
భగత్‌సింగ్ స్ఫూర్తితో సమస్యలపై విద్యార్థులు ఉద్యమాల్లో ముందుండాలని మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు పిలుపు నిచ్చారు. భగత్‌సింగ్ 108వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎజిహెచ్‌ఎస్ పాఠశాలలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కారం నాగేశ్వరావు అధ్యక్షతన ఆదివారం సభ జరిగింది. మిడియం మాట్లాడుతూ నాడు భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యువకిషోరం భగత్‌సింగ్ అని ఆయన కొనియాడారు. యువకుల్లో విప్లవాన్ని రగిలించి, బ్రిటీష్ ప్రభుత్వానికి వెరవకుండా తీవ్రమైన పోరాటాన్ని నడిపించారని. 1907లో జన్మించిన భగత్‌సింగ్ భరతమాత విముక్తే ధ్యేయంగా 23 ఏళ్లకే ఉరితాడును ముద్దాడారని చెప్పారు. అదే స్ఫూర్తితో విద్యా రంగంలోని సామ్రాజ్యవాదులపై ఎస్‌ఎఫ్‌ఐలో సభ్యులుగా ఉండి, పోరా డాల్సిన అవసరముందన్నారు. నేడు 10 వేలమంది ఉన్నా జాతికి ప్రత్యేక లిపితో పాఠాలు చెప్పాలని చట్టాల్లో ఉందన్నారు. 10 లక్షల మంది కోయజాతి ఉన్నా లిపిలో బోధించకుండా సామ్రాజ్యవాద విధానాలను రుద్దుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులతోపాటు స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం కదలాలన్నారు. వేగుచుక్క, భగత్‌సింగ్‌లా సామ్రాజ్యవాదంపై పోరాడినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించిన వారమౌతామన్నారు.