
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ' ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం ' అనే అంశంపై కెవిపిఎస్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహిం చారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అగ్రవర్ణ కులాల పెత్తందార్లు తామూ పేదలమేనని, తమకూ రిజర్వేషన్లు కల్పించాలని, లేదంటే ఉన్న రిజర్వేషన్లను తొలగించాలని విష పూరిత ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలను వ్యక్తిగతంగా కాకుండా అన్ని దళిత, గిరిజన, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మేధావులు ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లతో బాటు మరి కొన్ని అంశాలపైనా పోరాటం చేయాలని సూచించారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో సవరించిన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని రాజ్యసభలో ఆమోదం పొం దేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులపై పార్లమెంటులో చర్చించాలని, ప్రభుత్వ రంగంలోని బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.