వరద బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరుతూ...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 10 సెప్టెంబరు, 2024.
        ఇటీవల కృష్ణా నదికి, బుడమేరు వాగుకు వరదల మూలంగా విజయవాడ నగరం, ఉమ్మడి
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలకు, ఆస్తులకు జరిగిన అపార నష్టాన్ని
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే రూ.10 వేల కోట్లు
సహాయంగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, వరద
బాధిత ప్రాంతాల్లో సహాయం క్షేత్రస్థాయి వరకు అందించేటట్లు పటిష్టమైన చర్యలు
తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర ప్రతినిధివర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ
నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతినిధివర్గంలో
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు,
వి.ఉమామహేశ్వరరావు, డి.రమాదేవి, కె.ప్రభాకర్‌రెడ్డి లు ఉన్నారు. ఈ మేరకు
ఈరోజు ఎన్‌టిఆర్‌ కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రిని కలిసి వరద బాధిత ప్రజానీకం
ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి పలు సూచనలతో మెమోరాండం సమర్పించడం
జరిగింది. పై సూచనలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి
చేస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
        బుడమేరు శాశ్విత ముంపు నివారణా చర్యలు చేపట్టాలని, కృష్ణా నది కరకట్ట
వాల్‌ను బలోపేతం చేయాలని ప్రతినిధివర్గం కోరింది. అలాగే వరద ముంపుకు గురైన
ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 వేలు, అంచనాల అనంతరం పూర్తి సహాయం
ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
        వరదలకు గురైన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు, పాత్రలు, బట్టలు
ఇవ్వాలని, ఆగష్టు - సెప్టెంబర్‌ నెలల విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని, వరద
ప్రాంతాల్లో బ్యాంకులు పంట రుణాలు రద్దు చేయాలని, పంట నష్టపోయిన కౌలు
రైతులకు గ్రామ సభల ద్వారా నష్టపరిహారం, పంట రుణాలు ఇవ్వాలని, వ్యవసాయ
కార్మికులకు తక్షణమే ఉపాధిహామీ పనులు చేపట్టాలని, డ్వాక్రా, పొదుపు సంఘాలు,
వృత్తిదారుల రుణాలు మాఫీ చేయాలని కోరారు. మొదలగు డిమాండ్లను మెమోరాండంలో
పేర్కొన్నారు. (పూర్తి మెమోరాండం జతచేయబడినది)
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
గమనిక : మెమోరాండం కాపీ జతచేయబడినది.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: వరద బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని కోరుతూ...
అయ్యా,
        కృష్ణా నదికి, బుడమేరు వాగుకు వరదల మూలంగా ప్రధానంగా విజయవాడ నగరం, ఉమ్మడి
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అపార నష్టం సంభవించింది. గడిచిన వారం రోజులుగా
ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆ తరువాత గోదావరి నది,
కొల్లేరు ప్రాంతం, అదే విధంగా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా,
ఉత్తరాంధ్ర భారీ వర్షాలు, ముంపు ముప్పులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత
ప్రజలను ఆదుకునేందుకు  తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
(1)     కేంద్ర ప్రభుత్వం ఈ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అందుకు రాష్ట్ర
ప్రభుత్వం ఒత్తిడి చేయాలి.
(2)     కేంద్రం తక్షణ సాయంగా పదివేల కోట్ల రూపాయలు విడుదల చేయాలి, నివేదికల
అనంతరం పూర్తి సహాయం ఇవ్వాలి, అన్ని విధాల రాష్ట్రాన్ని ఆదుకోవాలి.
(3)     రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి.
(4)     వరదల్లోను, వర్షాలకు కొండ చరియలు విరిగిపడి మృతి చెందిన వారి
కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. వరద ముంపునకు గురైన
ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలి. అంచనాలు అనంతరం పూర్తి
సహాయం లక్షకు తగ్గకుండా ఇవ్వాలి.
(5)     దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం2 లక్షలు అందించాలి, పూర్తిగా
 దెబ్బతిన్న వాటికి రూ.5లక్షలు ఇచ్చి పునర్నిర్మించాలి.
(6)     ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, పాత్రలు, బట్టలు, మంచాలు
ఇవ్వాలి.
(7)     ఆగస్టు, సెప్టెంబర్‌ నెల విద్యుత్‌ బిల్లులు రద్దు చేయాలి.
(8)     2024-25 ఇంటి పన్నులు, మంచినీరు, డ్రైనేజీ ఇతర యూజర్‌ చార్జీలను రద్దు
చేయాలి.
(9)     ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు ఆర్థిక సంస్థలు రెండు నెలల ఈఎంఐలు రద్దు
చేయాలి, మిగిలిన ఈఎంఐలను సంవత్సరం పాటు వాయిదా వేయాలి.
(10)    ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలకు, ఇతర వాహనాలకు జరిగిన నష్టానికి
అవసరమైతే నిబంధనలు సడలించి ఇన్సూరెన్స్‌ కంపెనీలు పూర్తి పరిహారమివ్వాలి.
ఇన్సూరెన్స్‌లేని వాహనాల పునరుద్దరణకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి.
(11)    చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, పరిశ్రమలు, సంస్థలకు జరిగిన నష్టాన్ని
అంచనా వేసి అన్ని విధాల ఆదుకోవాలి, రుణాలు చెల్లింపు వాయిదా వేసి,
సబ్సిడీతో కొత్త రుణాలు ఇవ్వాలి, ఇన్సూరెన్స్‌ కంపెనీలు నిబంధనలు సడలించి
పూర్తి పరిహారం ఇవ్వాలి.
(12)    బ్యాంకులు లక్ష రూపాయలకు తగ్గకుండా వడ్డీ లేని వినిమయ రుణాలు ఇవ్వాలి.
(13)    విద్యార్ధుల సర్టిఫికెట్లు, పట్టాలు, ప్రజల గుర్తింపు కార్డులు
కోల్పోయిన వారికి ప్రభుత్వ బాధ్యతగా ఆయా డిపార్టుమెంట్లు నుండి తక్షణం
ఇప్పించాలి.
(14)    నిండిపోయిన మరుగుదొడ్లను శుభ్రం చేయించాలి. మహిళలకు శానిటరీ
నాప్‌కిన్స్‌ ఇవ్వాలి. ఇతర అవసరాలు తీర్చాలి.
(15)    వరద ప్రాంతాల్లో బ్యాంకులు పంట రుణాలు రద్దు చేయాలి. కొత్తగా
రుణమివ్వాలి. ప్రయివేటు అప్పుల చెల్లింపు సంవత్సరం పాటు వాయిదా వేయించాలి.
వడ్డీ మాఫీ చేయించాలి. పంటల భీమా చెల్లించాలి.
(16)    నష్టపోయిన పంటలకు వ్యవసాయ ఖర్చులు లెక్కించి ఆయా పంటల వారీగా
నష్టపరిహారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ పంటలకు సబ్సిడీతో విత్తనాలివ్వాలి.
డ్వాక్రా, పొదుపు సంఘాలు, రైతులు, చిరు వ్యాపారులు, వృత్తిదారుల రుణాలు
మాఫీ చేయాలి.
(17)    పంట నష్టపోయిన కౌలు రైతులకు గ్రామ సభల ద్వారా గుర్తించి పంట
నష్టపరిహారం, బ్యాంకులు పంట రుణాలు, రబీ పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి.
(18)    వ్యవసాయ కార్మికులకు తక్షణమే ఉపాధిహామీ పనులు చేపట్టాలి. ముంపుకు
గురైన పేదలందరికీ కుటుంబానికి రూ.10 వేలు నగదు, మూడు నెలలపాటు ఆహార
ధాన్యాలు ఉచితంగా ఇవ్వాలి.
(19)    గొర్రెలు, మేకలు, పశువులకు ఇన్సూరెన్సు, క్లెయిమ్స్‌ త్వరగా
పరిష్కరించాలి. పశు దాణా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి.
(20)    చేతి మగ్గాలు, ఇతర వృత్తిదారులకు జరిగిన నష్టాన్ని ఎన్యూమరేట్‌ చేసి
తగు పరిహారమివ్వాలి.
(21)    బుడమేరు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలి. బుడమేరు ప్రవాహానికి
అడ్డంకులను తొలగించాలి.
(22)    కృష్ణానది కరకట్ట వాల్‌ను బలోపేతం చేయాలి. రిటైనింగ్‌ వాల్‌ నుండి
డ్రైనేజీ నీటి కొరకు ఉన్న ఖాళీల నుండి వరద నీరు రాకుండా జాగ్రత్తలు
తీసుకోవాలి.
(23)    దెబ్బతిన్న గ్యాస్‌ స్టవ్‌ల స్థానే కొత్తవి ఇవ్వాలి. సిలిండర్లు పోయిన
వారికి కొత్త సిలిండర్లు ఇవ్వాలి, ఒక సిలిండర్‌ నింపి ఉచితంగా ఇవ్వాలి.
(24)    ప్రతి ఇంటిలోని వ్యర్ధాలు తొలగించటానికి తగు ఏర్పాట్లు చేయాలి.
(25)    రాకపోకలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.
(26)    సాధారణ పరిస్థితి ఏర్పడే వరకు ప్రాంతాలవారీగా భోజన కేంద్రాలు ఏర్పాటు
చేయాలి.
(27)    టీవీలు, ఫ్రిజ్‌లు, నీటి మోటార్లు, వాషింగ్‌ మిషన్లు, వాహనాలు
రిపేర్లు ఉచితంగా చేయడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
(28)    పెండిరగ్‌లో ఉన్న పెన్షన్‌ తక్షణమే పంపిణీ చేయాలి.
(29)    ప్రతి ఇంటిలో దెబ్బతిన్న వైరింగ్‌ తొలగించి కొత్త వైరింగ్‌తో
విద్యుత్‌ సౌకర్యం పునరుద్ధరించాలి.
(30)    ప్రతి ఇంటికి మంచినీటి మోటర్‌ ఉచితంగా ఇవ్వాలి. కుటుంబానికి రోజూ
20లీటర్లు మంచినీరు సప్లై చేయాలి.
(31)    ముంపునకు గురైన ప్రభుత్వ, వివిధ సంస్థల ఉద్యోగులకు 15 రోజులు పాటు
జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలి.
(32)    రోడ్లు, డ్రైన్లు మరమ్మత్తులు తక్షణం చేపట్టాలి.
(33)    దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు
చేయాలి, వీధిలైట్లు అన్ని పునరుద్ధరించాలి.
(34)    వ్యాధులు ప్రబలకుండా, వైద్య సౌకర్యాలకోసం ప్రతి వార్డుకు, గ్రామానికి
ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి.
(35)    వరద పీిడిత ప్రాంతాలలో అన్ని రకాల వైద్యులతో ప్రత్యేక ఆసుపత్రులు
ఏర్పాటు చేయాలి, పిహెచ్‌సిలు ఉన్న ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పించాలి,
అంబులెన్స్‌లు, జనరేటర్‌లు ఏర్పాటు చేయాలి.
(36)    కొండ ప్రాంతాల్లో నివాస ప్రాంతాల అభివృద్ధికి, రక్షణకు ప్రత్యేక
ప్యాకేజీ ప్రకటించాలి, ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.
(37)    స్కూలు, కాలేజీ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, ఇతర సామాగ్రి
ఉచితంగా ఇవ్వాలి.
(38)    అన్ని ప్రైవేటు స్కూలు, కాలేజీలకు ఫీజులు రద్దు చేయాలి. పేద,
మధ్యతరగతి వారి పిల్లలకు ప్రభుత్వమే ఆ ఫీజులు చెల్లించాలి.
(39)    ముంపు బాధితులైన మునిసిపల్‌, స్కీమ్‌ వర్కర్లు విధులకు హాజరు కావాలని
అధికార్లు ఒత్తిడి చేస్తున్నారు. వారికి మినహాయింపునిచ్చి 15 రోజులపాటు
వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.
అభివందనములతో...

(వై.వెంకటేశ్వరరావు)
 రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
(సిహెచ్‌.బాబూరావు)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
(వి.ఉమామహేశ్వరరావు)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు                   
(డి.రమాదేవి)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
(కె.ప్రభాకర్‌రెడ్డి)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు