వరద బాధితులను ఆదుకోండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02  సెప్టెంబరు, 2024.

 

వరద బాధితులను ఆదుకోండి

 

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 15 మంది దుర్మరణం చెందడం విచారకరం. అనేకమంది గల్లంతయ్యారని వార్తలు వస్తున్నాయి. విజయవాడ బుడమేరు పొంగడం, కృష్ణానదికి వరద వలన లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. బుడమేరు గేట్లు ఎత్తిన విషయం పరిసర ప్రాంతాల నివాసితులకు చేరవేయడంలో లోపం వల్ల నష్టం మరింత పెరిగింది. 4 లక్షల ఎకరాలలో పంట దెబ్బతిన్నది. చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(యం) కోరుతున్నది. నిరాశ్రయుల కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించి, ఆహారం, వసతి, వైద్యం అందించాలి. వరద సహాయ కార్యక్రమాల్లో అన్ని శాఖలు పాల్గొనాలని రాష్ట్ర కమిటి పిలుపునిస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలు బాధితులకు ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్ని చోట్ల హడావుడి తప్ప సహాయం అందటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు సహాయం ప్రకటించలేదు. ముఖ్యమంత్రి కేంద్రాన్ని అభ్యర్ధించినా ఇప్పటివరకు ఎటువంటి సహాయం చేయలేదు. కేంద్రం వెంటనే సహాయాన్ని ప్రకటించాలి.

ఇళ్లల్లో నిత్యావసరాలు, సామాను అంతా వరదకు తడిసి పనికి రాకుండా పోయింది. నెలకు సరిపడా బియ్యం, ఇతర నిత్యావసరాలు రేషన్‌తో పాటు ఉచితంగా అందించాలి. ఒక్కో బాధిత కుటుంబానికి 25వేల రుపాయలు తక్షణ సహాయం ఇవ్వాలి. వివిధ కుటుంబాలకు జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి తగు రీతిలో నష్టపరిహారం ఇవ్వాలి. ఇళ్ల పున: నిర్మాణానికి సహాయం చేయాలి.

నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10వేల నుండి రూ.20వేల వరకు నష్టపరిహారాన్ని ఇచ్చి రైతులను, కౌలు రైతులను, వరదలలో ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.

విజయవాడ వరదల్లో చిక్కుకున్న బాధితులను పరామర్శించడానికి సిపిఐ(యం) రాష్ట్ర ప్రతినిధి బృందం  ఈ రోజు పర్యటించింది. పర్యటించిన వారిలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబురావు, డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మ, కె. ప్రభాకరరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి  డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటి సభ్యులు డి.కాశీనాధ్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. 

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org