హిందీ - హిందూత్వ

 రో మారు దేశ వ్యాప్తంగా హిందీ భాష రగడ రగులుకుంది. కర్త, కర్మ, క్రియ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే. మొన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ అధికార భాషా ఛైర్మన్‌ హోదాలో అమిత్‌షా మాట్లాడుతూ హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు కమ్యూనికేషన్‌ భాషగా ఇంగ్లీషుకు బదులు తప్పనిసరిగా హిందీని వాడాలని హుకుం జారీ చేసినంత పని చేశారు. భావ వ్యక్తీకరణకు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను వాడతారు. అది ప్రజల ప్రాథమిక హక్కు. ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఫలాన భాషే మాట్లాడాలని శాసించే అధికారం కేంద్రానికి ఎంతమాత్రం ఉండదు. ఒక పథకం ప్రకారం హిందీని రుద్దే చర్యలో భాగంగానే అమిత్‌షా ఈ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం. దేశం మొత్తం మీద హిందీ మాతృభాషగా ఉన్న జనాభా 20 శాతం మించి లేదు. తక్కిన 80 శాతం మీద ఈ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం ఆయా భాషల, జాతుల ఉనికి మీద, స్వయంప్రతిపత్తి మీద తలపెట్టిన దాడి మాత్రమే. భిన్న జాతుల, భిన్న భాషల, భిన్న సంస్కృతులను గుర్తించి గౌరవించే బదులు వాటిని అణగదొక్కి ఏకరూప ఆధిపత్య సంస్కృతిని బలవంతంగా రుద్దడమే. ఇది దేశ ప్రజల మీద, రాజ్యాంగ స్ఫూర్తి మీద ప్రత్యక్ష దాడి.
     అమిత్‌షా 'హిందీ' వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, హిందీయేతర రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమ సాంస్కృతిక, భాష, ప్రాంత, అస్తిత్వంపై కేంద్రంలోని బిజెపి చేస్తున్న దాడిగా స్థానిక ప్రజలు పరిగణిస్తున్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసోంలో టెన్త్‌ వరకు హిందీని తప్పనిసరి చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసోం సాహిత్య సభ తప్పుబట్టింది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్రం ప్రకటించడంపై ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు, సాహిత్యకారులు, భాషా పరిరక్షకులు అసమ్మతి తెలుపుతున్నారు. దక్షిణాది పార్టీలు కేంద్రంపై ఘాటైన విమర్శలే సంధించాయి. బిజెపి ఏకీకృత ఎజెండాలో భాగమే హిందీ రగడ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విరుచుకుపడ్డారు. ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎఐడిఎంకె బిజెపికి మిత్రపార్టీ. అయినప్పటికీ హిందీని రుద్దే విషయంలో ఊరుకోబోమంది. ఇంగ్లీషు కారణంగానే బెంగళూరు దేశ ఐ.టి రాజధాని కాగలిగిందని కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్‌ డికె శివకుమార్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. తెలుగు మాట్లాడే తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీ అమిత్‌షా వ్యాఖ్యలను ఆక్షేపించగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసిపి నోరు మెదిపే ధైర్యం చేయడంలేదు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పుట్టిన ప్రతిపక్ష టిడిపి సైతం గమ్మునుంది. ఈ రెండు పార్టీలకు తెలుగు భాషపై ఎంత ప్రేమ ఉందో వారి వైఖరే తెలియజేస్తోంది.
సాంస్కృతిక ఆధిపత్యం కోసం హిందూత్వ ముద్రతో కూడిన జాతీయ వాదానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సాన పెడుతుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆ వాదాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఆ కొనసాగింపులోనిదే హిందీ మంత్రం. నూతన విద్యా విధానంలోనూ అదే సూత్రం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అనేక భాషలు, ప్రాంతాల మేలు కలయిక. బహుళ సంస్కృతుల పట్ల గౌరవం అవశ్యం. బహుత్వాన్ని గుర్తించాలి. అధికారంలో ఉన్నవారు విస్మరించరాదు. రాజ్యాంగం ఇదే విషయాన్ని నొక్కివక్కాణించింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ద్వయం ప్రజల మధ్య చీలికలు పెట్టేందుకు పనిగట్టుకొని పని చేస్తున్నాయి. బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందన్నా, పౌరసత్వ బిల్లు అయినా, కర్ణాటకలో నిన్నమొన్నటి హిజాబ్‌, హలాల్‌, ఆజాద్‌ వివాదాలను తీసుకున్నా, గుంటూరులో జిన్నా టవర్‌, తాజాగా లేవనెత్తిన ఢిల్లీ కుతుబ్‌మినార్‌ గొడవైనా అంతర్లీనంగా కనిపించేది అప్రధానమైన, అనవసరమైన వివాదాలు సృష్టించడం, ప్రజల దృష్టిని పక్కదారి మళ్లించడం, వారిలో చీలికలు సృష్టించడం, ఈ నడుమలో కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టడమే. ఈ కుట్రను ఓడించాలి. హిందూత్వ జాతీయవాదాన్ని దాని ప్రతిరూప రాజకీయ సైద్ధాంతిక పోరాటాలతోనే ఎదుర్కోవాలి. ఈ కర్తవ్యాన్ని అన్ని పార్టీలూ, ప్రజలందరూ స్వీకరించాలి.