(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 04 మే, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే శ్రీ కె.రఘురామకృష్ణంరాజు ఆదేశాలు, ప్రోద్బలంతో పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్ళను, చిన్నదుకాణాలను బుల్డోజర్లతో తొలగించటం... పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ పేదలపై, మహిళలపై మగపోలీసుల బలప్రయోగాన్ని ప్రదర్శించటంపై తగు చర్యలు, విద్వంసం ఆపుట గురించి...
అయ్యా!
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు, ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాలు కలిగి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే శ్రీ.కె.రఘురామకృష్ణంరాజు ప్రోద్భలంతో ప్రారంభంలో ఆకివీడు మండలంలో 355, పాలకోడేరు మండలంలో 165, కాళ్ల మండలంలో 100 మొత్తం 700 పైగా పేదల ఇళ్లను, ఉండిలో చిన్న దుకాణాలు అక్రమంగా కూల్చేశారు. నియోజకవర్గంలో ఇంకా పెద్దసంఖ్యలో కూల్చడానికి పేద ప్రజలకు నోటీసులు కూడా ఇచ్చియున్నారు. మే 15లోగా అన్ని ఇళ్లు కూల్చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. (ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాటిని సైతం) ఇది చాలా అన్యాయం. అమానుషం. అందరికీ ఇళ్ళు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వ నిర్ణయానికి, స్పూర్తికి పూర్తి విరుద్ధం.
పాలకోడేరు మండల కేంద్రం శివారులో ఉన్న అల్లూరి సీతారామరాజు నగర్‌లో 1986లో ఎవరికీ ఇబ్బంది లేని విశాలమైన ఇరిగేషన్ పోరంబోకు పుంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని నాడు కిరోసిన్ దీపాలతో నివాసం ఏర్పరచుకున్నారు. దఫదఫాలుగా మంచినీరు, ఇళ్ళకు విద్యుత్తు కనెక్షన్లు, వీధిలైట్లు, కాలనీకి సిమెంట్ రోడ్డు, రేషన్ కార్డులు, ఆధార్‌కార్డు లాంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించాయి. ఇక్కడ 110 ఇళ్ళల్లో సుమారు 130 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా ఏరోజుకారోజు భవన నిర్మాణ కార్మికులుగాను, రొయ్యలవలుపు కార్మికులుగాను, వ్యవసాయ కూలీలుగాను, ఇంటి పనివారలుగాను పనిచేసుకుంటూ నివసించే పేదలు. ఎవరు అధికారంలో ఉన్నా వారికి వివిధ రకాల సౌకర్యాలు కల్పించారే తప్ప ఎటువంటి ఇబ్బందీ పెట్టలేదు. పైగా పట్టాలు ఇస్తామని వాగ్ధానాలు చేసేవారు. ఉండి నియోజకవర్గంలో కూటమి తరఫున(టిడిపీ) కనుమూరి రఘురామకృష్ణం రాజు ఎమ్మెల్యేగా కొత్తగా గెలిచాక ప్రజలు తమకు పట్టాలు వస్తాయని ఆశించారు. కానీ తద్విరుద్ధంగా పేదల ఇళ్లు అక్రమంగా కూలగొట్టిస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు పెద్ద భూస్వాముల భూములకోసం, వారి భూముల విలువను పెంచడం కోసం, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం ఈ ప్రభుత్వ భూములను సంపన్నులకు అప్పగించేందుకు నిరు పేదల ఇళ్ళను అక్రమంగా, అన్యాయంగా కూల్చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో పేదలు నివసించే భూములను పెద్దలకు కట్టబెట్టడం కోసం ఎవరికీ అభ్యంతరం లేనటువంటి ఇళ్లను అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి, భారీగా పోలీసుల మోహరింపుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా, దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు నిరసిస్తూ ప్రతిఘటిస్తున్నారు. పోలీసులు పేదలను, వారికి అండగా ఉన్న నాయకులను గృహనిర్భంధాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ నివసిస్తున్నటువంటి 130 కుటుంబాల వారిలో కేవలం 62 మందికి గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళ పట్టాలను రెండు ప్రాంతాల్లో ఇచ్చారు. ఒక ప్రాంతంలో రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని 9 పట్టాలు కోర్టులో పెండిరగ్లో ఉన్నాయి. మరో 53 మందికి ప్రభుత్వ కాలనీలో పట్టాలు ఇచ్చారు. కానీ అక్కడ నేటికి పూర్తయిన ఇళ్ళు 4, మరొక 11 ఇళ్ళు సగంలోనే ఉన్నాయి. నిరుపేదలు ఆర్ధిక భారంతో నిర్మించుకోలేక మధ్యలోనే నిలిచిపోయాయి. మరొక 30 మంది అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేక ఇల్లు నిర్మించుకునే స్థోమత లేక ఇక్కడే నివసిస్తున్నారు. కొందరికి మాత్రమే స్ధలాలు ఇచ్చి అందరికీ స్ధలాలు ఇచ్చేసి ప్రత్యామ్నాయం చూపించే ఇళ్ళు తొలగిస్తున్నామని పేదలపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కొందరికి స్ధలాలు ఇచ్చినా ఇచ్చిన చోట నిర్మాణానికి అనువుగా లేదు. పూడ్చుకోవాలి. ఇళ్ళు నిర్మించాలంటే ప్రభుత్వం ఇచ్చే సహాయం ఎంతమాత్రం సరిపోదు అద్దె ఇళ్ళకు అడ్డాన్సు, అద్దె చెల్లించలేని దుస్థితి. ఫలితం కొంపా, గూడు కోల్పోయి పిల్లాపాపలు, వృద్ధులు తీవ్ర మానసిక ఆవేదనతో వీధుల పాలవుతున్న దుస్థితి. జిల్లా అధికారులు కూడా ఎమ్మెల్యేకి వంతపాడుతూ అందరికీ పట్టాలు ఇచ్చినా ఇక్కడ్నుంచి వెళ్లడం లేదని, కాలువలు కలుషితం చేస్తున్నారంటూ లేనిపోని నిందలు వేస్తూ ఈ కారణాలతో కోర్టు ఉత్తర్వులతో మేము పడగొడుతున్నామని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. ఆ ప్రాంతంలో అక్రమంగా, చట్టవిరుద్దంగా తవ్విన ఆక్వా చెరువుల వారు ఉప్పు, కలుషిత నీళ్లు వదలడం వలన ఆ మురుగు నీరు అంతా పంట కాల్వలో కలుస్తుంది తప్ప వీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎటువంటి కలుషితం కావడం లేదనేది వాస్తవం. ఈ కాలువ నీరే ఈ కాలనీవాసులు వంట, గృహవినియోగ అవసరాలకు వినియోగించుకోవడం గమనార్హం. కాని వీరిపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇళ్ళుపడగొట్టమని కోర్టు ఆదేశాలంటూ తప్పుదారి పట్టిస్తున్నారు.
ఎఎస్‌ఆర్ నగర్‌లో పేదల ఇళ్ళను తొలగించడానికి ఏప్రిల్ 20వ తేదీన జెసిబిలు, ప్రోక్లైన్లు తీసుకువచ్చి, ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు కట్ చేయించి, రెవెన్యూ సిబ్బంది, వందల మంది పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, ఫైర్ ఇంజిన్, ఇతర బలగాలతో వచ్చి పేదలపైన పోలీసులు బలప్రయోగంతో భయబ్రాంతులకు గురిచేసి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా దుర్మార్గంగా 39 మంది పేదల ఇళ్ళను అక్రమంగా కూల్చేశారు. అందులో కోర్టు యధావిధిగా (స్టేటస్కో) ఉంచమని ఆర్డర్ ఇచ్చిన 3 ఇళ్ళు 1.జుత్తిగ నాగ దుర్గారావు, 2.మల్లుల చిన వెంకన్న, 3.మల్లుల వెంకట పద్మల ఇళ్ళను కోర్టు ఆదేశాలను కూడా దిక్కరించి కూల్చేశారు. ఈ సందర్భంగా మహిళలపై మగ పోలీసులు దౌర్జన్యంగా చేయిచేసుకొని చాలా దురుసుగా, అమానుషంగా ప్రవర్తించి భౌతికదాడి చెయ్యడంతో ఒక మహిళకు తలకు తీవ్ర గాయమై ఆస్పత్రి పాలయ్యారు. మరో 10మంది మహిళలు, పురుషులు గాయపడ్డారు. (అధికార సిబ్బంది నోటీసు ఇచ్చి మీ ఇళ్లను తొలగిస్తాము అని చెప్పటంతో మెట్ట లక్ష్మి తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురై మూడు రోజుల్లో గుండెపోటుతో చనిపోయారు. అయినా చనిపోయాక కూడా ఆమె పేరుతోనే అధికారులు మరలా నోటీసులు ఇచ్చారు)
ఇదే విధంగా గత 4,5 నెలల కాలంలో ఆకివీడు, ఐ.భీమవరం, దుంపగడప, మోగల్లు, ఉండి, బొండాడ, వేంపాడు, వేండ్ర, పాలకోడేరు గ్రామాల్లో పేదల ఇళ్ళను, చిన్న దుకాణాలను అక్రమంగా కూల్చివేసి వీధులపాలు చేశారు. వీరిలో చాలామంది ఇళ్ళ పన్నులు సైతం కడుతున్నారు. కోట్లాది రూపాయలు తీవ్రంగా నష్టపెట్టారు. ఆకివీడులో నెలల తరబడి పేదల ఇంటి విద్యుత్ కనెక్షన్లు కట్ చేసి ప్రజలను, వృద్దులను, విద్యార్థులను, రోగులను చీకట్లో మగ్గేలా చేసి అమానుషంగా ఇక్కట్ల పాలు చేశారు.
