విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 08 జూలై, 2025.

 

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి

2024-25 సంవత్సరం విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారం రూ.842 కోట్లు ఉపసంహరించుకోవాలి

విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరోసారి 2024-25 వినియోగంపై అక్రమంగా మోపిన రూ.842 కోట్లు సర్దుబాటు చార్జీలను మోపుతూ సదరన్‌, సెంట్రల్‌ పంపిణీ సంస్థలు చేసిన తాజా ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. 2024 ఏప్రిల్‌ నుండి యూనిట్‌కు 40పైసలు చొప్పున వినియోగదారుల నుండి అదనంగా వసూలు చేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీలు రూ.2,787 కోట్లు వినియోగదారులకు తిరిగి చెల్లించాలని కోరుతున్నది. తప్పుడు లెక్కలు ఇచ్చి అదనపు చార్జీలు వసూలు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఇప్పటికే పెరిగిన కరెంటు బిల్లుతో నానా అవస్థలు పడుతున్న వినియోగదారులపై మరో రూ.842 కోట్లు సర్దుబాటు చార్జీల భారం మోపే ప్రతిపాదనలు చేయడం దుర్మార్గం. ఈ తాజా భారం ప్రతిపాదనలను విరమించుకోవాల్సిందిగా మరోసారి సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. అదనపు  వ్యయానికి  కూటమి  ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజలకు జవాబు చెప్పాలి. తాజా సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటూ నియంత్రణ మండలికి ప్రభుత్వం లేఖ రాయాలి. ప్రజలపై భారం వేయొద్దని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. ఛార్జీలు పెంచలేదంటూనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా యూనిట్‌కు 40 పైసలు చొప్పున మొత్తం రూ.2,787 కోట్లు ముందుగానే ఇంధన సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం మోసపూరితం. ఆ సొమ్మును వినియోగదారులకు తిరిగివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

అధిక రేట్లకు బడా కంపెనీలను నుండి విద్యుత్‌ కొనుగోలు చేయకుండా, వ్యయం తగ్గిస్తామని తద్వారా చార్జీలు కూడా తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం నమ్మబలికింది. కానీ దానికి భిన్నంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అంచనాలకు  మించి రూ.3,586 కోట్లు వ్యయం చేసి, దానిని ప్రజలపై ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌పిపిసిఎ) పేరుతో భారం మోపుతూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు తాజాగా నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపాయి. వాటిని విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ (ఎపిఈఆర్‌సి) ప్రకటించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రతి నెల, ప్రతి వినియోగదారుడు నుండి ప్రతి యూనిట్‌ కు 40 పైసలు సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవే కాకుండా పాత ప్రభుత్వ హయాంలో మూడు రకాల ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల రూపంలో 15,485 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చాక అదనపు భారం మోపింది.

బడా కంపెనీలతో అవినీతికర తప్పుడు ఒప్పందాలను కొనసాగిస్తూ, అధిక రేట్లతో బహిరంగ మార్కెట్‌ లో కొనుగోలు చేస్తూ వ్యయం పెంచారు. దానిని సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై  వేయటం గర్హనీయం.ఏ కార్పొరేట్లకు మేలు చేయటం కొరకు  వినియోగదారులపై ఈ రూపంలో భారం వేయటం తగదు.

2024-25 సంవత్సరంలో అదనపు సర్దుబాటు ఛార్జీలు రూ.842 కోట్లు ప్రతిపాదనతలను ఉపసంహరించుకోవాలి. వాటిని ప్రభుత్వమే భరించాలి. ఇప్పటికే వసూలు చేసిన రూ.2,787కోట్లు వినియోగదారులకు తిరిగి చెల్లించాలి. తూర్పు పంపిణీ సంస్థలో రూ.1,226 కోట్లు మిగులు ఏర్పడినందున వాటిని ట్రూడౌన్‌ ద్వారా ఛార్జీలు తగ్గించి వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేయాలి. యూనిట్‌కు 40 పైసలు వసూలు చేస్తున్న విధానాన్ని ఆగష్టు 1 నుండి నిలిపివేయాలి.

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి