మాటలు ఘనం - ఆచరణ శూన్యం గవర్నర్‌ ప్రసంగంపై సిపిఐ(యం)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 ఫిబ్రవరి, 2025.

మాటలు ఘనం - ఆచరణ శూన్యం

గవర్నర్‌ ప్రసంగంపై సిపిఐ(యం)

రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేడు చేసిన ప్రసంగం, టిడిపి కూటమి యొక్క అరిగిపోయిన ఎన్నికల మేనిఫెస్టోలాగా ఉంది. ఎన్నికల హామీల్లో పేర్కొన వివిధ పథకాలను మరోసారి పునశ్చరణ చేశారే తప్ప, వాటి అమలు గురించి నిర్దిష్టంగా ఏమీ చెప్పకపోవడం ప్రజలకు నిరాశ కలిగించింది. రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న తీరులో సాగిన ప్రసంగం వాస్తవ పరిస్థితిని చూడ నిరాకరించడమే అవుతుంది. కీలకమైన వ్యవసాయ మద్దతు ధరల కల్పన, గ్రామీణ పేదల ఉపాధి హామీ, పరిశ్రమల్లో భద్రతా చర్యలు వంటి అంశాల ఊసే లేదు. సూపర్‌ సిక్స్‌, తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ తదితర హామీల అమల్లో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెగా డిఎస్‌సి ప్రకటన గురించి పేర్కొన్నారే తప్ప అది ఎప్పుడు ఆచరణలోకి వచ్చేదీ చెప్పనేలేదు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో క్లాస్‌3,4 పోస్టులు, టీచర్ల వంటివి వంద శాతం ఆదివాసులకు రిజర్వ్‌ చేసే జిఒ 3 పునరుద్ధరణపట్ల మౌనం దాల్చడం దారుణం. ముఖ్యమంత్రి వాగ్దానం మాటల్లో తప్ప కనీసం గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొనకపోవడం ఆదివాసీ యువతను వంచించడమే. దళితులు, బిసి, మైనార్టీల సంక్షేమం గురించి నిర్దిష్టంగా ఏమీ లేదు. మహిళలపై ప్రతినిత్యం అత్యాచారాలు జరుగుతున్నా స్పందన లేదు. యాప్‌లు సృష్టించడం దానికి పరిష్కారం కాదు. అలాగే ఇప్పటికే టీచర్లు, అంగన్‌వాడీ, ఆశా తదితర ఉద్యోగులు మొబైల్‌ యాప్స్‌ వద్దు మొర్రో అంటుంటే ఎన్నెన్నో కొత్త యాప్స్‌ కొత్తగా తెస్తామని గొప్పగా చెప్పడం దారుణం.

కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి ప్రస్తావనే లేదు. ప్రత్యేకహోదాను వదులుకొని పెట్టుబడులకోసం దేశాలు పట్టుకొని తిరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రసంగంలో పేర్కొన్న పెట్టుబడుల ఒప్పందాలు ఇంత వరకు ఒక్కటీ ఆచరణకు రాలేదు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనే ఎంతో కొంత పురోగతి ఉంది. దాన్ని విస్మరించడమే కాదు కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా దెబ్బతీస్తున్నారు.

మిర్చి, ధాన్యం, పత్తి తదితర పంటలకు మద్దతు ధర లభించని పరిస్థితి, ఇంకొన్ని పంటలకు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో రైతులు, కౌలుదార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దయనీయ స్థితిలో ‘నేడు ఏ రైతు కూడా కష్టాల్లో లేరని చెప్పడానికి మేము గర్విస్తున్నాము’ (పేరా 47) అని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పడం వాస్తవాలను కప్పిపుచ్చడమే. ప్రభుత్వమే ఇంత ‘గర్వపడుతుంటే’ రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి గురించి సానుకూల చర్యలు తీసుకుంటుందని ఆశించగలమా? అదేవిధంగా వ్యవసాయానికి ఆయువుపట్టయిన సాగునీటి విషయంలోనూ సర్కారు దృష్టి తేడాగా ఉంది. కొత్తగా నీటి విధానం (వాటర్‌ పాలసీ) తీసుకొస్తామంటూ అందులో ‘గృహ అవసరాలు, పారిశ్రామిక, వ్యవసాయ మరియు ఇతర వినియోగదారక్లు’ (పేరా 39) అని ప్రాధాన్యత నిర్ణయించడం పలు సందేహాలకు తావిస్తోంది. పెరిగిన విద్యుత్‌ చార్జీల భారం, అదాని - సెకీ తప్పుడు ఒప్పందాల గురించి ప్రస్తావన లేదు. గిరిజన హక్కులకు ముప్పు ఏర్పడిరదంటూ ఇటీవల ఏజన్సీ బంద్‌ సైతం నిర్వహించిన నేపథ్యంలో ఆ హక్కుల రక్షణ గురించి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం నిర్లక్ష్యం వహించడమే.

టిడిపి కూటమి మేనిఫెస్టో లోని వివిధ పథకాలను ఎప్పుడు, ఎంత విస్తృతంగా అమలు చేసేదీ, సమాజంలోని అట్టడుగు వర్గాలు, తరగతుల సంక్షేమానికి తీసుకోబోయే చర్యల గురించి నిర్దిష్టంగా పేర్కొంటూ గవర్నర్‌ ప్రసంగాన్ని సవరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి