మామిడి రైతులను సంక్షోభం నుండి ఆదుకోడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 07 జూలై, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: మామిడి రైతులను సంక్షోభం నుండి ఆదుకోడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ...
ఆర్యా!
రాష్ట్రంలో మామిడి పంటకు ప్రధాన కేంద్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా. సుమారు లక్ష ఎకరాల వరకు రైతులు తోతాపురి రకం సాగు చేస్తున్న విషయం మీకు తెలుసు. ప్రత్యేకించి తోతాపురి (బెంగళూరు) రకం మామిడి పండిస్తున్న రైతులు  గత నాలుగు  సంవత్సరాలుగా నష్టంలో ఉన్నారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడం వల్ల మామిడి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. మామిడి ఉత్పత్తి పెరగటంతో మామిడి కొనుగోలు ధర కిలో రూ.2-3లకే పరిమితం చేసి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి మామిడి రైతులను దోపిడీ చేసేందుకు పూనుకున్నారు.
మామిడి రైతులకు కిలో రూ.12లు చొప్పున ధర ఇవ్వాలని అందులో రూ.4లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగతా మొత్తం కిలోకు రూ.8లు మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అందించాలని ప్రభుత్వం నుండి మీరు ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలు కాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి కిలో రూ.4లకు మించి కొనడం లేదు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు రైతులను నిలువునా ముంచుతున్నారు. కాబట్టి పరిశ్రమల గుత్తాధిపత్యం నుండి రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్‌ ఏజెన్సీల ద్వారా ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని కొనుగోలు చేయాలి. మీరిచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.
కర్ణాటక రాష్ట్రం కేంద్రం నుండి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం క్రింద కిలో రూ.16లు చొప్పున 2లక్షల 50 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు.
కేంద్రంలో మీకున్న పలుకుబడి ఉపయోగించి కిలో రూ.16లతో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కనీసం 500 కోట్లు నిధులు రాబట్టి కర్నాటకలో మాదిరి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని పరిశ్రమల ఖాతాల్లో కాకుండా నేరుగా రైతులకు ప్రత్యక్షంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి