అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 30 జూలై, 2024.

 

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూములపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

రాష్ట్రంలో అక్రమంగా, దౌర్జన్యంగా వేలాది ఎకరాల పేదల భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. అనేక చోట్ల పేదలు పోరాడుతున్నారు. మదనపల్లిలో మాజీ మంత్రి పెద్దరెడ్డి వందలాది ఎకరాల పేదలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్‌ ఉన్నత అధికారితో విచారణకు ఆదేశించింది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలో పెద్ద ఎత్తన భూ ఆక్రమణలు జరిగాయని నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నత అధికారులతో సమీక్షలు చేసి ఆగష్ట్టు ఐదు నాటికి అన్ని జిల్లా కలెక్టర్లు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. పార్టీల, రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ, పేదల భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని మార్క్సిస్టు పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.  

2017లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విశాఖ చుట్టుపక్క ప్రాంతాలలో 12 మండలాలలో ప్రభుత్వ భూమి, పేదల భూమి వేలాది ఎకరాలు ఆక్రమణ, టాంపరింగ్‌కు గురి అయ్యాయని ఆనాటి గ్రేహౌండ్స్‌ డిజిపి వినీత్‌ బ్రెజిలాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ డా॥ జి.సృజనా నాయకత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. విశాఖ చుట్టు 12 మండలాల్లో వేలాది ఎకరాల ఆక్రమణకు గురైనట్లు 2018 జనవరిలో ఈ సిట్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఇప్పటివరకూ బయట పెట్టలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

  అదేవిధంగా 2019 వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్రాంతి ఐఏఎస్‌ అధికారి డా॥ విజయకుమార్‌ వైవి అనురాధ, విశ్రాంత జిల్లా జడ్జి భాస్కరరావు గారి నాయకత్వంలో మరొక సిట్‌ని వేసింది. ఈ నివేదికను వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకూ బయట పెట్టలేదు. 49 మంది ఉన్నతాధికారులకు ఇందులో పాత్ర ఉన్నట్లు చెప్పినా నేటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. 

ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజులలో అనకాపల్లి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ  బంధువులు శ్రీరామచంద్రమూర్తి దేవస్థానముకు చెందిన సర్వేనెంబర్‌ 66లో సుమారుగా 30 ఎకరాలు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని  వార్తలు వచ్చాయి. సిపిఎం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేసినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రక్రియను ప్రచార ఆర్బాటం కోసం కాకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 2 సిట్‌ నివేదికలను బహిరంగపర్చాలని కోరుతున్నది. ఆక్రమణకు గురైనటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడే భూమిలేని దళితులకు, పేదలకు  పంచాలని, ఆక్రమణకు పాల్పడినవారు ఎంతటి వారైనా, సంబంధిత ఉన్నత అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి