హోరాహోరిగా పార్లమెంట్ సమావేశాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు తొలిరోజునుంచే వేడిపుట్టించనున్నాయి. ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీకి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఇతర కుంభకోణాల్లో ఇరుక్కున్న మరో ఇద్దరు బీజేపీ రాషా్ట్రల సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌లు రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి. విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సహచర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో విడివిడిగా సమావేశమయ్యారు. వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పరిస్థితి తదితర అంశాలపై వారు కీలక చర్చలు జరిపారు. ప్రధాని దృష్టికి రాజ్‌నాథ్‌ అనేక విషయాలను తీసుకువెళ్లినట్లు ఆ వర్గాలు వివరించాయి. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, మంత్రి సుష్మా స్వరాజ్‌ బాగా పనిచేసే మంత్రులలో ఒకరనీ, ఆమె వైదొలిగే ప్రశ్నే తలెత్తదనీ అన్నారు. ఆమె నైతికంగా, చట్టపరంగా తప్పేమీ చేయలేదని కితాబిచ్చారు. రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజే రాజీనామా డిమాండ్‌కూ.... పార్లమెంట్‌కూ సంబంధమేమిటని వెంకయ్య ప్రశ్నించారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం శాసనపరమైన, ఆర్థికపరమైన 35 దాకా బిల్లులను తీసుకురావాలని భావిస్తోంది. దీని కోసం వ్యూహాన్ని రూపొందించేందుకు ఆయన గురువారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సమావేశాలలో తమ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌, సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌, ఇతరులు సమావేశమై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇతర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.