మచ్చలేని మహానాయకుడు అచ్యుతానందన్‌ సంతాపసభ

 

మచ్చలేని మహానాయకుడు  

అచ్యుతానందన్‌ సంతాపసభలో వి.శ్రీనివాసరావు

నేటి యువతకు ఆదర్శం 

 

సామాన్య కార్మికుడి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం వ్యవస్థాపకుల్లో ఒకరైన వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మచ్చలేని రాజకీయ ఆణిముత్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేరళ మాజీ సిఎం వి.ఎస్‌.అచ్యుతానందన్‌ సంతాపసభ మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. విఎస్‌ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఒక నిముషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో విఎస్‌ మచ్చలేని, ఆదర్శ రాజకీయ నాయకుడని అన్నారు. 1964లో సిపిఎం ఏర్పడిన సమయంలో ఉన్న 32 మంది నాయకుల్లో అచ్యుతానందన్‌ ఒకరని, అందరూ చనిపోగా ఆయనే చివరి వారని పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీ బాధ్యత కొత్తతరంపై పడిరదని, విఎస్‌ స్ఫూర్తితో ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. 17 సం॥ల  యువకుడిగా ఉన్న సమయంలో పున్నవ్రాయలార్‌ పోరాటంలో పాల్గొని పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొన్నార తెలిపారు. దేశంలో ఆయన రాజకీయ ఆణిముత్యమని పేర్కొన్నారు. పోరాట నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా అన్ని రకాల బాధ్యతలను నీతి నిజాయితీతో నిర్వహించారని, నిరాడంబర జీవితం గడిపారని వివరించారు. యువతకు ఆయన స్ఫూర్తని అన్నారు. ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న విధానాలతో నేటి యువతలో అసంతృప్తి వస్తోందని, సమాజాన్ని మార్చాలనుకున్న వారెవరైనా కమ్యూనిస్టుల వైపు రావాల్సిన అవసరం            ఉందని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ అచ్యుతానందన్‌ రాజకీయాల్లో అత్యున్నత విలువలను నిలబెట్టారని తెలిపారు. బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థను ఎదుర్కోవడంలోనూ ముందున్నారని పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు కావాలని పోరాడిన వారిలో అగ్రగణ్యులని వివరించారు. సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ దేశంలోనే కేరళను మోడల్‌గా తీర్చిదిద్దడంలో విఎస్‌ కీలక పాత్ర పోషించారన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు మాట్లాడుతూ జమిందారీ వ్యతిరేక పోరాటాల్లో అచ్యుతానందన్‌ చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ప్రజలకోసం పరిపాలన చేసి చూపించారని, కానీ నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేస్తోందని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ పౌరసత్వం ఉన్నవారికే ఓట్లనే విధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యా స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ ప్రజాజీవితంలో అచ్యుతానందన్‌ ప్రతిరోజూ 300 కిలోమీటర్లు ప్రయాణించేవారని పేర్కొన్నారు. ఈఎంఎస్‌ నంబూద్రీపాద్‌ వారసత్వాన్ని కేరళలో నిలబెట్టారని తెలిపారు. సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు జె.జయరాం అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.ఉమామహేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, బి.తులసీదాస్‌, కె.సుబ్బరావమ్మ, ఎ.వి.నాగేశ్వరరావు, సిపిఎం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.