బిజెపి ద్రోహంపై టిడిపి వైఖరేంటి?:మధు

ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన బిజెపితో అనుబంధంపై టిడిపి తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాను సాధిస్తామని, రాష్ట్రాభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇందుకు ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టిడిపి సిద్ధమైతే, సిపిఎం సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర మంత్రులే పార్లమెంట్‌ సాక్షిగా కుండబద్దలు కొట్టారన్నారు. గత ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని టిడిపి, బిజెపి హామీలిచ్చాయని గుర్తు చేశారు. విభజన చట్టంలోని అంశాలు, ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఇప్పటికీ టిడిపి తన వైఖరిని స్పష్టం చేయకపోతే, మోసంలో ఆ పార్టీకి సంబంధం ఉందని అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు.