లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపర్చడం విచారకరం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 జూన్‌, 2024.

        ఈరోజు జరిగిన లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని  వైస్సార్‌
కాంగ్రెస్‌ పార్టీ బలపర్చడం విచారకరం. వైసిపి తీసుకున్న ఈ చర్య
లౌకికతత్వాన్ని దెబ్బతీస్తోంది. గత ఐదు దశాబ్దాల దేశ చరిత్రలో స్పీకర్‌
అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్‌ ప్రతిపక్షం తీసుకుంటూ వస్తున్న
సంప్రదాయాన్ని మోడీ ప్రభుత్వం తిరస్కరించడం వల్లనే ప్రతిపక్షాలు (ఇండియా
బ్లాక్‌ పార్టీలు) స్పీకర్‌ పదవికి పోటీకి పెట్టాయి. ప్రజాస్వామ్య
ప్రక్రియను, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాలన్న లక్ష్యంతోనే ఆ పని
చేసింది. ఇటువంటి  సమయంలో ప్రతిపక్షానికి బలం చేకూర్చడం ద్వారానే నిరంకుశ
పోకడలను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. కానీ వైయస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు
అధికార పార్టీని బలపరచడం ద్వారా మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి మద్దతు
తెలపడం గర్హనీయం. శాసన సభలో 10% సభ్యులు లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని
కాపాడడానికి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్న వైసిపి,  కేంద్రంలో
మాత్రం ప్రజాస్వామ్య  వైఖరిని బలపర్చకపోవడం వైసిపి ద్వంద్వ వైఖరిని
వెల్లడిస్తోంది.
        తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ప్రజాస్వామ్య సంప్రదాయాలు కాపాడడం కోసం
డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలని కోరితే సమంజసంగా
ఉండేది. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వైఖరులను ప్రజలు
నిరసించాలని, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిలబెట్టేలా వారిపై ఒత్తిడి
తీసుకురావాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి