ప్రజలపై విద్యుత్‌ భారం మోపే ‘‘యాక్సిస్‌’’ కంపెనీ ప్రతిపాదనలను తిరస్కరించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 జనవరి, 2025.

ప్రజలపై విద్యుత్‌ భారం మోపే ‘‘యాక్సిస్‌’’ కంపెనీ
ప్రతిపాదనలను తిరస్కరించాలి
వినియోగదారులపై భారం మోపే రీతిలో యాక్సిస్‌ విండ్‌ ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలు తుది ఒప్పందం కొరకు చేసిన తాజా ప్రతిపాదనలను భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) వ్యతిరేకిస్తున్నది. ఈ ప్రతిపాదనలను ఎపిఈఆర్‌సి తిరస్కరించాలని కోరుతున్నది.
2019లో పవన విద్యుత్‌ యూనిట్‌ రు. 4.27కు 1174.90 మె.వా. కోసం 25 సంవత్సరాలకు ఎపిఎస్‌పిడిఎల్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ అనుమతి కోరింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా ఒప్పందం చేసుకున్నారని విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ 19.04.2024న అనుమతి నిరాకరించింది. విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ నిరాకరించటంపై యాక్సిస్‌ సంస్థ విద్యుత్‌ ట్రిబ్యునల్‌కు వెళ్ళింది. ఈ ఒప్పందాలను పునఃపరిశీలించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా డిస్కంలు సుప్రింకోర్టుకు వెళ్ళవచ్చు. కాని కోర్టుకు వెళ్ళకుండా మరల అదే సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రతిపాదనలను రూపొందించారు. అవసరం అయితే పోటీ బిడ్డింగ్‌ మార్గదర్శకాలను అనుసరించి పవన విద్యుత్‌ సేకరించవచ్చునని ఆనాడు విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ సూచించింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండానే యాక్సిస్‌ విండ్‌ ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తో యూనిట్‌ ధర రు.4.27కు నాడు ఒప్పందం చేసుకున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలు, మరల నేడు కూడా పోటీ బిడ్డింగ్‌ లేకుండానే యూనిట్‌ 4.28 పైసలకు అదే సంస్థతో ఒప్పందాలు (పి.పి.ఎలు) కుదుర్చుకోవాలని ప్రతిపాదనలు పెట్టారు. ఈ ఒప్పందాల వలన రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులపై సుమారుగా 14,000 కోట్లకు పైగా భారంపడుతుంది.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాక్సిస్‌ విండ్‌ పవర్‌ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వానికి వినియోగదారుల విస్తృత ప్రయోజనాలపై ఆసక్తి ఉంటే, డిస్కంలు నిజమైన పోటీ బిడ్డింగుల ద్వారా విద్యుత్‌ ఒప్పందాలు చేసుకునే విధంగా ఆదేశించాలని సిపిఐ(యం) డిమాండు చేస్తున్నది. ఈ పిపిఎలపై సరైన వైఖరి తీసుకొని, ఈ పిటిషన్లను విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నది. రాష్ట్రంలో విస్తృత వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, విద్యుత్‌ రంగం క్రమబధ్ధంగా అభివృద్ధి చెందటంకోసం విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ పిటిషన్లపై బహిరంగ విచారణలు నిర్వహించాలని, యాక్సిస్‌ విండ్‌ కంపెనీ యొక్క పిటిషన్లను తిరస్కరించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

 

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org