
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 ఫిబ్రవరి, 2025.
శాసనమండలి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి - సిపిఐ(యం) డిమాండ్
ఈరోజు రాష్ట్రంలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ప్రత్యేకించి రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. ఏకపక్షంగా పోలింగు జరిగిన బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.
పట్టభద్రులు, ఉపాధ్యాయులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే వీలు లేకుండా అధికార పార్టీ శాసన సభ్యులు, మంత్రులు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అనేకచోట్ల ఉపాధ్యాయులను నయానా, భయానా లొంగదీసుకునే ప్రయత్నాలు చేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అనేక చోట్ల నిబంధనలకు విరుద్దంగా పోలింగ్ స్టేషన్‌లలోకి చొరబడి ప్రచారం చేయడమేగాకుండా ప్రత్యర్థి అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లను బెదిరించారు. ప్రత్యేకించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్‌లను బెదిరించడమే కాకుండా కొన్ని బూత్‌ల నుండి బైటకు గెంటేసి ఓట్లు గుద్దుకున్నారు. అనగాని సత్యప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ద వెంకన్న సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రత్యక్షంగా దగ్గరుండి దొంగ ఓట్లు గుద్దించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేశారు.
అనేకచోట్ల పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నిర్వీర్యం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యక్షంగా శాసన సభ్యులే కూర్చుని దొంగ ఓట్లు వేయించారు. దొంగ ఓట్లు వేయడాన్ని ప్రశ్నించిన వారిపై మంగళగిరి, బాపట్ల, భట్టిప్రోలు, చిలకలూరిపేట మొదలగు ప్రాంతాల్లో దాడులు చేశారు. బెల్లంకొండలో దౌర్జన్యం చేయడమే కాకుండా ప్రత్యర్థి ఏజెంట్లపై తప్పుడు కేసులు బనాయించారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రత్యేకించి వెల్దుర్తిలో ప్రత్యర్థులపై దౌర్జన్యం చేసి ఏజెంట్లు లేకుండా ఏకపక్షంగా గుద్దేసుకున్నారు.
మధ్యాహ్నం నుండి ఒక పథకం ప్రకారం అధికార పార్టీ ప్రతినిధులు అనేకచోట్ల ఒక క్రమపద్దతిలో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురంతో సహా అనేక నియోజకవర్గాల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచారు. మీడియాలో వీడియోలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం.
స్వేచ్ఛగా ఎన్నిక జరిగితే గెలవలేమనే భయంతోనే అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడిరది. ఎన్నికల కమిషన్ భారీగా ఓట్లు నమోదైన పోలింగ్ బూత్‌లు మరియు ఘర్షణలు జరిగిన పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ సరళిని వెబ్‌కెమెరాల ద్వారా పరిశీలించి బాధ్యులపై తగు చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ప్రత్యక్షంగా బూత్‌లలో జొరబడి అక్రమాలకు సారధ్యం వహించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి