
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 జూలై, 2025.
బిజెపి ఒత్తిడికి లొంగి సామాన్య కార్మికులు, ఉద్యోగుల పొట్ట కొట్టద్దు
టిటిడిలో ఉద్యోగుల సస్పెన్షన్‌పై సిపిఐ(యం) విజ్ఞప్తి
తిరుపతి తిరుమల దేవస్థానం యాజమాన్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, ఆసుపత్రులు తదితర లౌకిక సంస్థల్లో పనిచేస్తున్న హిందూయేతరులను తొలగించటం రాజ్యాంగ విరుద్ధమని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. 2025 జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో (ఎండోమెంట్స్)కు ఈ చర్య భిన్నంగా ఉంది.
హిందూ దేవాలయాల నిర్వహణ, ఆ దేవాలయాల సౌజన్యంతో నడిచే విద్య వైద్య వంటి సంస్థల నిర్వహణ వేరువేరుగా చూడాలని సిపిఐ(యం) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. దేవాలయాలలో అర్చకులు తదితర ఆధ్యాత్మిక స్థానాల్లో తప్ప మిగతా దాని ఆధ్వర్యంలో నడిచే సంస్ధల్లో ప్రభుత్వ సాధారణ నిబంధనల కనుగుణంగా ఉద్యోగుల్ని తీసుకోవాలి. విద్యా వైద్య తదితర లౌకిక సంస్థలలో పనిచేసే ఉద్యోగులను మత ప్రాతిపదికన తొలగించకూడదు. యజమాని కులం, మతాన్ని బట్టి ఉద్యోగులు ఉండాలనడం సరైనది కాదు. అది రాజ్యాంగ విరుద్ధం. చట్టవ్యతిరేకం. దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని హఠాత్తుగా తొలగించటం అమానవీయం కూడా. వారు ఉద్యోగంలో చేరిన సమయంలో ఇలాంటి నిబంధనలు లేవు. కోర్టు కూడా ఇలాంటి వారిని తొలగించడానికి వ్యతిరేకంగా గతంలో తీర్పులు, స్టేలు ఇచ్చినది. వాటిని పక్కన పెట్టి ఇప్పుడు మరల కొత్త వివాదాలకు తావు ఇవ్వటం సమాజంలో అశాంతిని సృష్టిస్తుంది. మత విద్వేషాలు రగిలించి అశాంతిని సృష్టించటం ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది. వారి ఒత్తిడికి లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సస్పెన్షన్ తొలగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.
మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపి అదే మతంలో ఉన్న దళితులు, మహిళలు, బలహీన వర్గాల వారు, ఆదివాసీల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ముందుకు రావడం లేదు. మనుధర్మం పేరుతో కుల వ్యవస్థకు గౌరవాన్ని ఆపాదించి బలపరుస్తున్నది. దేవాలయాల్లో కులాలకు అతీతంగా పౌరోహితులను నియమించటం లేదు. అనేక దేవాలయాలలో, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో కులవివక్షత పాటించబడుచున్నది. ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిలు నిజంగా హిందూమత విశ్వాసకులైతే కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి అన్ని కులాలకు దేవాలయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని కులాల వారికి మహిళలకు దేవాలయాలలో సమానంగా ప్రవేశ అర్హత కల్పించాలి. కానీ కుల వ్యవస్థను కొనసాగిస్తూ అస్పృశ్యతను, అంటరానితనాన్ని పాటిస్తూ మరోవైపు మత విద్వేషాలు పెంచేందుకు టీటీడీని వాడుకోవటం దుర్మార్గం. బిజెపికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేయటాన్ని సిపిఐ(యం) ఖండిస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
