
- ఆర్‌ఎస్‌ఎస్ చెప్పుచేతల్లో కేంద్ర ప్రభుత్వం
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి విమర్శ
- అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే వైసిపి పతనం
- సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హెచ్చరిక
మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాముడు పేరుతో బిజెపి ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, ఈ నెల 22న అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి విమర్శించారు. ఏలూరులోని శ్రీ హోట్‌ల్ కన్వెన్షన్ హాలులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు విచ్చేసిన పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి, బివి.రాఘవులు బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంఎ.బేబి మాట్లాడుతూ… పార్లమెంట్ భద్రతపై ప్రధానమంత్రిగాని, హోంమంత్రి గాని నోరు మెదపకపోవడం దారుణమని విమర్శించారు. దీనిపై నిలదీసిన ప్రతిపక్షాలను బయటకు గెంటివేసి కీలక బిల్లులు ఆమోదింపచేసుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల డిమాండ్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం అప్రజాస్వామికమన్నారు. బిల్కిస్ బానో నేరస్తులను గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా విడుదల చేసిందని, ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టిందని తెలిపారు. ప్రజలు వివిధ మతాలను విశ్వసిస్తారని, ఇది లౌకిక రాజ్యమని తెలిపారు. బిజెపి మాత్రం రాముడి నినాదంతో ముందుకు సాగుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ లౌకిక తత్వానికి తూట్లు పొడుస్తోందని, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఎవరైనా ఇల్లు పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేస్తారని, అయితే అందుకు విరుద్ధంగా రామాలయం పూర్తి కాకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బిజెపి కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, వారి సమస్యలను పట్టించుకోకుండా మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బివి.రాఘవులు మాట్లాడుతూ… అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా సాగదీస్తే రాజకీయంగా వైసిపి పతనం ఖాయమని, అధికారాన్ని పళ్లెంలో పెట్టి ప్రతిపక్షాలకు అప్పగించడమేనని హెచ్చరించారు. అంగన్‌వాడీల సమ్మె మొదలైన 26 రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్మా గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. గతంలో జయలలిత ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించగా తరువాత ఆమె ప్రభుత్వాన్ని జనం తొలగించారన్నారు. అణచివేత చర్యలు మంచివి కావని, చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంగన్‌వాడీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గనలేదని, మద్దతు ప్రకటించారని చెప్పారు. రాజకీయపక్షాల సహాయం తీసుకుని తక్షణం పరిష్కరించాలని సిపిఎంని అడిగితే చేతనైన సహాయం చేస్తామన్నారు. లేదంటే రాజకీయ పార్టీలుగా ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగుతామని హెచ్చరించారు. మీడియాను కూడా ఉగ్రవాద చట్టాల వంటి పరిధిలోకి తీసుకొచ్చి నియంత్రించే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయని చెప్పారు. న్యూస్‌క్లిక్ వంటి పలు పోర్టల్స్ విషయంలో జర్నలిస్టులను వేధిస్తున్నారని, దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, ఎన్‌డిఎలో భాగస్వాములైన పార్టీలతో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అఖిలభారత స్థాయిలో ఇండియా వేదిక ఏర్పడిందని, ఎన్నికల్లో ఆ పార్టీలు తగిన విధంగా వ్యవహరిస్తాయన్నారు. జగన్ ఇండియా వేదికకు రారు, బిజెపిని వదలరని పేర్కొన్నారు. జనసేన, టిడిపి ఏ కూటమిలో ఉంటాయో తేలాల్సి ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి పాల్గన్నారు.