
దళిత వ్యతిరేక విధానాలకు, మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దళితులు ఉప్పెనలా కదలాలని సిపిఎం, సిపిఐ రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. సామాజిక న్యాయం, దళిత సంక్షేమం, సమగ్రాభివృద్ది కోసం నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి రండి పేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్ సమావేశానికి సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు టి.అరుణ్, తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామాజిక న్యాయం బలైందన్నారు. దళితులు, కార్మికులు, గిరిజనులు ఉన్న హక్కులు కోల్పోతున్నారన్నారు. ఎస్సి సబ్‌ప్లాన్ రాజ్యాంగహక్కుగా ఉండాలన్నారు. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఇలాంటి కేసులు 75 శాతం పోలీసుస్టేషన్లలో నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జులై 14న రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి దళిత సదస్సు పాలకుల గుండెల్లో గుబులు రేపాలన్నారు.