
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని స్పష్టం చేసింది. భూసేకరణ నోటిఫికేషన్ రాష్ట్ర గజిట్ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. దీనికి భిన్నంగా కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తుండడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఇకపై ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేసినా న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి విలాస్ అబ్దుల్ పుకార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.