
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 ఫిబ్రవరి, 2025.
స్మార్ట్ మీటర్లపై ఏపిఈఆర్‌సి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
సిపిఐ(యం) డిమాండ్
రాష్ట్ర ప్రజలు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిస్కౌంలు ప్రతిపాదించిన విధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ఏపిఈఆర్‌సి ఇచ్చిన తీర్పును సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ తీర్పును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది. క్వాజీ జ్యుడీషియల్ అథారిటీగా ఉంటూ వినియోగదారుల హక్కులను పరిరక్షించాల్సిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాంగంగా మారిపోయిందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించాలని, బిగింపులను ఎక్కడకక్కడ తిరస్కరించాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
ఇది నూటికి నూరు పాళ్ళు కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వినియోగదారులపై అదనపు భారం అవుతుంది. ఈ విధంగా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఏపిఈఆర్‌సికి గాని లేదు. ఒక వైపు ఛార్జీలు పెంచడం లేదంటూనే మరొకవైపు చార్జీల పెంపుదలకు మూలంగా ఉండే స్మార్ట్ మీటర్లు బిగించడం దొడ్డి దారిన చార్జీల భారాన్ని పెంచటమే.
దీనికి ముందు సెకీ ద్వారా అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాలను ఏపిఈఆర్‌సి ఖరారు చేసింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అదానీ అవినీతి బట్టబయలై, ఆ ఒప్పందాలను పలు రాష్ట్రాలు, దేశాలు తిరస్కరించి వెనక్కు పంపిస్తున్న నేపథ్యంలో మన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి దానికి ఆమోదముద్ర వేయడం అవినీతికి ఆమోదం తెలపటమే. లక్ష ఇరవై వేల కోట్ల అదనపు భారాన్ని వినియోగదారులపై హక్కు ఏపిఈఆర్‌సికి లేదు. సెకీతో జరిగిన ఒప్పందాల వల్ల వినియోగదారులపై అదన భారం పడుతుందని విద్యుత్ శ్వేతపత్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పేర్కొన్నది. అయినా ఏపిఈఆర్‌సి దీనికి ఆమోదం తెలపడం గర్హనీయం. వెంటనే సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల తీర్పును ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాంగంగా ఉన్న ఏపిఈఆర్‌సి వల్ల వినియోగాలకు ఎలాంటి ప్రయోజనం లేదని రుజువైంది. దీనివల్ల అదనపు ఖర్చు తప్ప రాష్ట్రానికి ఒరుగుతున్నదేమీ లేదు. ఈ తతంగం మొత్తం రాష్ట్రప్రభుత్వం తప్పుడు విధానాలకు ఒక చట్టబద్ధమైన ఆమోదముద్ర వేసుకోవటానికే అని స్పష్టమవుతున్నది. ఏపిఈఆర్‌సి ప్రపంచ బ్యాంకు ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసిందని 20 ఏళ్ల క్రితం సిపిఐ(యం) దీన్ని వ్యతిరేకించింది. సిపిఐ(యం) చేసిన డిమాండ్ సరైనదేనని ఆచరణలో రుజువైంది. ఇప్పటికైనా ఏపిఈఆర్‌సి తన వైఖరి మార్చుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి