
ఫ్రీ బేసిక్స్ వినియోగదారులను కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే పరిమితం చేస్తుంది. వినియోగదారులు ప్రత్యక్షంగా లాభపడేలా ఇంటర్నెట్ ప్యాకేజీలను అందించటం మంచి పథకం. బీహార్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా, రత్నౌలీ గ్రామానికి చెందిన సంజరు సాహ్ని పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఢిల్లీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన గ్రామానికి ఎప్పుడు వచ్చినా తమకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయటానికి జాబ్ కార్డులు అందలేదనో, చేసిన పనికి వేతనాలు అందలేదనో గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వింటుండేవాడు. ఒకరోజు ఆయన ఢిల్లీలో కంప్యూటరు ముందు కూర్చొని ''యన్‌రీగా బీహార్'' అని టైప్ చేశారు. ఆయనకు వచ్చిన సమాచారంలో తన గ్రామానికి చెందిన వారి జాబ్‌కార్డుల్లో ఉన్న అవక తవకలతో కూడిన జాబితా కూడా ఉన్నది. తనకు వచ్చిన మూడ వేల పేజీల సమాచారాన్ని ఆయుధంగా చేసుకొని రత్నౌలీ గ్రామస్తులను తమ హక్కుల సాధన కోసం పోరాడే వారిగా తీర్చిదిద్దారు. స్వేచ్ఛా ఇంటర్నెట్ అందుబాటులో ఉండబట్టే సాహ్ని ఈ విధమైన ఉద్యమం నిర్వహించటం సాధ్యమైంది. సంజరు తనకు కావలసిన వివరాలను ఏ సెర్చి ఇంజన్, ఏ వెబ్‌సైట్ ద్వారా తీసుకోవటానికి ప్రయత్నించినా ఆయనకు కావలసిన సమాచారం వచ్చేది. బహిరంగ ఇంటర్నెట్ ద్వారా కాకుండా ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా సంజరు మొదటిసారిగా ఆన్‌లైన్ ప్రపంచంలోకి అడుగు పెడితే ఏం జరిగి ఉండేది? ప్రభుత్వం ప్రచురిస్తున్న సమాచా రం అంతా ఫ్రీ బేసిక్స్ ద్వారా అందుబాటులోకి వచ్చేదా?
ఇంటర్నెట్ దరిద్రాన్ని తగ్గించటంలో శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. రైతులు వాతావరణాన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలన్నా, చేతివృత్తిదారులు తమ సరుకులు అమ్ముకొనే మార్కెట్‌లో కొనుగోలుదారులు ఎలా ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకోవాలన్నా, గ్రామీణ ప్రాంత విద్యార్థి ఆన్‌లైన్ కోర్సులను గురించి తెలుసుకోవాలన్నా మన ఆలోచన మాత్రమే పరిమితం చేయగలంతటి స్థాయిలో ఇంటర్నెట్ అపరిమితమైన అవకాశాలను కల్పిస్తున్నది. ఈ విధమైన అవకాశాలకు భిన్నం గా, ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో టెల్‌కో భాగస్వాములు ఎంపిక చేసిన కొన్ని సంస్థల వెబ్‌సైట్ల లోకి ఉచితంగా ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నది. ఫ్రీ బేసిక్స్ ను బలపరుస్తున్నవారు ఈ కార్యక్రమానికి వస్తున్న వ్యతిరేక తను చూసి ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యతిరేకతకు కారణాన్ని సంజరు సాహ్ని కథ మనకు స్పష్టం చేస్తున్నది.
గత కొన్ని రోజుల నుంచి వివిధ రకాలైన ప్రచార సాధనాల ద్వారా, వార్తా పత్రికలలో రెండు పేజీలకు విస్తరిం చిన ప్రకటనలు, టెలివిజన్‌లలో ప్రకటనలు స్వయంగా ప్రచారం చేసుకోవటం ద్వారా ఫేస్‌బుక్ భారీస్థాయిలో ప్రచారం నిర్వహించటాన్ని చూస్తున్నాం. టెలికాం ఆపరేటర్లు గతంలో చేసిన ఈ విధమైన ప్రయత్నాలను ఇంటర్నెట్ రక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు నిరోధించాయి. ఇందుకు సంబంధించిన వాస్తవాలన్నింటినీ ప్రజలకు చెప్పకుండా, మార్కెటింగ్ చేయటంలో తనకున్న శక్తిని, తన స్వంత ప్రచార యంత్రాగాన్ని వినియోగించుకొంటూ, లక్షలాది డాలర్లను ఖర్చుపెట్టి ఫ్రీ బేసిక్స్‌కు మద్దతును సమీకరించుకోవటం కోసం ఫేస్‌బుక్ ప్రచార యుద్ధాన్ని ప్రారంభించింది. కొన్ని వెబ్‌సైట్లకే పరిమితం చేయటం అనేది ఇంటర్నెట్ స్వేచ్ఛా భావనకు విరుద్ధమైనది. పేదలకు అనుకూలత ముసుగులో ఫేస్‌బుక్ ఇంటర్నెట్‌ను విభజించ టానికి పూనుకుంటున్నది. ఫ్రీ బేసిక్స్ ఆమోదించిన వెబ్‌సైట్ లు మాత్రమే ఉచితంగా చూడటానికి వీలవుతుంది. సిద్దాంతపరంగా చూస్తే ఈ రోజు సాంకేతిక ప్రమాణాలను అందుకోగలిగిన వారు భాగస్వాములు కాగలరు. టెలికాం సంస్థలు వాగ్దానం చేస్తున్న సేవలతో పోటీపడే శక్తి కలిగిన సంస్థలు ఫ్రీ బేసిక్స్‌లో భాగస్వాములు కాకపోవచ్చు. ఉచితంగా వినియోగించుకొనే దానిని ఫేస్‌బుక్ ప్రస్తుతం సబ్సిడీ ద్వారా చెల్లించకపోవటంతో టెలికాం సంస్థలు ధరలను పెంచే అవకాశం ఉన్నది. దీనిలో భాగస్వాములు కావటానికి ప్రయత్నించేవారికి సంబంధించిన నిబంధనలను ఇష్టమొచ్చినట్లు మార్చటానికి, ఫేస్‌బుక్ యాడ్స్‌ను ప్రసారం చేయటానికి వ్యాపారం చేసుకొనే వారు చెల్లింపులు చేయాల్సి న పరిస్థితి ఉండటంతో భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నది. ఆ విధంగా అనిశ్చితంగా కుదించబడి, భయంతో కూడిన వాతావరణం ఉన్నచోట నూతన ఆవిష్కరణలకు ఏ విధంగా అవకాశం ఉంటుంది? రానున్న కొద్ది సంవత్సరాలలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల సేవలన్నీ ఆన్‌లైన్ అవుతాయి. అప్పుడు ప్రతి ప్రభుత్వ సంస్థ తప్పనిసరిగా తన వెబ్‌సైట్‌ను ఫేస్‌బుక్‌కు అందించాలా? ఫ్రీ బేసిక్స్‌తో డిజిటల్ ఇండియా ప్రారంభంలోనే మరణానికి చేరువౌతుంది.
ఇంటర్నెట్ తటస్థతను గౌరవించే విధంగా, ప్రోత్సాహ కాలను అందించే విధంగా, ఈ కార్యక్రమం వేగంగా సాగిపో యే విధంగా, ఫేస్‌బుక్ కూడా పాల్గొనటానికి అనుగుణంగా భిన్నమైన పరిష్కారాన్ని మేము సూచిస్తున్నాం. ఇంటర్నెట్ వినియోగ ప్యాకేజీలకు ప్రభుత్వం ప్రత్యక్షంగా లాభం కల్పించే (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, డిబిటి) విధానాన్ని ప్రభుత్వం అనుసరించాలని మేము ప్రతిపాదిస్తున్నాము. వంటగ్యాస్ వినియోగదారులకు వారి బ్యాంకు ఎకౌంట్లకు డబ్బు జమ చేయటం ద్వారా 10 కోట్లమందికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించే విధానం జయప్రదమవటాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రతిపాదన చేస్తున్నాము. ఉదాహరణకు ప్రతి ఇంటర్నెట్ వినియోగదారునికీ సంవత్సరానికి 120 యంబిని డిబిటి ద్వారా అందించే పథకాన్ని ప్రవేశపెడితే, ప్రతి నెలా వినియో గించుకొనే దానిలో మొదటి 10 యంబి వారికి ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ డేటా ప్యాకేజీలను పరిశీలిస్తే, ఏ విధంగా చూసినా 3జిలో 1 యంబి డేటాకు 25 పైసలకు మించి ఖర్చుకాదు. ప్రభుత్వ స్థాయిలో ఇది చాలా అత్యల్పమైన ఖర్చు మాత్రమే. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగిస్తున్న 40 కోట్ల మంది, కొత్తగా వినియోగించ బోయే 40 కోట్ల మందిని కలుపుకుంటే మొత్తం 80 కోట్ల మందికి డేటాను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం కల్పిస్తే, ఒక్కొక్కరికి 30 రూపాయల చొప్పున సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతాయి. ఉచితంగా వచ్చే డేటాను వినియోగించుకోవటానికి వినియోగదారులు అనేక సిమ్‌లను కొనవచ్చు. సెల్‌ఫోన్ నంబర్లను ఆధార్ నంబరుకు అనుసంధానం చేయటం (ప్రస్తుతం 95 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి) ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. అప్పుడు ఒక వ్యక్తి ఒక డిబిటి ప్యాకేజీని మాత్రమే పొందగలుగుతాడు.
ఇది ఎక్కువ డబ్బు అవసరమైన పథకంగా మనకు కనిపిస్తుంది. కానీ మనం ఒక దేశంగా ప్రజలందరినీ ఆన్‌లైన్ లోకి తీసుకురావటానికి ఈ ఖర్చును భరించాలి. గతం నుంచి వివిధ టెలికాం ఆపరేటింగ్ సంస్థలు చెల్లించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు టెలికాం డిపార్ట్‌మెంటు వద్ద ఉన్నది. ఫేస్‌బుక్ కూడా అంతే మొత్తాన్ని తోడుచేసి, మార్కెట్లను వక్రీకరించకుండానే భారతదేశ ప్రజలందరినీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని తను చెబుతున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. మేము రూపొందించిన నమూనాతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా డిబిటి డేటా ప్యాకేజీని మూడు నెలల్లో అందించవచ్చు.
ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు దేశంలో 40 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు న్నారని చెబుతున్నాయి. ఇంటర్నెట్ అందిస్తున్న విలువల ద్వారానే వీరందరూ ఆన్‌లైన్‌లోకి వచ్చారు మినహా ఫ్రీ బేసిక్స్ ద్వారా కాదు. భారతదేశ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రానున్న కొద్ది సంవత్సరాలలో అభివృద్ధి కోసం వేలాది లేక లక్షలాది నూతన ప్రయోగాలు జరుగుతాయని సులభంగానే ఊహించవచ్చు. ఆధార్ ఆథెంటికేషన్, ఇ-కెవైసి, ఇ సైన్, డిజిటల్ లాకర్, యుపిఐతో కలిపి, వివిధ చెల్లింపులను డబ్బు లేకుండా, కాగితం లేకుండా, మనిషితో అవసరం లేకుండా సెల్‌ఫోన్ల ద్వారా నిర్వహించే ఇండియా స్టాక్ లాంటి నూతన ఆవిష్కరణల అభివృద్ధిని గురించి ఆలోచించవచ్చు. ఒక సమాజంగా కీలకమైన ఈ సంధి కాలంలో మనం పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ విధమైన నూతన పద్ధతుల అభివృద్ధి అంతమౌతుంది.
ఇంటర్నెట్ తటస్థతను పరిరక్షిస్తామని ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి, అందుకనుగుణంగా చట్టాలను చేయా లి. ఇంటర్నెట్ అంతటినీ పూర్తి ఉచితంగా వినియోగిం చుకోవ టానికి మనకున్న హక్కును పరిరక్షించుకోవాలి. ఇందుకు భిన్నంగా ఏమి చేసినా భారతదేశం తన ప్రయోజ నాల కోసం కాక ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేసే దేశంగా మారి, ఇంటర్నెట్ దిగ్గజాలకు డిజిటల్ వలసగా మారుతుంది.
- నందన్ నీలేకని, విరాల్ షా