
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు నిరుద్యోగులకు తీరని ద్రోహం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరవంలోని హోటల్ రివర్‌బేలో బుధవారం రాష్ట్ర స్థాయి నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. కేంద్రలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి పూర్తి భిన్నమైన విధానాలను అనుసరిస్తున్న ఫలితంగానే నిరుద్యోగ సమస్య నానాటికి పెరుగుతోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన బిజెపి, ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామంటూ హామీ ఇచ్చిన వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని బుట్టదాఖలు చేశాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో కీలకమైన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకోవడంలో వైసిపి సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. పదేళ్లలో బిజెపి సర్కారు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయకపోగా, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్ర చేస్తోందని తెలిపారు. 32 మంది యువకుల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొర్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందని, కడప ఉక్కు పరిశ్రమ మాటే పరిచిందని అన్నారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ అనంతరం 60 లక్షల మందికి ఉద్యోగాలస్తాయంటూ ప్రచారం చేశారని, ఏడు నెలలు గడుస్తున్నా పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు ఎందుకు పడడంలేదని ప్రశ్నించారు.
ఎంఎల్‌సి కెఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 30 వేల పోస్టులతో మెగా డిఎస్‌సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి జిల్లాలో జ్యోతిరావు ఫూలే స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపికి రాష్ట్రంలో వైసిపి, టిడిపి వంతపాడడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించని పాలక ప్రభుత్వాలపై దానినే రాజకీయ అస్త్రంగా మలచుకొని తిరగబడాలని యువతకు పిలుపునిచ్చారు.
- 19 తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం
సమావేశంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న 19 తీర్మానాలను ప్రవేశపెట్టారు. దీన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. మెగా డిఎస్‌సిని 40 వేల పోస్టులు పిఇటిలతో కలిపి ప్రకటించాలని, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9.64 లక్షల పోస్టులను భర్తీ చేయాలని, ఆంధ్రప్రదేశ్ నూతన యూత్ పాలసీని ప్రకటించాలని, ఐదు వేల పోస్టులతో గ్రూప్‌ా1, 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్రంలో ఐటి, సినీ పరిశ్రమలను అభివృద్ధి చేయాలని, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ, ఉపాధి జిఒను అమలు చేయాలని తదితర తీర్మానాలను ఆమోదించారు.