కోనపాపపేట మత్య్సకారుల సమస్య పరిష్కరించాలి. - సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది :06 డిసెంబర్‌, 2024.

 

కోనపాపపేట మత్య్సకారుల సమస్య పరిష్కరించాలి. - సిపిఐ(యం)

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం, పొన్నాడ పంచాయితీ కోనపాపపేట గ్రామంలో కాలుష్యానికి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు సిపిఐ(యం) మద్ధతు తెలియజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాలుష్యానికి కారణమైన పైపులైన్‌ తొలగించడంతోపాటు నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నది.

కోనపాపపేట గ్రామంలో అరబిందోకి చెందిన లైఫ్‌ష్యూ మందుల కంపెనీ సముద్రంలో పైపులైన్లు వేయడంతో కాలుష్యం విడుదలై చేపల ఉత్పత్తి దెబ్బతింటోంది. వలలు చిరిగిపోవడం జరుగుతుంది. ఫలితంగా మత్య్సకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై గత సంవత్సర కాలంగా ఆ గ్రామస్థులు వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని కొంత మంది మధ్య దళారులు మత్స్యకారుల్ని మభ్యపెట్టి మోసం చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల కోడ్‌ వచ్చిందని అధికారులు ఆందోళన విరమింపచేసి 6నెలలు గడిచినా అతీగతీ లేదు. ఎన్నికలలో సమస్యను పరిష్కరిస్తామని జనసేన నాయకులు పవన్‌కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. గ్రామస్థులు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడంతో అనివార్యమై మత్స్యకారులు మళ్లీ ఆందోళనకు దిగారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మత్స్యకారులతో చర్చించి సమస్యను పరిష్కరించాల్సిందిగా సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి