క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 05 మార్చి, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం : క్రైస్తవ చర్చిల అనుమతులపై విచారణ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కోరుతూ...

రిఫరెన్సు : మెమో నెం.2712164/సిపిఆర్‌ అండ్‌ ఆర్‌డి/ డి8/ 2024. తేది. 10.02.2025.

అయ్యా!

పైన పేర్కొన్న మెమో ద్వారా రాష్ట్రంలో 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీలలో ఉన్న క్రైస్తవ చర్చిలకు అనుమతులున్నవీ లేనివి సమగ్ర విచారణ జరిపి, అనుమతులు లేని ప్రార్థనా మందిరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది క్రైస్తవులపట్ల మత వివక్షతను పాటించడమే.

రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఎంత చిన్న కుగ్రామమైనప్పటికీ అన్ని విశ్వాసాలున్న ప్రజలు ` సంస్థలు దేవాలయాలు మసీదులు, చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాలు స్థోమతను బట్టి నిర్మించుకుంటుంటారు. దీనికి ఏ ఒక్క మతంతో సంబంధం లేదు. అన్ని మతాలలో ఇటువంటి ప్రక్రియ సాధారణంగా జరుగుతుంది. చాలా వాటికి అనుమతులుండవు. వీటికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోరు. ఇప్పుడు అనుమతులు లేవు అనే సాకుతో చర్చిలపై మాత్రమే చర్యలు తీసుకోవాలనుకోవడం ఒక మతంపై కక్షసాధింపు అవుతుంది. ఇది ప్రజల మధ్య అనైక్యత విద్వేషాలను సృష్టిస్తుంది.

క్రైస్తవ చర్చిలపైన మాత్రమే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోమని ఉత్తర్వులివ్వడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. ప్రత్యేకంగా ఒక మతాన్ని లక్ష్యం చేసుకొని ఇచ్చిన ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి