబడ్డ ప్రకాశంలో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ న్యాయమైనది. మదనపల్లె-రాజంపేట-రాయచోటి, హిందూపురం-పుట్టపర్తి విషయంలోనూ ప్రజాందోళనలు సాగుతున్నాయి. కొన్ని జిల్లాల పేర్లపైనా అభ్యంతరాలొచ్చాయి. వీటని ఏకపక్షంగా తిరస్కరించేదానికంటే ప్రజలకు  సావధానంగా వివరించడం సర్కారు బాధ్యత. లోక్‌సభ నియోజకవర్గానికో జిల్లా ఏర్పాటు చేస్తామని తొలుత చెప్పినా ఒక జిల్లా పెరిగింది. ఒక లోక్‌సభ నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉండటం అసాధారణమేమీ కాకపోవచ్చు. కానీ ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ను రెండు జిల్లాలకు విడదీయడం ప్రజలకు ఇబ్బందే. డజను మంది ఎంఎల్‌ఎ లు రెండు జిల్లాల్లోకొచ్చారు. ఎ.పి లో చివరిగా 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున జిల్లాల పునర్విభజన జరిగింది ఇప్పుడే. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో 1986లో తాలూకాల స్థానంలో మండలాలొచ్చాయి. అప్పుడూ తొలి రోజుల్లో కొంత గందరగోళంగా ఉండేది. కాలక్రమంలో నిదానంగా అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడూ ప్రభుత్వం సమస్యలపై దృష్టి సారిస్తే ఇబ్బందులు తొలగి పరిస్థితి కుదురుకుంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే అంతా అయిపోయిందనుకోవడం పాక్షిక అవగాహన. జిల్లా ఆఫీసులు, డివిజన్‌ ఆఫీసులలో 70-80 శాతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లో తాత్కాలికంగా సర్దారు. మిగతా వాటిని అద్దెకు తీసుకున్నారు. సమీకృత కలెక్టరేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం త్వరత్వరగా చర్యలు చేపట్టాలి. తాత్కాలిక సర్దుబాట్లు కాకుండా సిబ్బంది ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి. ప్రభుత్వం ఈ పని చేయకపోతే కార్యాలయాలు అలంకారప్రాయమే అవుతాయి. ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడవు. జిల్లాల్లో అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించి చాలా కాలమైంది. డెవలప్‌మెంట్‌పై రోడ్‌మ్యాప్‌లను జిల్లా పాలనా నాయకత్వం రూపొందించి అమలు చేయాలి. జిల్లా పరిషత్‌లు పాతవే కొనసాగనున్నాయి. ప్రజలెన్నుకున్న వేదికలు అచేతనా స్థితిలోకి వెళ్లడం రాజ్యాంగ విరుద్ధం. జడ్‌పిలు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు వచ్చే ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపణలొస్తున్నాయి. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు బదలాయించకుండా వికేంద్రీకరణ అంటే ప్రజలకు ఒనగూరే ప్రయోజనమేమీ ఉండదు. ఎంఎల్‌ఎ లకు ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లేవు. రూ.2 కోట్లిస్తామని బడ్జెట్‌లో చెప్పారు. ఎంఎల్‌సి లకూ వర్తింపజేస్తే నియోజకవర్గాల్లో ప్రజల అత్యవసర అవసరాలు కొంతైనా తీరతాయి. భూపంపిణీకి నియోజకవర్గ స్థాయిలో అస్సైన్‌మెంట్‌ కమిటీలను వేసి పని చేయించాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ చర్యలన్నింటినీ చేపడితేనే వికేంద్రీకరణకు అర్థం, పరమార్ధం సిద్ధిస్తాయి.