
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 మార్చి, 2025.
అవాస్తవాలతో అసెంబ్లీని, ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దు
విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనపై సిపిఐ(యం)
తమ కూటమి అధికారానికి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచలేదని శుక్రవారంనాడు శాసనసభలో మంత్రి జి రవికుమార్ అవాస్తవాలు చెప్పడాన్ని సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. టిడిపి కూటమి అధికారానికి వచ్చిన తరువాతనే రెండు పర్యాయాలు ట్రూ అప్/ ఎఫ్‌పిపిసిఎ పేరుతో సుమారు పదహారు వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేసిన మాట నిజం కాదా? అంతేగాక గత వైసిపి సర్కారు యూనిట్‌కు ఆరు పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని ఏకంగా రూపాయికి పెంచితే దానికి చట్టబద్ధత కల్పించింది టిడిపి కూటమి ప్రభుత్వమే కదా! అంతెందుకు ఇప్పటికీ ప్రతి నెలా ప్రతి యూనిట్‌కు 40 పైసల చొప్పున ఎఫ్‌పిపిసిఎ చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నది కూటమి సర్కారే కదా! ప్రజలపై గత ప్రభుత్వం వేసిన భారాలను కొనసాగిస్తూ, ఇంకొన్ని కొత్త భారాలను మోపుతూనే మంత్రి నిండు శాసనసభలో అలా ప్రకటించడం సభను రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడమే.
‘విద్యుత్ చార్జీలు నియంత్రిస్తాం’ అన్న శీర్షికలో ‘విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తాం’ అని కూటమి మేనిఫెస్టోలో హామీనిచ్చారు. చంద్రబాబు నాయుడు ఉపన్యసించిన భారీ ఎన్నికల సభల్లో ఇదే విషయం గట్టిగా చెప్పారు. వైసిపి ప్రభుత్వం పాలనలో రకరకాల పేర్లతో వేసిన వేల కోట్ల రూపాయల భారం తో బాధ పడుతున్న రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటతో ఊరట చెందారు. రానున్న ఐదేళ్లూ కరెంటు చార్జీలు పెరగవని భావించారు. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు సార్లు ఎఫ్‌పిపిసిఎ చార్జీల భారం మోపింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రూ.6,072.86కోట్ల ఎఫ్‌పిపిసిఎ ఛార్జీల భారం మోపుతూ 25-10-2024వ తేదిన ఎపిఇఆర్‌సి ఉత్తర్వులు విడుదల చేసింది. 2024 నవంబర్ నుంచి 2026 జనవరి వరకు వీటిని వసూలు చేస్తున్నారు. 2023`24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రూ.9,412 కోట్ల ఎఫ్‌పిపిసిఎ చార్జీల భారం మోపుతూ 29-11-2024వ తేదిన ఎపిఇఆర్‌సి ఉత్తర్వులిచ్చింది. 2024 డిసెంబర్‌లో మొదలైన వసూలు 2026 నవంబర్ వరకూ కొనసాగుతుంది. ఈ రెండిరటికి అదనంగా నెలనెలా ఎఫ్‌పిపిసిఎ చార్జీ యూనిట్‌కు 40 పైసలు వసూలు చేస్తున్నారు. ఈ భారాలు టిడిపి కూటమి వేసినవే కదా!
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లలోపు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పినా చాలాచోట్ల అమలు కావడం లేదు. బకాయిల పేరుతో వేల రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం తప్పుడు విద్యుత్ ఒప్పందాలు చేసుకొని లక్షా 80 వేల కోట్ల భారాన్ని వేసిందని శ్వేతపత్రంలో పేర్కొన్నా, ప్రభుత్వం మాట మార్చి ఆ భారాన్ని జనంపై మోపడం వాస్తవం అవునా కాదా చెప్పాలని సిపిఐ(యం) కోరుతోంది. ఛార్జీలు పెంచేది లేదని తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను.
నెలనెలా పెరుగుతున్న కరెంటు బిల్లులు చెల్లిస్తూ ఉసూరుమంటున్న వినియోగదార్లు ప్రభుత్వ అబద్ధాలను నమ్మబోరు. గత ప్రభుత్వం అదాని కంపెనీతో చేసుకున్న అవినీతికరమైన సెకి విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయకుండా టిడిపి కూటమి సర్కారుకు జగన్ ప్రభుత్వానికీ తేడా లేదని రుజువు చేసింది. అదాని అవినీతిని కప్పిపుచ్చడానికి మోడీ జగన్ చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. స్మార్ట్ మీటర్ల విషయంలోనూ ఈ సర్కారు మాట తప్పింది. వాగ్దానాలను విస్మరించడమేగాక ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసగించి ఎల్లకాలం పాలన సాగించలేరు. విద్యుత్ భారాలు మోస్తున్న ప్రజలు తప్పక ప్రతిఘటిస్తారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానరు.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి