భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
11 సెప్టెంబరు, 2024.
వరద బోయినా...డ్రైయినేజీ మురుగునీటిలో మగ్గుతున్నాం...
వ్యాధులు, విషజ్వరాలతో కుటుంబాలు...కుటుంబాలు మంచంపడుతున్నాయి...
దుర్వాసనకు ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం...
అన్నం ప్యాకెట్ల కోసం ఎగబడుతూ పడిపోవాల్సి వస్తోంది.
కన్నీటి పర్యంతమవుతూ సిపిఎం ప్రతినిధి బృందానికి వివరించిన సింగ్‌నగర్ వరద బాధిత ప్రజలు
వరద నష్టరాబాధితులను ఆదుకునేందుకు తక్షణమే అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించాలి
అన్ని విధాలుగా ఆదుకోకుంటే బాధితులను కలుపుకొని ఉద్యమిస్తాం: సిపిఎం ప్రతినిధి బృందం
విజయవాడ సింగ్‌నగర్‌లోని వరద బాధిత ప్రాంతాలయిన 58వ డివిజన్ డాబాకొట్టు బజార్, ఎక్స్‌ఎల్ ప్లాంట్ ఏరియా, వాంబేకాలనీ, శాంతి నగర్, బీరువాల కంపెనీల ఏరియా, పటేల్‌నగర్, రాజీవ్‌నగర్, వడ్డెర కాలనీ తదితర ఏరియాల్లో సిపిఎం ప్రతినిధి బృందం బుధవారం పర్యటించింది. ఈ బృందంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, డి.రమాదేవి, కె ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితరులు ఉన్నారు. ఎల్‌బిఎస్ నగర్, పాతరాజీవ్‌నగర్, పటేల్‌నగర్, వడ్డెర కాలనీ తదితర ఏరియాల్లోని సందుల్లో, వీధుల్లో డ్రైయినేజీ వాటర్ ఇంకా మోకాళ్ల లోతుల్లో తాండవిస్తూ, మురుగునీరు, దుర్వాసన మధ్య ఉండలేకపోతున్నామని ఆయా ప్రాంతాల వరద బాధితులు సిపిఎం బృందానికి తెలిపారు.
అఖిలపక్షం కమిటీ సమావేశం నిర్వహించాలి: సిపిఎం బృందం...
వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వాటిల్లిన నష్టం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పక్షాలతో అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని సిపిఎం బృందం డిమాండ్ చేసింది. సింగ్‌నగర్ ఏరియాల్లో పర్యటించిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ...సర్వం కోల్పోయిన వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని లేనట్లయితే బాధితులను కలుపుకొని ఆందోళన చేయాల్సి వస్తోందని వారు హెచ్చరించారు. కనీవినీ వెరుగని రీతిలో బుడమేరు వరదకు సింగ్‌నగర్ ఏరియాలోని ఎనిమిది డివిజన్లు 30 వేల కుటుంబాలు లక్ష మందికి పైగా తీవ్రంగా నష్టపోయారని, వీరితో పాటు వన్‌టౌన్ భవానీపురం, కబేళా, ఊర్మిళానగర్, హెచ్‌బి కాలనీ, అలాగే రాణిగారితోట తారకరామానగర్, భుషేప్‌గుప్తానగర్ ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. వరదను నివారించడంలో కానీ, ముందస్తుగా ప్రజలకు తెలియచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. అనంతరం వరద బాధితులను ఆదుకోవడంలో కూడా శాఖల మధ్య లోపించిన సమన్వయంతో సందుల్లో, శివారు కాలనీల ప్రజలకు అన్నపానీయాలు అందక అవస్థలు పడ్డారని అన్నారు. ఊహించని రీతిలో వచ్చిన వరద వల్ల గతంలో ఏనాడు జరగనంత నష్టం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలను వరద ముంచేసి 11 రోజులు గడుస్తుందని, ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా, కేంద్రంతో పోట్లాడి తక్షణ సాయం కింద రూ. 10 వేల కోట్లు రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వరదలో అనేక రూపాల్లో ప్రజలు నష్టపోయారని, కార్లు, ఆటోలు, బైక్‌లు, ఇతర సామాగ్రి మొత్తం దెబ్బతిన్నదని ప్రతి ఒక్క బాదితుడికి తగిన న్యాయం జరిగే విధంగా ఇన్సూరెన్స్‌నిబంధనలు సడలించాలని, ఆయా కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడాలని కోరారు. ఆయా పైనాన్స్ కంపెనీలకు ఇఎంఐలు చెల్లింపులు తాత్కాలికంగా నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వం మాట్లాడాలన్నారు. ఇళ్లల్లో వస్తు రూపంలో ఒక్కొక్క ఇంట్లో రూ. లక్షకు పైగా నష్టపోయారన్నారు. ఈ మేరక ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. రెండు మాసాల పాటు విద్యుత్ బిల్లులు ఆపాలని కోరారు. తక్షణ సాయం కింద ప్రభుత్వం రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్యలో మురుగునీరు లేకుండా విఎంసి వాహనాలతో తోడిరచాలని, శానిటేషన్‌ను మెరుగుపరచాలన్నారు. తమ పార్టీ ఆరేడు చోట్ల ఆహారం పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తూ రోజుకు వేలాది మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణారావు, కార్యదర్శివర్గ సభ్యులు కె దుర్గారావు, టి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. (జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి