చట్రాయిపల్లి గ్రామానికి ప్రత్యేక మోడల్‌ హౌసింగ్‌ కాలనీని ప్రభుత్వమే నిర్మించి మృతిచెందిన వారికి నష్టపరిహరం ప్రకటించాలని,

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 11 సెప్టెంబర్‌, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,  
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: చట్రాయిపల్లి గ్రామానికి ప్రత్యేక మోడల్‌ హౌసింగ్‌ కాలనీని ప్రభుత్వమే నిర్మించి మృతిచెందిన వారికి నష్టపరిహరం ప్రకటించాలని, యుద్దప్రాతిపదికన సీలేరు రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతూ...
అయ్యా,
ఎఎస్‌ఆర్‌ పాడేరు జిల్లాలో తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడి ధ్వంసమైన చట్రాయిపల్లి గ్రామానికి తక్షణమే మోడల్‌ కాలనీని ప్రభుత్వమే నిర్మించి ఆదివాసీలకు ఇవ్వాలని కోరుతున్నాను.
తుఫాన్‌ తీవ్రతరం కావడంతో కొండవాలు ప్రాంతమైన చట్రాయిపల్లి గ్రామంలో కొండచరియలు విరిగిపడి సుమారు 6 ఇళ్లులు పూర్తిగా, 4 ఇళ్లులు పాక్షికంగా ధ్వంసమైంది. 21 ఇంటి లోపల నుండి ఊటనీరు తేలింది. నివాసానికి నిరుపయోకరంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి సంభవించిన ఈ ఘటనలో కొర్రా కుమారి (35) గల్లంతయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన కొర్రా పండన్న, కొర్రా సుమిత్ర, కొర్రా సుబ్బారావులకు  తీవ్ర గాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్యం ప్రభుత్వం అందించాలి. 70 మేకలు, 60 కోళ్లతో పాటు గెమ్మెలి చంద్రయ్యకు చెందిన కిరాణాషాపు, గెమ్మెలి ప్రసాద్‌, పాంగి శ్రీను బైక్‌ లు 2,  ఒక ఆటో, రైస్‌మిల్లు షెడ్డూ,  8 బస్తాల ధాన్యం, 16 బస్తాల తౌడు పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికీ రహదారి పునరుద్దరణ చేయకపోవడంవలన సహయ కార్యక్రమాలకు కూడా తీవ్రమైన ఆటంకం కలిగింది.
ఈ కొండ శిఖరాగ్ర గ్రామంలో 37 కుటుంబాల నుండి 133 మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. గ్రామానికి రహదారి, కమ్యూనికేషన్‌ నేటికి ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయం. చట్రాయిపల్లి గ్రామానికి ప్రత్యేక మోడల్‌ హౌసింగ్‌ కాలనీ మంజూరు చేయాలని కోరుతున్నాను.
జి.కె వీధి మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో సుమారు 6వేల ఎకరాల్లో వరి పంట నష్టం వాటిల్లింది. సుమారు 10 పంచాయితీలు, 100కు పైగా గ్రామాలకు సుమారు 32వేల మందికి జి.కెవీధి మండల కేంద్రానికి అనుసంధానం తెగిపోయింది. సీలేరు రహదారి మరమ్మతు గురైన పాలకులు పట్టించుకోకపోవడం వలన ప్రధాన రహదారి వంతెనలు ధ్వంసమైంది. కనీసం అంబులెన్స్‌ కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిరది. ఏజెన్సీ ప్రాంత తుఫాన్‌ బాధితులకు ప్రభుత్వం సహయం అందడం లేదు.
జి.కె.వీధి మండల పరిధిలోని ఏజెన్సీలో కాల్సైట్‌, లేట్రైట్‌, బిల్డింగ్‌ Ê రోడ్డు మైనింగ్‌ కార్యకలాపాల నిర్వహణకు విచ్చిలవిడిగా ప్రభుత్వం గతంలో అనుమతిచ్చింది. ఫలితంగా పెద్ద ఎత్తున చెట్లు ధ్వంసంకావడంతో పర్యావరణంలో కూడా మార్పులు సంభవించి ఆదివాసీలకు శాపంగా మారింది.
కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వరద సహాయ చర్యలు తక్షణం చేపట్టాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి