గిరిజన స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 ఏప్రిల్‌, 2025.

గిరిజన స్పెషల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

జి.వో.నెం.3పై ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకువచ్చి గిరిజన స్పెషల్‌ డిఎస్సీకి కూడా వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. మెగా డిఎస్సీ పూర్తయ్యాక జివో నెం.3 పై ఆలోచిస్తామని మంత్రి సంధ్యారాణి చెప్పడం ఆదివాసీ యువతను నిరాశకు గురిచేసింది.

30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సీ పేరుతో 16,344 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో మన్యం, అల్లూరి రెండు జిల్లాల్లో 889 పోస్టులు ఉంటే గిరిజనులకు దక్కేవి కేవలం 45 పోస్టులే. 1/70 చట్టం పరిధిలో నోటిఫై ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగాల్లో 100% గిరిజనులకే ఇవ్వాలి. దానికోసమే గతంలో జివో నెం.3 అమలు చేశారు. దానిని కోర్టు రద్దు చేశాక ఐదేళ్ళ నుండి ఆందోళనలు చేస్తున్నా ఇప్పటికీ పునరుద్దరించలేదు. ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్దానానికి అతీగతీ లేదు. ఇప్పటికైనా ప్రత్యేక డిఎస్సీని ప్రకటించాలి. మెగా డిఎస్సీకి ముందే ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకువచ్చి అమలు చేస్తున్నట్లుగానే జి.వో.నెం.3పై కూడా ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకురావాలి. గిరిజన యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాల్పి కల్పించాలి. ఆదివాసీ యువత, ఉపాధి అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలి.

మెగా డిఎస్సీలో అభ్యర్థులల అర్హతల్లో మార్పులు చేయాలి.

ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో అభ్యర్థుల అభ్యర్థన మేరకు వయో పరిమితిని 47 సంవత్సరాలు పెంచాలని కోరుతున్నాము. గతంలో అనేకసార్లు నిరుద్యోగులు ఆందోళనలు కూడా చేశారు. టిడిపి కూడా వీటిని బలపర్చింది. వాటిని పరిగణనలోకి తీసుకొని వయో పరిమితి సడలించాలని సిపిఐ(యం) కోరుతున్నది. బిపిఈడి చదివి మెమోలు రాని వారికి కూడా గతంలో మాదిరి అవకాశం కల్పించాలి. లైబ్రేరియన్‌ పోస్టులను కూడా ఈ డిఎస్సీలో కలిపి లేదా ప్రత్యేక నోటిఫికేషనైనా వెంటనే విడుదల చేయాలి.

సిలబస్‌ విస్తృత దృష్ట్యా పరీక్ష 45 రోజులకు కాకుండా 90 రోజులు సమయం ఇవ్వాలని, డిగ్రీలో అభ్యర్థులకు కనీస మార్కులు ఓసీలకు 50%, బిసి, ఎస్సీ, ఎస్టీలకు 45% ఉండాలన్న నూతన నిబంధన తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నది. అభ్యర్థుల విజ్ఞప్తులపై పరిశీలన చేసి ఈ డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి