విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆపండి - సిపిఐ(యం) డిమాండ్‌.... వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 నవంబర్‌, 2024.

విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆపండి - సిపిఐ(యం) డిమాండ్‌
వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపు
        రైతులు, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు
బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఐఎం డిమాండ్‌ చేస్తున్నది.
        తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు
జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు
బిగించారు. ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ
స్మార్ట్‌ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి
సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం
కొనసాగిస్తున్నారు.
        వైసిపి ప్రభుత్వం పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా
తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు
పగలగొట్టాలని పిలుపునిచ్చారు.
        అదాని, షిర్డీ సాయి సంస్థలతో కుమ్మక్కయ్యి, వేలాది కోట్ల రూపాయలు
అవినీతికి పాల్పడి ఒప్పందాలు చేసుకొని మీటర్లు పెడుతున్నారని నాడు
ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ
ప్రతి కనెక్షన్‌కు స్మార్ట్‌ మీటర్‌ పెట్టడం నమ్మకద్రోహమే.
        ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల వల్ల ప్రజలందరిపై భారం పెరుగుతుంది.
ముందుగానే డబ్బు చెల్లించి రీఛార్జ్‌ చేయించుకోవాలి. బ్యాలెన్స్‌ పూర్తి
కాగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. పేదలకు అంధకారమే మిగులుతుంది.
మరోవైపు ప్రతి మీటర్‌ కు అయ్యే వ్యయం 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వేలాది
రూపాయలు వినియోగదారుల నుండే వసూలు చేస్తారు. మరోవైపు విద్యుత్‌ అధికంగా
వినియోగించే రాత్రి వేళల్లో అధిక రేట్లు వసూలు చేయటం నడ్డి విరిచే భారం.
వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఎసరపెట్టేందుకే పంపు సెట్లకు మీటర్లు
బిగిస్తున్నారు. ఏ భారం ఉండదని పైకి చెప్తున్నా ప్రయివేటు విద్యుత్‌
ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ, ప్రజలపై భారాలు వేసేందుకు, ఉచిత విద్యుత్‌ ను
దశలవారీగా తొలగించడానికి ఈ స్మార్ట్‌ మీటర్ల విధానాన్ని తీసుకువచ్చారు.
        కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి నాడు వైసిపి, నేడు
తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ మీటర్లను కొనసాగించడం గర్హనీయం. ఇప్పటికే 17
వేల కోట్ల రూపాయలు ట్రూ అప్‌ చార్జీల భారం వేస్తున్నారు. మరోవైపు స్మార్ట్‌
మీటర్లు బిగిస్తున్నారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచించటం
తగదు.
        విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు, ట్రూ అప్‌ చార్జీల అంశంపై వైసిపి దారిలోనే
తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తున్నది. ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా
పునరాలోచన చేయాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. స్మార్ట్‌
మీటర్లు ఆపాలి. ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలి.
        స్మార్ట్‌ మీటర్లపై ఎక్కడికక్కడ ప్రజలు సమైక్యమై ప్రతిఘటించాలి .ప్రజా
ప్రతినిధులను నిలదీయాలి. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లు ట్రూ అప్‌
చార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల పిలుపుపై జరిగే ఆందోళనలలో భాగస్వాములు
కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org