ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ వివరాలను బయటపెట్టాలి... మల్లాం గ్రామంలో సోషల్‌ బాయికాట్‌ చేసిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 ఏప్రిల్‌, 2025.

ఉర్సా కంపెనీకి కేటాయించిన భూ వివరాలను బయటపెట్టాలి

ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్‌ అనే ఒక ఐటి కంపెనీకి విశాఖపట్నంలో 60 ఎకరాలు భూమి కేటాయించినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి అధికారికంగా భూములు కేటాయించి ఉంటే వెంటనే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. 

విశాఖపట్నంలో ఐటి కంపెనీలకు భూకేటాయింపులపై పారదర్శకంగా ఉండాలని, వాస్తవాలు వెల్లడిరచాలని డిమాండ్‌ చేస్తున్నది. కొద్ది రోజుల క్రితం టిసిఎస్‌కు ఎకరం రూ.99 పైసలకు 21 ఎకరాలు ప్రభుత్వం అమ్మినట్లుగా ప్రకటించింది. టిసిఎస్‌ ఆ భూముల్లో నిర్మాణాలు పూర్తయ్యేలోగా అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తాయని వార్తలు వచ్చాయి. కానీ ఉర్సా కంపెనీకి భూములు కేటాయించినట్లుగా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇది వాస్తవమా కాదా ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. వాస్తవమైతే అంతకన్నా తప్పు మరొకటి ఉండదు. ఐటిలో ఎలాంటి చరిత్ర, అనుభవమూ లేని నిన్న మొన్న ప్రారంభించిన కంపెనీకి ఉచితంగా 60 ఎకరాలు ఎలా కట్టబెడతారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. 

ఐటి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వాలన్న పేరుతో విలువైన భూములను ఉచితంగా ఇవ్వడాన్ని సిపిఐ(యం) వ్యతిరేకిస్తున్నది. వీటికి భూమి ఇచ్చినందుకు కనీసం ప్రభుత్వం వాటాదారుగా కూడా లేదు. లీజు కాకుండా ఏకంగా రూ.99 పైసలకు అమ్మడమంటే ఉచితంగా దారాదత్తం చేయడమే. ఇది ప్రభుత్వం చెబుతున్న పి4 నిబంధనలకు కూడా వ్యతిరేకం. కావున వెంటనే ఈ ఉచిత కేటాయింపులను రద్దు చేసి చట్టబద్దంగా ఐటి కంపెనీలకు లీజులకివ్వాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. లీజు నిబంధనలు అమలు చేయని కంపెనీలపై చర్యలు కూడా తీసుకోవాలని కోరుతున్నది.

మల్లాం గ్రామంలో సోషల్‌ బాయికాట్‌ చేసిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలి.

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో పెత్తందార్లు దళితులను సామాజిక బహిష్కరణకు గురిచేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. శాంతిభద్రతల పేరుతో ఇరువర్గాలకు రాజీచేసి పెత్తందార్లపై ఎలాంటి చర్యలు లేకుండా ప్రభుత్వం రక్షించడం అన్యాయం. గ్రామంలో దళితులకు రక్షణ కల్పించి సామాజిక బహిష్కరణ అమలు చేసిన పెత్తందార్లపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఈ గ్రామంలో పర్యటించి దళితులకు మనోధైర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నది. సమస్యకు మూలమైన విద్యుత్‌ఘాతం వల్ల చనిపోయిన దళిత యువకుని కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించాలని, సామాజిక బహిష్కరణ అమలు జరిగిన కాలానికి బాధితులందిరికీ పరిహారం చెల్లించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి