
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా ఎంపీ సీతారాం ఏచూరి సభా హక్కుల నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి ఒక లేఖ రాశారు. గత నెల 24న రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన హక్కులకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఏచూరి తెలిపారు. తాను హిందూ దేవత దుర్గా మాతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానంటూ ఆధారంలేని ఆరోపణలు చేశారని వివరించారు. కేంద్ర మంత్రే స్వయంగా అలా మాట్లాడిన తరువాత తన అంతు చూస్తామంటూ కొంత మంది దుండగులు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో తనను దూషిస్తున్నారని పేర్కొన్నారు. తన హక్కులను మీరే కాపాడాలని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఏచూరి చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.