
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. స్థానిక సెయింట్‌పాల్ చర్చి మైదానంలో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చేపట్టిన దీక్షను రెండో రోజే పోలీసులు భగ్నం చేయడం.. ఆ సమయంలో హర్షకుమార్ తన వద్దనున్న తుపాకీతో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపడం.. వంటి ఘటనలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగరంలో సీఎం పర్యటన కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజమండ్రి నగరంలో ముస్లింలకు షాదిఖానా, క్రైస్తవులకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హర్షకుమార్ శుక్రవారం దీక్ష ప్రారంభించారు. దీక్షకు పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. కానీ, శనివారం సాయంత్రం పోలీసులు దీక్ష జరుగుతున్న సెయింట్‌పాల్ చర్చి మైదానంలోకి ప్రవేశించారు. పోలీసులు రావడాన్ని గమనించిన హర్షకుమార్ దీక్షను భగ్నం చేయడానికే వారు వచ్చారని, వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయితే, పోలీసులు వేదిక వైపు వస్తుండటంతో తన వద్దనున్న తుపాకీని తీసి దగ్గరకు వస్తే కాల్చుకుంటానని బెదిరించారు. అయినా పోలీసులు వేదికను చుట్టుముట్టడంతో ఆయన రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి హర్షకుమార్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వేదిక వద్ద తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. హర్షకుమార్‌కూ స్వల్ప గాయాలయ్యాయి. దీక్షను భగ్నం చేసిన పోలీసులు హర్షకుమార్‌ను బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తానని హర్షకుమార్ ప్రకటించారు. ప్రాణరక్షణ కోసమే హర్షకుమార్ గాల్లోకి కాల్పులు జరిపారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీక్షను భగ్నం చేయడంతో ఆగ్రహావేశాలకు లోనైన కొందరు అనుచరులు రోడ్లపై వెళుతున్న వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద హర్షకుమార్ తనయులు జీవీ శ్రీరాజ్, సుందర్, దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.