పాలకోడేరు, ఎఎస్‌ఆర్ కాలనీ పొడవునా పేదల ఇళ్ళ వెనుక సుమారు 20 ఎకరాలు డ్రెయిన్, ఇరిగేషన్, పుంత పోరంబోకు కొందరు భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకుని తమ పొలాల్లో కలిపేసుకుని అక్రమంగా పంట వేసుకొని అనుభవిస్తున్నారు. (ప్రభుత్వం వేసిన సర్వే రాళ్ళ ద్వారా కూడా తెలుస్తోంది. ప్రత్యక్షంగా చూడవచ్చు) ఈ కాలనీలో 110 ఇళ్ళు ఉన్నది కేవలం 170 సెంట్ల స్థలంలోనే. ఆకివీడులో కొందరు పెత్తందార్లు ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా భవనాలు నిర్మించి అద్దెలకిచ్చి అనుభవిస్తున్నారు (గతంలో సర్వే మార్కింగులు కూడా జరిగాయి. ఉదా:` గొట్టుముక్కల సత్యనారాయణ రాజు, కనుమూరి అబ్బాయిరాజు). వీరిజోలికి మాత్రం పోవడం లేదు. అంటే పేదలకు అన్యాయం చేసి పెద్దలకు అక్రమంగా కట్టబెట్టడం. ప్రభుత్వం చెబుతున్న పి4 ఉండి నియోజకవర్గంలో రివర్స్‌లో అమలుజరుగుతోంది. పెద్దలనుండి పేదలకు సహాయం కాకుండా పేదలను వెళ్ళగొట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నంలా ఉంది.
కాలుష్యానికి కొన్ని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు కారణం. పలు అధ్యయన రిపోర్టులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. వీరి జోలికి మాత్రం పోవడం లేదు. కాలుష్యానికి నివాస ప్రాంతాల్లోని పేద ప్రజలే కారణమంటూ తప్పు ప్రచారం చేస్తున్నారు. లేనిపోని నిందలు అంటగట్టి వారిపై ప్రతాపం చూపటం అన్యాయం.
కావున తమరు ఈ క్రింది చర్యలు తక్షణం తీసుకొని పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను.
(1) ఇళ్ల తొలగింపు తక్షణం ఆపాలి. ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి. ఇళ్ళకు పట్టాలు ఇవ్వాలి. తొలగించిన ఇళ్ళ వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం (జి.వో.నెం.23) ఇచ్చి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. లేదా ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించుకోడానికి రూ.5 లక్షలు సహాయం చేయాలి. తీవ్రంగా నష్టపోయిన ఇళ్ళు, చిన్న దుకాణా దారులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
(2) కొందరు భూస్వాములు అక్రమంగా కలిపేసుకుని (సర్వే ప్రకారం) అనుభవిస్తున్న భూమి (ఎఎస్‌ఆర్ నగర్, ఉండి బందరుపుంత, ఇతర చోట్ల), వేలాది కొబ్బరి చెట్లు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి. బడా వ్యక్తుల అక్రమ ఆక్రమణలు, భవనాలు తొలగించాలి.
(3) కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ఇళ్ళు తొలగించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి కోర్టు ఉల్లంఘన చర్యలు జరగకుండా చూడాలి. పేదలకు సంబందించి ఒక ప్రాంతంలో కోర్టు స్టే కొందరికి వస్తే అది అదే సమస్య స్వభావం ఉన్న ఆ ప్రాంత వాసులందరికీ వర్తించే సహజ న్యాయ స్వభావ సూత్రంగా చూడాలి. (అందరూ కోర్టులకు వెళ్ళలేరు).
(4) స్త్రీలపై చేయిచేసుకున్న మగ పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
(5) పేదలపై, నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. నిర్బంధం ఆపాలి.
(6) ఈ తొలగింపుల ప్రక్రియలో హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై గుండె ఆగి చనిపోయిన మెట్ట లక్ష్మి (48 సం॥), యర్రా ముత్యాలమ్మ (65 సం॥ - ఎఎస్‌ఆర్ నగర్), సంకాల గోవిందరావు (52 సం॥ - ఆకివీడు), - తదితరులకు నష్టపరిహారం చెల్లించాలి.
(7) ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ఆపి నిస్పాక్షికంగా విచారణ జరపాలి. తగు చర్యలు తీసుకోవాలి. ఆయన చర్యలను, దుర్భాషలను అదుపుచేయాలి. ఎం.ఎల్.ఎ ఒత్తిడి, ఆదేశాలతో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులు చట్టబద్దంగా నడుచుకునే విధంగా నియంత్రించాలి.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి