(ఈరోజు (26 జూలై, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
నిర్వాసితులకు న్యాయం చేసి అభివృద్ధి గురించి మాట్లాడాలి
సిఎంకు సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచన
విజన్ 2047 కార్పొరేట్ల కోసం కార్పొరేట్ల చేత రూపొందించిందే
సంపున్నలను వదిలి పి4 పేరుతో టీచర్లపై పడ్డారు
కరేడులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయాలన్న కుట్ర సాగుతోంది
జిందాల్‌కు ఐరన్‌ఓర్ గనుల కేటాయింపు అన్యాయం
లూలూకు ఆర్టీసి స్థలాలు ఇవ్వొదు
మెట్రో స్టేషన్ల పేరుతో భూ పందేరం
రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసి ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి మాట్లాడాలని, ప్రాజెక్టుపైనే కాకుండా నిర్వాసితుల సమస్యలపైనా సిఎం సమీక్ష నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల కాలనీలు, మునక ప్రాంతాలు, హైడల్ ప్రాజెక్టు పేరుతో భూసేకరణ చేస్తున్న ప్రాంతాల్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, నాయకత్వ బృందంతో కలిసి పర్యటించామని, క్షేత్రస్థాయిలో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నామని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం డ్యామును చూపించి అభివృద్ధి నమూనాగా స్వర్ణాంధ్ర సాధిస్తామని చెప్పారని, ఇప్పుడు కొత్తగా దాన్ని పొడిగించి బనకచర్ల అంటూ ప్రాజెక్టు రూపమిచ్చి 40 ఏళ్ల ఫలితాలపై ప్రజలకు చెబుతున్నారని అన్నారు. డ్యామును కాదని నిర్వాసితుల కాలనీలు చూపెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలని అన్నారు. ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి సాగు, తాగునీరు ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ దాని కోసం త్యాగం చేసిన నిర్వాసిత కాలనీల్లో ప్రజలకు తాగేందుకు నీరు లేవని, ఇది సిగ్గుచేటైన విషయమని తెలిపారు. అక్కడ రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక మండలంలో నర్సింగపేట, రాయనపేట గ్రామాల్లో విఆర్‌పురంలో మునక ప్రాంతాల గ్రామాలకు కట్టిన నిర్వాసిత కాలనీలు కాన్సట్రేషన్ క్యాంపులుగా ఉన్నాయని తెలిపారు. ఇళ్లు మధ్యలో తుప్పలు, చెట్లు పెరిగాయని, పైపులైన్లు పగిలిపోయాయని, రోడ్లు, టాయిలెట్లు కూడా లేవని తెలిపారు. విఆర్‌పురం మండలంలో రామవరంలో ఒకేఊరులో రోడ్డుకు ఒకవైపు మునక, మరొకవైపు మునక ప్రాంతంకాదని వారికి న్యాయం చేయడం లేదని తెలిపారు. ఒక గ్రామంలో ఉన్న ఒక వీధి వేరొక రెవెన్యూ గ్రామంలోకి పోయిందని, వారిని నిర్వాసితులుగా గుర్తించడం లేదని అన్నారు. కాంటూరు లెక్కలు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందని, వాటి ఆధారంగా మునక ప్రాంతాల గుర్తింపు చేయడం అన్యాయమని అన్నారు. కుక్కునూరు మండలం బొజ్జరాయిగూడెం గ్రామస్తులను మునక ప్రాంతం నుండి నిర్వాసితులగా వేరొక కాలనీకి వస్తే అది కూడా మునిగిపోయిందని తెలిపారు. దేవీపట్నం మండలంలో ప్రజలు మంచినీటి కోసం 11 కిలోమీటర్లు వెళుతున్నారని, దీనికి అరలీటరు పెట్రోలు ఖర్చుతో కలుపుకుంటే 20 లీటర్ల నీరు రూ.70 అవుతోందని పేర్కొన్నారు. ముసలోళ్లకయితే ఎవరన్నా నీరు తెచ్చిస్తే తాగుతారని, లేకపోతే తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. బోరునీరు సరఫరా చేస్తున్నారని, వాటితో వంటలు చేస్తే ఆకుపచ్చరంగులోకి మారుతున్నాయని వివరించారు. ఒక గ్రామంలో పాఠశాల చెట్టు కింద పెట్టారని, ఆడపిల్లలకు టాయిలెట్లు కూడా లేవని తెలిపారు. ఎన్నికల సమయంలో తప్ప అధికారులు ఆ గ్రామానికి రావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పోలవరం డ్యాము గురించి రివ్యూ చేస్తున్నారని, పునరావాసం పట్టించుకోవడం లేదని అన్నారు. ఒక్కసారైనా పునరావాస కాలనీల గురించి సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం జీవితాలను త్యాగం చేసిన ప్రజలను అడవులపాలు చేసి, కనీస అవసరాలు ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. చిన్నారిగండి కాలనీలో ఇళ్లు కట్టేందుకు ప్రభుత్వం కాంట్రాక్టు ఇస్తే నిర్వాసితుల నుండి రూ.2 లక్షలు తీసుకున్నారని, అదేమని అడిగితే అధికారులు కూడా వత్తాసు పలికారని, ఇదొ పెద్ద కుంభకోణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అటువంటివారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ భూమి 10 ఎకరాలు తీసుకుని పదిసెంట్ల భూమి ఇచ్చారని, పరిహారం, ఇళ్లు, భూమికి భూమి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఎందులోనూ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని అన్నారు. నిర్వాసితులను అనాథలను చేసి గాల్లో దీపాల్లా వారి జీవితాలను పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. పునరావాస కాలనీల్లో ఉంటున్న వారు సమస్యలు చెబితే పాతపంచాయతీ కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్నారని అదెలా సాధ్యమని ప్రశ్నించారు. 2.20 లక్షల నిర్వాసితులయితే 38 వేల మందిని గుర్తించారని, వారిలో 12 వేలమందిని తరలిస్తామని చెప్పి బలవంతంగా ఐదువేల మందిని తరలించారని పేర్కొన్నారు. దేవిపట్నం మండలంలో మొదట మునిగే ప్రాంతంలో ఈ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఐదారేళ్ల క్రితం మొదలుపెట్టిన కాలనీలనే ప్రభుత్వం ఇప్పటికీ నిర్మించలేదని, ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి నిర్లక్ష్యపు చర్యల వల్లే కాపర్‌డ్యామ్ కొట్టుకుపోయిందని అన్నారు. డీప్ టెక్నాలజీ, సాంకేతిక నైపుణ్యం ఉందని చెప్పే ప్రభుత్వం కాంటూరు లెక్కలు చెప్పలేదా, నిర్వాసితుల సమస్యలు గుర్తించలేరా అని ప్రశ్నించారు. జలవనరులశాఖ మంత్రి పునరావాస కాలనీలకు వారం వారం వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. డ్యామును మెగా కంపెనీ కడుతోందని, వారేమీ ప్రభుత్వం మాట వినరని, వారికి కాపలాకాయడమేనని మంత్రుల పని అని తెలిపారు. కాంట్రాక్టు కంపెనీకి ఖచ్చితంగా బిల్లులు చెల్లిస్తున్నారని, పైగా డబ్బులు పెంచుతున్నారని పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతింటే కాంట్రాక్టరు నుండి డబ్బులు వసూలు చేయకుండా రూ.900 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారని అన్నారు. నిపుణుల నివేదిక ఇంతవరకు బయటపెట్టలేదని వివరించారు. పోలవరం చుట్టూ ఎన్నో ప్రశ్నలు తిరుగుతుంటే దాన్ని అభివృద్ధికి నమూనాగా పెట్టి ప్రజలను నమ్మించడం అన్యాయమని పేర్కొన్నారు. పునరావాసం, సమస్యలు, కాలనీలపై దృష్టి పెట్టకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. పునరావాసం చేయకుండా ప్రాజెక్టు పూర్తిచేస్తే మునిగిపోయేవారికి దిక్కుదివాణం ఉండదని, వెంటనే ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని అన్నారు.
కార్పొరేట్లు తయారు చేసిందే విజన్ 2047
స్వర్ణాంధ్ర 2047 కార్పొరేట్ల చేత, కార్పొరేట్ల కోసం తయారు చేసిన ప్రణాళికని శ్రీనివాసరావు విమర్శించారు. దీన్ని బయటపెట్టి ప్రభుత్వం చర్చపెట్టొచ్చని అలా చేయడం లేదని పేర్కొన్నారు. విజన్ పేరుతో ఇష్టారాజ్యంగా భూములు కేటాయిస్తున్నారని, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 7000 ఎకరాలు గ్రామసభ తీర్మానం లేకుండా కంపెనీలకు కేటాయిస్తూ రహస్య జిఓలు ఇచ్చేశారని అన్నారు. కరేడులో పెద్దపోరాటం నడుస్తోందని అన్నారు. అక్కడ ప్రాజెక్టు వద్దని గ్రామసభలో తీర్మానం చేశారని తెలిపారు. ప్రభుత్వం దొడ్డిదారని ప్రజలకు తెలియకుండా రహస్యంగా కొద్దిమందిని పిలిపించుకుని సభలు పెట్టారని అన్నారు. రాజకీయ తగాదా పెట్టి ప్రజలను చీల్చాలని చూస్తే వారంతా ఐక్యంగా ఎదరుతిరిగారని, ప్రజల్లో చీలికితెచ్చి, ప్రశ్నించిన వారిపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలు పాలుచేసి భయోత్పాతం సృష్టిస్తున్నారని అన్నారు. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారిని కేసుల పేరుతో వేధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆ గ్రామాలకు తోడు చుట్టుపక్కల గ్రామాల వారూ కలిసి వస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా లింగసముద్రంలో జిందాల్ కంపెనీకి ఐరన్‌ఓర్ గనులు కేటాయించారని, అసలు కంపెనీయే లేకుండా గనులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఉన్న విశాఖ స్టీలుకు ఇవ్వడం లేదని అన్నారు. అన్యాయం చేస్తూ అభివృద్ధి అనే భూటకపు నినాదాలు ప్రభుత్వం ఇవ్వడం సరికాదని అన్నారు.
పి4 ఫెయిల్యూరు పథకం
పి4 ఫెయిల్యూరు పథకమని, ఎప్పటి నుంచో ఈ పద్దతి ఉందని, అయినా ఆదుకోవడం లేదని పేర్కొన్నారు. కార్మికులకే జీతాలు ఇవ్వని వారు ఉచితంగా దానం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్పొరేట్ల ఎగ్గొట్టిన బకాయిలు లక్ష కోట్లు బకాయిలు, వాటిని వసూలు చేసి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. అనిల్ అంబానికి అనకాపల్లిలో భూములు కేటాయించారని, ఆ కంపెనీపై ఇటీవల ఐటి దాడులు చేస్తోందని, తప్పుడు కంపెనీ అని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అటువంటి వారి నుండి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రాబట్టాలని అన్నారు. ఇలా చేయకపోగా ఫెయిలందనే ఆలోచన వచ్చిన ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల మీద పడుతున్నారని, ప్రజలను దత్తత తీసుకోవాలని కోరుతున్నారని పేర్కొన్నారు.
లూలూకు ఆర్టీసి స్థలాలివ్వొద్దు
విజయవాడ నడిబొడ్డున విలువైన ఆర్టీసి స్థలాన్ని లూలూ కంపెనీకి కట్టబెట్టాలనుకుంటే ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విదేశీ కంపెనీలకు రిటైల్‌లో అనుమతించరాదని, రిటైల్ వ్యాపారం దెబ్బతింటుందని అన్నారు.
వ్యాపారం కోసమే మెట్రో
మెట్రో ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారని, విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని అది చేయకుండా మెట్రో కడతామనడం సరికాదని అన్నారు. విభజన చట్టంలో ఉన్న మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుతో కడతామని చెబుతోందని అన్నారు. మెట్రో అనేది స్టేషన్ల పేరుతో షాపులు ఏర్పాటు చేసి వ్యాపారం కోసం భూములు ధారదత్తం చేసే భూహారతి ప్రాజెక్టని, వాటివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు.
కోహీనూర్ వజ్రం తీసుకొస్తే అభినందనీయం
పవన్ విశాఖపట్నంలో జరిగిన సభలో హరిహరవీరమల్లు సినిమా చరిత్ర అన్నారని, కాదు కల్పన అని తాము చెప్పామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కోహీనూర్ వజ్రం లండన్‌లో ఉందని, కేంద్రంలో కీలకంగా ఉన్న పవన్ కల్యాణ్ దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పెడితే అభినందించొచ్చని పేర్కొన్నారు.
= = = =
