రాజధాని అమరావతిపై వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలి - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 జూలై, 2024.
రాజధాని అమరావతిపై  వ్యవస్థీకృతమైన సమగ్ర ఏర్పాట్లు చేయాలి
- సిపిఐ(యం)
        రాజధాని అమరావతి అంశంపై భవిష్యత్తులో అనిశ్చితి, గందరగోళం లేకుండా
నివారించడానికి సమగ్రమైన వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. అమరావతి రైతులు, కూలీల కడగండ్లకు
కారణమైన గత ప్రభుత్వ తప్పుడు విధానాలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు
తీసుకొని అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. అదే విధంగా రాజధాని
అమరావతితో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తగు
చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
        రాజధాని అమరావతి, క్యాపిటల్‌ రీజియన్‌ పై 2014 నుండి ఇప్పటివరకు జరిగిన
పరిణామాలను, సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పై విడుదల చేసిన
శ్వేతపత్రంలో పొందుపరిచారు. గత వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులు పేరిట
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి అభివృద్ధిని ఆటంకపరిచిన అంశాలు
శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 2019 నుండి ఇప్పటి వరకు రైతులు, స్థానిక ప్రజలు
సాగించిన ఉద్యమాలు, నిర్బంధం గురించి పేర్కొనటం  సముచితమే.
        రాజధాని నిర్మాణం జాప్యం జరిగినందున రైతులకు కౌలు, పేదలకు పెన్షన్‌ మరో 10
సంవత్సరాలు పొడిగించాలి. ఎస్సైన్డ్‌ రైతులకు సమానమైన ప్యాకేజీ ఇవ్వాలి. ఈ
అంశాల పైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఐదు సంవత్సరాల నిర్దిష్ట కాల
పరిమితిలో పూర్తి చేయవలసిన నిర్మాణాలు, అభివృద్ధిపై ప్రధాన దృష్టి
పెట్టాలి. ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అమరావతి అభివృద్ధికి
చర్యలు చేపట్టాలి.
        రాజధాని అమరావతిలో భాగస్వాములైన వివిధ తరగతులు, వర్గాలు, ప్రజా సంఘాలతో
చర్చించి వారి సూచనలు, సలహాలు స్వీకరించి రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌
తదితర అంశాల్లో ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా తగు మార్పులు, చేర్పులు
చేసుకోవాలి. భూముల అమ్మకాలు, విదేశీ సంస్థల పాత్ర తదితర అంశాలపై సమగ్ర చర్చ
జరగాలి. గత అనుభవాల ఆధారంగా రాజధాని నిర్మాణం మోడల్‌లో తగు మార్పులు,
చేర్పులు చేయాలి. త్వరితగతిన అమరావతిలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు
పూర్తి చేసుకుని భవిష్యత్తు అభివృద్ధి పై దృష్టి సారించాలి.
        అయితే రాజధాని అమరావతి, సిఆర్‌డిఏ ప్రాంత అభివృద్ధికి భవిష్యత్‌ ప్రణాళిక
గురించి శ్వేత పత్రములో ప్రస్తావించలేదు. గత పది సంవత్సరాలు నుండి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢల్లీిని తలదన్నే రాజధాని నిర్మిస్తామని
హామీలు ఇచ్చినా, నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది.
ఇప్పటికైనా రాజధాని నిర్మాణానికి విభజన చట్ట ప్రకారం నిధులను కేంద్ర
ప్రభుత్వమే భరించాలి. రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, మెట్రో, కేంద్ర
ప్రభుత్వ సంస్థల ఏర్పాటు తదితర అంశాల పైన కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు
చేపట్టాలి.
        భూ సమీకరణ చట్ట ప్రకారం రైతులకు ప్లాట్లు అభివృద్ధి ,భూమిలేని పేదలకు
పెన్షన్లు, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన, ఉచిత విద్య, వైద్యం తదితర
చట్టబద్ధమైన హామీలను అన్నింటిని ఖచ్చితంగా అమలు  చేయాలి. ఇందుకు అవసరమైన
నిధులు సమకూర్చుకోవడం, కేంద్రం నుంచి రాబట్టడం తదితర విషయాలతో
శ్వేతపత్రాన్ని సమగ్రంగా రూపొందించాల్సిన అవసరం వుంది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి