
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 15 నవంబర్, 2023.
శ్రీయుత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని (ఎ.పి.ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/2023) ఉపసంహరించాలని కోరుతూ...
అయ్యా!
అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం (ఎ.పి.ల్యాండ్ టైటిలింగ్ చట్టం 27/ 2023) జి.వో.నెంబర్ 512 చిన్నకారు, సన్నకారు బడుగు బలహీన రైతులకు ముప్పు ఉంటుందని భావిస్తున్నాను. దీనిపై న్యాయవాదులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల స్థిరాస్థుల విషయంలో వివాదాలు ఏర్పడినప్పుడు ఆ వివాదాలను పరిష్కరించే అధికారం సివిల్ కోర్టుల పరిధి నుండి తప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా స్థాయి ట్రిబ్యూనల్స్‌కు అధికారానివ్వడం. ట్రిబ్యూనల్ ఉత్తర్వులుపై నేరుగా హైకోర్టుకు మాత్రమే అప్పీలు చేసుకునే అధికారాలిచ్చారు. సామాన్యులు హైకోర్టులో పిటిషన్ వేసుకోవడమంటే చాలా డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా చాలా ప్రయాస పడాలి. ఇది దాదాపు అసాధ్యం. ఈ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదుచేసే హక్కు రిజిస్టరులో ఒక్క సారి భూహక్కు దారుడు పేరున నమోదైన తరువాత ఎవరికైనా అభ్యంతరముంటే జాయింట్ కలెక్టరు నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యూనల్లోనే తేల్చుకోవలసి ఉంటుంది.
చిన్న, సన్నకారు రైతులు రెవిన్యూ అధికారుల తప్పుల వలనే వారి భూహక్కులను కోల్పోతూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ ఆ అధికారులకే భూములకు శాశ్వత హక్కులను కల్పించడానికి ఈ చట్టం ద్వారా అధికారాలను కట్టబెట్టడం అదే శాశ్వతం అనడం చాలా అన్యాయం. కేవలం చిన్న, సన్నకారు రైతులు, దళిత, గిరిజన భూములను కబ్జా చేయడానికి ఈ భూహక్కుల చట్టం అవకాశమిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న 30 రకాల రికార్డులు (ఉదాహరణకు పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, అడంగళ్, 1బి లాంటివి) రద్దు కానున్నాయి.
ఈ చట్టం అమల్లోకి వస్తే ఏ కోర్టులోనూ సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదు. వీటి స్థానంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో ట్రిబ్యూనల్ చొప్పున 26 ట్రిబ్యునల్‌లలో కేసులను త్వరితగతిన పరిష్కస్తామని ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 563 కోర్టుల్లో చేయలేని పనిని 26 ట్రిబ్యూనల్స్ ఎలా పరిష్కరిస్తాయో అర్థం కావడం లేదు. ఈ చట్టం ద్వారా కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు, కార్పొరేట్లకు భూములు దారాదత్తం చేసేట్లు అవకాశాలు కల్పిస్తున్నది. ఈ కొత్త చట్టం ప్రకారం మనకు అందుబాటులో ఉన్న కోర్టులో కేసు వేయడానికి వీలులేదని ఈ చట్టంలో నిబంధన ఉండటం రాజ్యాంగ వ్యతిరేకం కూడా.
ఈ నిబంధన వల్ల చిన్న, సన్నకారు రైతులు తమకు ఉండే కొద్దిపాటి భూముల విషయంలో వారి హక్కును నిర్దారించుకోవడానికి అవకాశం లేక శాశ్వతంగా భూమిని కోల్పోవలసి ఉంటుంది. ఈ చట్టం వలన చిన్న, సన్నకారు రైతుల భూములు, భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఈ చట్టం ప్రమాదం న్యాయవాదులకే కాదు, సన్న, చిన్న కారు, దళిత, గిరిజన, పేద వర్గాలకు ప్రమాదకరం. కాబట్టి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి