
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 ఏప్రిల్, 2025.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు
హోదా, విభజన హామీల అమలుకోసం పోరాడాలని
చంద్రబాబుకు సిపిఐ(యం) విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ముగిసిన అంశం అని 16వ ఆర్థిక సంఘం చైర్‌పర్సన్ పనగరియ చెప్పడం పట్ల సిపిఐ(యం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని వాగ్దానం చేశారు. ఆయన ప్రకటనపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు గత పది సంవత్సరాలుగా ఆశతో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆశలను అడియాసలు చేసి వెన్నుపోటు పొడిచింది. 14వ ఫైనాన్స్ కమిషన్ ఇది తమ పరిధిలోకి రాదు అని చెప్పగా 16వ కమిషన్ చైర్మన్ ముగిసిన అధ్యాయమని చెప్పడాన్నీ సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రణాళికా సంఘం రద్దయినంత మాత్రాన ప్రభుత్వ విధానం మారదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కావున నీతి ఆయోగ్‌తో నిమిత్తం లేకుండా 16వ ఆర్థిక కమిషన్ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక హోదా కోసం సిఫారసు చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి
రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమర్పించిన మెమోరాండంలో గాని ముఖ్యమంత్రి వివరణలో గాని ఎక్కడా ప్రత్యేక హోదాను, రాష్ట్ర విభజన హామీలను ప్రస్తావించకపోవడం అన్యాయం. పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీల చుట్టూ తిరిగి నిరాశపడే కన్నా, వారు పెట్టే అలివి మాలిన నిబంధనలకు లొంగీ మన వనరులను దోచిపెట్టే కన్నా ప్రత్యేకహోదా వస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి. పెట్టుబడి పెట్టేవాళ్లే మన చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకహోదా ప్రాముఖ్యత కలిగింది. గత పది సంవత్సరాల అనుభవం దీన్నే రుజువు చేస్తున్నది. ఈ 10 ఏళ్లలో ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీ పేరుతో మోసపోయి అప్పులు పాలై రాష్ట్రం వెనకబడిపోయింది అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికైనా ప్రత్యేకహోదా విభజన హామీల అమలుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది. అంతేకాదు మన రాష్ట్రంలో ఉన్న సంపన్నులు ఎవరూ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడటం లేదు. ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళిపోతున్నారు. వారు మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.
బిజెపి మాట రాష్ట్రానికి చేటు
కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతాన్ని కొనసాగించాలని 16వ ఫైనాన్స్ కమిషన్‌ను రాష్ట్ర బిజెపి కోరటం రాష్ట్ర అభివృద్ధికి చేటు. బిజెపి రాష్ట్ర వ్యతిరేక వైఖరిని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది. బిజెపి భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 50% పన్నుల వాటా ఇవ్వాలని ఒకవైపు మెమోరాండం సమర్పిస్తే మరోవైపు బిజెపి 41 శాతం కోరటం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి స్పందించాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి