రాష్ట్ర రహదారులపై టోల్‌ ఛార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 ఆగష్టు, 2024.

రాష్ట్ర రహదారులపై టోల్‌ ఛార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలి

రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్‌ ఛార్జీ వసూలు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

పిపిపి పేరుతో రోడ్లపై టోల్‌ టాక్స్‌ వసూలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ల సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తక్షణం వెయ్యి కిలోమీటర్ల పరిధిలో టోల్‌ వసూలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. భవిష్యత్తులో మొత్తం 12,650 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులపై టోల్‌ వసూలు చేసే ప్రమాదముంది. రోడ్లను అభివృద్ధి చేయడం, వాటిని సక్రమంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో లైఫ్‌ టాక్స్‌, డీజిల్‌, ప్రెటోల్‌ పై రోడ్డు సెస్సు తదితర రూపాలలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతోంది. ఆ సొమ్ము ఆయా వాహన యజమానులు, వాటిలో ప్రయాణించేవారు ఇప్పటికే భరిస్తున్నారు. 

ఇప్పటికే జాతీయ రహదారులన్నింటిలో టోల్‌ టాక్సుల భారంతో రవాణా రంగం నష్టాలల్లో ఉన్నది. పిపిపిల పేరిట రాష్ట్ర రహదారుల్లో ప్రతిపాదిక టోల్‌టాక్సులు మోయలేని భారాలుగా మారి రాష్ట్ర రవాణా రంగాన్ని నష్టాలపాలు చేస్తాయి. ప్రజలపై అదనపు భారం పడుతుంది. కావున రాష్ట్ర రహదారులపై టోల్‌టాక్సు ప్రతిపాదన విరమించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి