ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది.

(ఈరోజు (1 మే, 2025) మే డే కార్యక్రమం సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం

రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది

ప్రజలను చీల్చకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే

శ్రామికవర్గం హక్కులు నిలబెట్టుకునేందుకు పోరాడాలి

మేడే వేడుకల్లో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

పెహల్గాంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశం యావత్తు ఒక్కతాటిపై నిలబడి ఎదుర్కోవాల్సి ఉండగా దీనికి మతం రంగు పులిమి ప్రజల్లో విద్వేషాల్లో పెంచి విభజించడం దేశ భద్రతలకు, ఐక్యతకు ప్రమాదమని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో కూడా ఈ ప్రమాదం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో హిందూ, ముస్లిం పేరుతో విభజన తీసుకొచ్చి దేశాన్ని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలను చీల్చి ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టి  ఐక్యతను బలహీనపరిచే వ్యాఖ్యనాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పదవుల్లో ఉన్నవారు చేయకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని సూచించారు. రాష్ట్రంలో మతోన్మాదులు పెట్రేగిపోకుండా, అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టకుండా ఐక్యంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత సిఎంపై ఉందన్నారు. లౌకిక, వామపక్ష పార్టీలు ఉగ్రవాద దాడిని ఖండిరచడమే కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి జాతీయ స్ఫూర్తిని చూపాయని అన్నారు. ఈ జాతీయ స్ఫూర్తిని బిజెపితో పాటు ఎన్‌డిఎ పార్టీలు కూడా ప్రదర్శించాలని చెప్పారు.

మేడే సందర్భంగా ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించిననంతరం మాట్లాడుతూ దేశంలో కార్మికర్గంపై తీవ్ర దాడి జరుగుతోందని సిపిఐ(యం) రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. తరతరాలుగా పోరాడి కార్మికులు సాధించుకున్న హక్కులను నిలబెట్టుకునేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు.  పార్టీ సీనియర్‌ నేత బి.ఆర్‌.తులసీరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల మెడపై కత్తిపెట్టి వారిని 200 ఏళ్ల క్రితం నాటి ఉన్న బానిస వ్యవస్థలోకినెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. రోజుకు 16 గంటలు, 18 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ నారాయణ వంటి కార్పొరేట్లు  ఉద్భోద చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిగంటలు పెంచాలని కోరేవారు కార్మికుల కనీస వేతనాల రెట్టింపుపై మాత్రం నోరుమెదపడం లేదన్నారు. బడా కార్పొరేట్లకు ఈజ్‌డూయింగ్‌ పేరుతో కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు మద్దతు ఇస్తూ వారి దోపిడిని మరింత తీవ్రతరం చేస్తున్నాయని విమర్శించారు. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికవర్గం మే 20వ తేదిన సమ్మెకు పిలుపునిచ్చాయని, దీనికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. అన్ని ప్రజాసంఘాలు, ప్రజలు సహకరించి సమ్మెను జయప్రదం చేస్తేనే శ్రామిక ప్రజలపై జరిగే దాడిని అడ్డుకోగలమన్నారు. కార్మికుల పోరాటాలు బాటపడటం వల్లే వేతనాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పోరాటాలు జరగకుండా ప్రభుత్వాలు నిరంకుశ పద్ధతులు అనుసరిస్తున్నాయని చెప్పారు. కార్మికుల చైతన్యాన్ని పక్కదారి పట్టించేందుకు మతప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్రకమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మికులను బానిసలుగా చేసి పనిచేయించుకునే ప్రమాదం రోజురోజుకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బూర్జువా వర్గం తన భావజాలాన్ని, ఆలోచనలను కార్మిక, మధ్య తరగతి ప్రజలపై రుద్దుతోందన్నారు. బూర్జువా వర్గం చెబుతున్న అంశాలే అభివృద్ధి అనే భ్రమల్లో ఉన్నామని చెప్పారు. అమరావతి రాజధానిలో విమానాశ్రయం పేరుతో మరో 44 వేల ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కార్మిక, శ్రామికవర్గం బలహీనంగా ఉన్న సమయంలో రైతాంగ భూములను పారిశ్రామికరణ పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం సాగుతోందన్నారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న యువతను, శ్రమకు తగ్గ ఫలితం లేని మహిళలను పోరాటాలకు సంసిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేస్తామని కార్మికవర్గానికి సవాల్‌ విసురుతోందన్నారు. ఈ కోడ్‌లను ప్రతిఘటిస్తూ ఈ నెల 20వ తేదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు, కార్మికవర్గం అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, రాష్ట్రకమిటీ సభ్యులు జె.జయరాం, ఎం.సూర్యారావు, యు.వి. రామరాజు, జి.రామన్న తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజానాట్యమండలి కళకారులు పాటలు పాడారు.